విద్యుత్ బిల్లులే కీలకం....!


లెవీ అక్రమాలను నిగ్గు తేల్చే విషయంలో రైస్ మిల్లుల విద్యుత్ బిల్లులు కీలకం కానున్నాయి. అయితే ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం ముందుకు వెళ్లడం లేదు. విద్యుత్ శాఖ సిబ్బంది కూడా వివరాలు అందజేసేందుకు సహకరించడం లేదని తెలిసింది.  జిల్లాలో రైతుల నుంచి తీసుకున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, అందులో 67 శాతం బియ్యాన్ని లెవీకి అందించాల్సిన మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్‌తో పాటు జిల్లా అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నా కీలకమైన విద్యుత్ బిల్లులను తీసుకోవడంలో యంత్రాంగం అలసత్వం వహిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 140 మిల్లులు ఉన్నప్పటికీ అందులో దాదాపు 65 మిల్లుల వరకూ ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తూ లెవీకి బియ్యాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్‌కు బదులు పీడీఎస్ బియ్యాన్ని కలుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని నిరోధించేందుకు  జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించాలని జేసీ రామారావు ఆదేశాలు జారీ చేశారు. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా అధికారులు వ్యవహరించారు. అక్రమాలను నిగ్గు తేల్చేందుకు కీలకమైన విద్యుత్ బిల్లుల జోలికి వెళ్లలేదు. టన్ను  ధాన్యం ఆడేందుకు ఎంత విద్యుత్ వినియోగమవుతుందో లెక్కిస్తే, మిల్లకు  కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యంతో సరి పోలిస్తే వారు ధాన్యం ఆడుతున్నారా? లేక పీడీఎస్ బియ్యం సరఫరా చేస్తున్నారా ? అన్న విషయం తేటతెల్లమయ్యేందుకు అవకాశాలున్నాయి. కానీ అధికారులు ఈ విషయంలో మీన మేషాలు లెక్కిస్తున్నారని  పలువురు ఆరోపిస్తున్నారు.

 విద్యుత్ అధికారుల ప్రమేయం?

 జిల్లాలో ఉన్న దాదాపు 140 మిల్లులలో విద్యుత్ వినియోగం రీడింగ్ నమోదులో స్పష్టత లేదని తెలిసింది. మిల్లుల్లో వినియోగమవుతున్న విద్యుత్‌కు, నమోదవుతున్న రీడింగ్ తేడాలుంటున్నాయని సమాచారం. జిల్లాలో ఉన్న మిల్లులు తరచూ వస్తున్న రీడింగ్‌కు,   మిల్లింగ్ చేసి ఇచ్చిన లెవీ బియ్యాన్ని ఆడించేందుకు ఎంత విద్యుత్ వినియోగమవుతోంది అన్న వివరాలను పరిశీలిస్తే విషయం తెలుస్తుందని చెబుతున్నారు. అయితే దీనికి కొంతమంది విద్యుత్ సిబ్బంది  సహకరించడం లేదని సమాచారం. దీంతో చివరకు జేసీ రామారావు రంగంలోకి దిగి, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈకి లేఖ రాయవలసి   వచ్చింది.  క్షేత్రస్థాయిలో విద్యుత్ రీడింగ్ పర్యవేక్షించాల్సిన అధికారుల ప్రమేయం కూడా ఉండబట్టే ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top