ఉడెన్‌ బాక్సులతో ఉపాధి

ఉడెన్‌ బాక్సులతో ఉపాధి


టైల్స్‌ భద్రతలో కీలకం

చీమకుర్తి నుంచి విదేశాలకు తరలింపు

ఒక్కో పరిశ్రమలో దాదాపు 10 నుంచి 15 మందికి ఉపాధి




చీమకుర్తి:  ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌ ప్రాంతంలో   ఇబ్బడిముబ్బడిగా గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లు వెలశాయి. ఈ యూనిట్లలో తయారయ్యే వివిధ సైజుల బ్లాక్‌ గ్రానైట్‌ టైల్స్‌ విదేశాలకు చేరుతుంటాయి. ఈ క్రమంలో పాలిషింగ్‌ టైల్స్‌ భద్రంగా తీసుకువెళ్లేందుకు, ఈ ప్రాంతంలో ఉడెన్‌ ప్యాకింగ్‌ యూనిట్లు వెలిశాయి. గతంలో ఒకటి, రెండు ఉడెన్‌ ప్యాకింగ్‌ యూనిట్లు ఉండగా, ప్రస్తుతం గ్రానైట్‌ ఫ్యాక్టరీలు విపరీతంగా పెరగడంతో ఈ ఉడెన్‌ ప్యాకింగ్‌ యూనిట్లు ఎక్కువగానే వెలిశాయి. పోటీతత్వం పెరగడంతో కార్మికులకు కూడా ఉపాధి లభిస్తోంది.   



విదేశాలకు చేరవేత

ఇక్కడ తయారయ్యే బాక్సులు కంటైనర్ల ద్వారా పాలిషింగ్‌ యూనిట్లకు చేరి అక్కడ నుంచి వివిధ సైజుల్లో ఉండే గ్రానైట్‌ టైల్స్‌ ప్యాక్‌ చేయబడతాయి. అక్కడ నుంచి కంటైనర్‌ ద్వారా క్రిష్ణపట్నం, చెన్నై ఓడరేవులకు చేరి విదేశాలకు చేరుతుంటాయి.



కార్మికులకు ఉపాధి

ఉడెన్‌ ప్యాకింగ్‌ యూనిట్లు ద్వారా నిపుణులైన చెక్కపని వారు సుందరంగా ఉడెన్‌ బాక్సులను వివిధ సైజుల్లో తయారు చేస్తారు. వీరు చీమకుర్తికి మార్కాపురం, మార్టూరు, బొట్లపాలెం ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. చీమకుర్తి ప్రాంతంలో ఉడెన్‌ యూనిట్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి యూనిట్లలో దాదాపు 10 నుంచి 15 మంది వరకు వర్కర్స్‌ పని చేస్తుంటారు. భవిష్యత్‌లో ఇంకా పెరిగే అవకాశం ఉందని ఉడ్‌ప్యాకర్స్‌ యజమానులు అంటున్నారు.   



టైల్స్‌ దెబ్బతినకుండా ఉంటాయి

ప్రస్తుతం ఉడెన్‌ ప్యాకింగ్‌ యూనిట్‌ పరిశ్రమ నాతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తుంది. గ్రానైట్‌ టైల్స్‌ కొనే బయ్యర్లు వచ్చే ఆర్డర్లును బట్టి వివిధ సైజుల్లో తయారు చేసి వారికి అందజేస్తాం. ఈ ఉడెన్‌ ప్యాకింగ్‌ వల్ల గ్రానైట్‌ టైల్స్‌ దెబ్బ తినకుండా విదేశాలకు చేరతాయి.

– ఎస్‌.రమణారెడ్డి, యజమాని, సాయి రాజేశ్వరి



ఉడ్‌ ప్యాకర్స్, చీమకుర్తి ఎంతో మందికి ఉపాధి


ఈ ఉడెన్‌ బాక్సుల పరిశ్రమ ద్వారా నాలాంటి చాలా మంది ఉపాధి పొందుతున్నారు. టైల్స్‌ రవాణాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బాక్సులు తయారు చేస్తాం. ఇలాంటి పరిశ్రమలతో  ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది.  

– ఆదిత్య,  ఉడెన్‌ ప్యాకింగ్‌ వర్కర్‌



 విదేశాలకు రవాణా చేస్తుంటాం

చీమకుర్తి ప్రాంతంలో ఫ్యాక్టరీలు వందలాదిగా ఉన్నాయి. అక్కడ తయారు చేసే వివిధ రకాల గ్రానైట్‌ టైల్స్‌ కొని విదేశాలకు ఎగుమతి చేస్తుంటాం. ఇటీవల జీఎస్‌టీ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడినా తిరిగి గ్రానైట్‌ పరిశ్రమ గాడిన పడింది. విదేశాలకు టైల్స్‌ ప్యాకింగ్‌ చేయాలంటే ఈ ఉడెన్‌ బాక్సులు ఎంతో అవసరం. ఈ పరిశ్రమకు మేం కూడా చేయూత నిస్తాం. ఈ టైల్స్‌ ఏర్పాటు చేసే ఉడెన్‌ బాక్సులు షిప్‌లు ద్వారా అమెరికా, దుబాయ్, చైనా, మలేషియా, కొరియా, జర్మనీ తదితర దేశాలకు రవాణా చేస్తుంటాం.                                   

– బి.కామేష్, బయ్యరు, చీమకుర్తి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top