ఆగస్టు నాటికి లోటుపాట్లు లేని ఓటర్ల జాబితా


 శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ ఏడాది ఆగస్టు నాటికి లోటుపాట్లు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తామని రాష్ర్ట ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మంది రంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఓటర్ల జాబితాపై ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుల లేని జాబితాను సిద్ధం చేసేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఓటుకు ఆధార్ కార్డును అనుసంధానం చేయడంపై పలు పార్టీల నాయకులు అభ్యంతరం తెలిపారు. ఆధార్‌కార్డులు లేని వారి ఓటును తొలగించడం వల్ల నష్టం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు సైతం ఆధార్ కార్డు తప్పనిసరి కాదని తెలిపిందని గుర్తుచేశారు.

 

  ఓటర్ల జాబితా సవరణలు, లోటుపాట్లు సరిదిద్దేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ బూతు లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై భన్వర్‌లాల్ స్పందిస్తూ జూలై రెండు నుంచి జరగనున్న నవనిర్మాణ కార్యక్రమాల్లో ఆధార్ అనుసంధానంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆగస్టు నాటికి శతశాతం ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపారు. దీనివల్ల ఓటరు ఎక్కడికెళ్లినా అక్కడ తన ఓటును సులభంగా పొందవచ్చన్నారు. జిల్లాలో ఆధార్ అనుసంధానంకోసం ఇంటింట సర్వే చేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు. ఆధార్ అనుసంధానంలో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానం లో ఉందని, శతశాతం పూర్తిచేసేందుకు అం దరూ కృషి చేయాలని కోరారు. ఇంతవరకు 74 శాతం పూర్తి చేశారని, మిగిలిన 26 శాతం ఓటర్ల ఆధార్‌లను అనుసంధానం చేయాలని సూచిం చారు.

 

 దీర్ఘకాలిక వలస ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని కోరారు. ఇంటికి తలుపులు వేసి ఉంటే మరోసారి వెళ్లి ఆధార్ నంబర్లు సేకరించాలన్నారు. ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహించాలని, ఓటర్ల పేర్లు తొలగింపుపై అభ్యం తరాలు చేస్తే తిరిగి ఓటు హక్కు కల్పించాలన్నారు. కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ  ఓటరు కార్డుకి ఆధార్ అనుసంధానం వేగవతం చేయాలన్నారు. అయితే, ఎన్నికల విధుల్లో ఉన్నవారికి నిధులు సమస్య ఉందని, వాటిని విడుదలచేయాలని సీఈవోను కోరారు. జేసీ వివేక్ యాదవ్ మాట్లాడు తూ జిల్లాలో 20.13 లక్షల ఓటర్లు ఉన్నారని, వీరిలో 14.95 లక్షల ఓటర్ల ఆధార్ కార్డులను అనుసంధానం చేశామన్నారు.

 

 ఇప్పటివరకు రెండుచోట్ల ఓట్లు ఉన్నవారు 8182 మందిని, చనిపోయిన వారు 18,001 మంది, వలసల్లో 25,897 మంది, తలుపులు వేసిన వారు 7,571 మంది ఉన్నట్టు గుర్తించామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకుడు రొక్కం సూర్యప్రకాశరావు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రత్నాల నర్సింహమూర్తి, సీపీఎం నేత బవిరి కృష్ణమూర్తి, డీఆర్‌వో బీహెచ్ వెంకట్రావు, ఆర్డీవోలు దయానిధి, వెంకటేశ్వరరావు, సీతారామరావు, డీఆర్‌డీఏ పీడీ ఎస్.తనూజారాణి పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top