పచ్చ ‘వారధి’ ఏర్పాటు..


  • పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి కమిటీని ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు

  • అందులో నారా లోకేష్ సహా ఐదుగురు సీనియర్ నేతలకు చోటు

  • సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై విస్త్రత ప్రచారం కల్పించి, తద్వారా పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సమన్వయానికి ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తన కుమారుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్‌తో పాటు మరో ఐదుగురు సీనియర్ నేతలకు అవకాశం కల్పించారు.



    ఈ కమిటీలో మంత్రి యనమల రామకృష్ణుడు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదు కమిటీ కన్వీనర్ కిమిడి కళా వెంకట్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సభ్యులుగా ఉన్నారు. వీరితో శనివారం తన క్యాంప్ కార్యాలయం లేక్ వ్యూ అతిథిగృహంలో చంద్రబాబు సుమారు రెండు గంటలపాటు సమావేశ మయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని పార్టీపరంగా లబ్ధిపొందేందుకు అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు.



    అంతకు ముందు చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వనమాడి వెంకటేశ్వరరావు, వేగుల జోగేశ్వరరావు, పైలా శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు, పీలా గోవింద్ సత్యనారాయణ, పంచకర్ల రమేష్, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితర 35 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశమయ్యారు. వీరికి ఒక్కొక్కరికి 20 నిమిషాల సమావేశం కేటాయించారు.



    నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు గత ఆరు మాసాల్లో వారి పనితీరును సమీక్షించారు. నియోజకవర్గంతో పాటు జిల్లాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం వారందరితో కలిసి చంద్రబాబు భోజనం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన సమావేశంలో పాల్గొన్న లోకేష్ పార్టీ నేతలు చెప్పిన వివరాలు నమోదు చేసుకున్నారు. తాను ప్రభుత్వ పనితీరుపై చేయించిన సర్వేను చంద్రబాబుకు అందచేశారు.

     

    కిందిస్థాయిలో అవినీతిపై ప్రజల్లో అసంతృప్తి



    కిందిస్థాయి ప్రభుత్వ పాలనా యం త్రాంగంలో అవినీతి ఎక్కువగా ఉంది.. ప్రజ లు దానిపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గత ఆరు నెలల ప్రభుత్వ పనితీరుపై లోకేష్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కిందిస్థాయిలో అవినీతి ఎక్కువగా ఉందని సుమారు 35 శాతం మంది ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే విషయాన్ని నేతలకు చంద్రబాబు వివరించారు. ప్రజా ప్రతినిధులు కూడా అవినీతిని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైంది.



    రైతు రుణ మాఫీ పట్ల 60 శాతం మందికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. వివిధ నిబంధనల వల్ల కొందరిలో అసంతృప్తి ఉంది. ఎన్‌టీఆర్ భరోసా పట్ల 90 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్రాంతి కానుక పట్ల 85 శాతం ప్రజల్లో హర్షం వ్యక్తమౌతోంది. గ్రామీ ణ ప్రాంతాల్లో రోడ్లు, తాగు నీటి సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది. విద్యుత్ సరఫరా తీరుపై 95 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.



    సీఎంగా చంద్రబాబు పనితీరుపై 75 శాతంకు పైగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదు కమిటీ కన్వీనర్  కళావెంకట్రావ్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్,మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌లు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పార్టీ వారధిగా పనిచేస్తుందన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top