ఏమారితే బుక్కయినట్లే!

ఏమారితే బుక్కయినట్లే! - Sakshi


సాక్షి, కడప : ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో స్మగ్లర్లు కొత్తపంథా అవలంభిస్తున్నారు. ఒకపక్క శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ తరలింపునకు వచ్చి ఎన్‌కౌంటర్‌లో 20 మంది తమిళ కూలీలు చనిపోయినా, స్మగ్లర్లు మాత్రం వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. ప్రతిరోజు పోలీసులు ‘సీమ’ జిల్లాల్లోని అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నా ఏదో ఒక రకంగా చందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకున్న నేపథ్యంలో రూట్లు మారుస్తూ వస్తున్న స్మగ్లర్లు తాజాగా మరో కొత్త మార్గానికి తెర తీశారు.

 

 ఎవరికీ అనుమానం రాని రీతిలో ప్రత్యేక వాహనంలో కాకుండా ప్రైవేట్ బస్సులను ఎంచుకున్నారు. ఆరు నెలల క్రితం  కర్నూలు జిల్లా నంద్యాల డిపోకు చెందిన కొంత మంది ఆర్టీసీ డ్రైవర్లు కూలీలను తీసుకొస్తూ అక్రమ రవాణాకు తెరతీయగా.. తాజాగా ప్రైవేటు బస్సుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆర్టీసీ బస్సుల్లో అయితే అనుమానం వస్తుందని భావిస్తున్న స్మగ్లర్లు గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా చందనం దుంగలను చిన్న బాక్సుల్లో సర్ది సరిహద్దులు దాటిస్తున్నారు. అందులోనూ గుర్తు తెలియని వ్యక్తులు రావడం... హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు తదితర నగరాలకు వెళ్లే బస్సు డ్రైవర్లకు లగేజీ ఉందని చెప్పి బాక్సులను డిక్కీలో వేస్తున్నారు.

 

 లగేజీ డబ్బులంటూ డ్రైవర్‌కు కొంత మొత్తాన్ని అందజేసి తమ పని కానిస్తున్నారు. డ్రైవర్ కేవలం లేగేజీగా భావించి బాక్సులను డిక్కీలో వేయించుకుంటున్నాడు.  అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ బాక్సులను తీసుకెళ్తున్నారు. బస్సులైతే ఎవరికీ అనుమానం రాకపోగా, రాత్రి బయలుదేరిన బస్సు తెల్లవారేలోపే గమ్య స్థానాలకు చేరుకుంటుండడంతో స్మగ్లర్ల పని సులువవుతోంది. మధ్యలో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసినా ఎవరు బాక్సులు పంపింది.. ఎవరు తీసుకుంటారన్న సమాచారం బస్సు సిబ్బంది వద్ద ఉండడం లేదు. దీంతో పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడం కూడా స్మగ్లర్లకు సులువుగా మారింది.

 

 త్రుటిలో తప్పించుకున్న అగంతకులు

 వేంపల్లె నుంచి హైదరాబాదు వెళుతున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఇటీవల ఎర్రచందనం బాక్సులను అగంతకులు వచ్చి లగేజీ పేరుతో పంపించారు. ఈ సమాచారం అందడంతో హైదరాబాదుకు బస్సు చేరుకున్న కొద్దిసేపటికి పోలీసులు ఆ బస్సు వద్దకు వెళ్లారు. అప్పటికే గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆ బాక్సులను కారులో తీసుకు వెళ్లినట్లు డ్రైవర్ అక్కడి పోలీసులకు స్పష్టం చేశారు.

 

 విషయం ఏమిటని ఆరా తీయగా బాక్సుల్లో వచ్చింది లగేజీ కాదని, ఎర్రచందనం దుంగలని వారు చెప్పడంతో డ్రైవర్ అవాక్కయ్యాడు. ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా పెద్ద ఎత్తున లగేజీ తీసుకువచ్చి దూర ప్రాంతాలకు తీసుకెళ్లాలని చెబితే వారి ధ్రువీకరణ పత్రం అడగాలని సూచిస్తున్నారు. బాక్సుల్లో ఏముందని కూడా స్పష్టంగా తెలుసుకోవాలని డ్రైవర్లకు పోలీసులు సూచించినట్లు సమాచారం.

 

 అప్రమత్తంగా ఉండాలి

 ఎర్రచందనంపై నిఘా అధికమైన తరుణంలో స్మగ్లర్లు సులువుగా దుంగలను తరలించేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల లగేజీలాగా దుంగలను ప్యాక్ చేయడంతో గుర్తించడం కష్టంగా మారింది. కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, పోరుమామిళ్ల, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పులివెందుల తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజు దూర ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్ నడుస్తున్న నేపథ్యంలో డ్రైవర్లతోపాటు యాజమాన్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top