మా ఎంపీటీసీ, జడ్పీటీసీలను టీడీపీ చెర నుంచి విడిపించండి


సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. చిత్రంలో పార్టీ నేతలు



అధికార పార్టీ అభ్యర్థికి పోలీసులు, అధికారులే సహకరిస్తున్నారు

* ఎన్నికల ప్రక్రియను ఆపేయండి

* గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ వినతి


సాక్షి, హైదరాబాద్: అధికార టీడీపీ నాయకులు అపహరించిన 35 మంది తమ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీలను వారి చెర నుంచి విడుదల చేయించాలని, వారంతా తిరిగి వచ్చే వరకూ ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను నిలిపి వేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు.



ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ప్రకాశంలో అధికార పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తీవ్రస్థాయిలో తమ పార్టీ ప్రజా ప్రతినిధులను ప్రలోభ పెడుతున్నారని  ఫిర్యాదు చేశారు. ప్రలోభాలకు పాల్పడుతూ మాగుంట వీడియో క్లిప్పింగులకు దొరకడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు, అధికారుల సహకారంతోనే టీడీపీ అభ్యర్థి తమ ఎంపీటీసీ, జడ్పీటీసీలను అపహరించారని ధ్వజమెత్తారు.



గత మంగళవారం రాత్రి నెల్లూరులో సుమారు 35 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఒక హోటల్‌లో టీడీపీ నాయకులు దాచి ఉంచితే.. తమ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ యాదవ్ వెళ్లి వారిని విడిపించడం అందరూ చూశారన్నారు. ఇలా విడిపించిన వారిని పోలీసు అధికారులు ఉదయాన్నే వదిలేస్తామని చెప్పి.. టీడీపీ అభ్యర్థి ద్వారా  తమిళనాడుకు తరలించారని విమర్శించారు.  తమ వారిని చెరలో ఉంచినపుడు ఎన్నికల్లో ఎందుకు పాల్గొనాలని గవర్నర్‌ను ఈ సందర్భంగా ప్రశ్నించామని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారన్నారు.



అపహరించిన వారిని విడుదల చేయించే విషయమై తాము కోర్టును కూడా ఆశ్రయిస్తామని ఒక ప్రశ్నకు వైవీ సమాధానమిచ్చారు. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రకాశం ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, పాలపర్తి డేవిడ్‌రాజు, ఆదిమూల సురేష్, ముత్తుముల అశోక్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి ఉన్నారు.

 

పోటీ నుంచి తప్పుకున్నట్టు తప్పుడు ప్రచారం

* ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు


సాక్షి, హైదరాబాద్: కర్నూలు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైఎస్సార్‌సీపీ వైదొలిగినట్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానెల్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సోమవారం ఫిర్యాదు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ మేరకు సీఈఓ భన్వర్‌లాల్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ భారీగా అవినీతి చర్యలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డమే కాకుండా తన అనుకూల చానెల్ అయిన ఏబీఎన్ ద్వారా దిగజారిన ప్రచారానికి దిగుతోందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top