సుందర నంద్యాల చేస్తా: సీఎం

సుందర నంద్యాల చేస్తా: సీఎం - Sakshi

నంద్యాల నుంచి సాక్షి ప్రతినిధి: ఎన్నికల ప్రచారం కోసం తాను నంద్యాల రాలేదని, అభివృద్ధి పనులు చూసేందుకు వచ్చానని సీఎం చంద్రబాబు చెప్పారు. నంద్యాల చరిత్రలో ఎప్పుడూ చేయనన్ని కార్యక్రమాలు చేశామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అభ్యర్థన మేరకు రోడ్ల విస్తరణ పనులతో పాటు పేదలకు ఇళ్లు, మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. శనివారం కడప నుంచి హెలికాప్టర్‌ ద్వారా నంద్యాల చేరుకున్న ఆయన అయ్యలూరు నుంచి రోడ్‌షో ప్రారంభించారు. పలు చోట్ల ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. నంద్యాలను స్మార్ట్‌ నంద్యాలగా, సుందర నంద్యాలగా మార్చి ఆదాయాన్ని పెంచుతామన్నారు. ‘పేదలే నా ఆస్తిగా పెట్టుకొని పనిచేస్తా ఉంటే, నన్ను కాల్చి చంపాలంటారు... ఉరి తీయాలంటారు.



నా చొక్కా విప్పాలంటారు. ఇది న్యాయమేనా తమ్ముళ్లూ. మనమేమి కాల్చి చంపొద్దు, ఓటు ఆయుధంతో బుద్ధి్ద చెప్పండి. మిమ్మల్ని అన్ని  విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదే. నేను చూసుకుంటా. నాకు వదిలేయండి’ అని సీఎం వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపింది తానేనన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అంతా తనపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రిని చేశారన్నారు. తన చేతికి ఉంగరాలు లేవని, వాచీ కూడా లేదన్నారు. రాగులు, సజ్జలు, కూరగాయలే తన తిండి అని చెప్పారు. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో టీడీపీ అభ్యర్థి భూమా బ్రçహ్మానందరెడ్డిని గెలిపించాలని కోరారు. మీరిచ్చే మెజార్టీ నాకు టానిక్‌ లాంటిదన్నారు. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గెలిచినా.. తన ప్రమేయం లేకుండా అభివృద్ధి జరగదంటూ సీఎం చంద్రబాబు బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.  

 

అగ్రిగోల్డ్, కేశవరెడ్డి బాధితుల నిరసనలు..

సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా అగ్రిగోల్డ్‌ బాధితుల నుంచి నిరసన వ్యక్తమైంది. మాకు అన్యాయం చేస్తున్నారంటూ ప్రసంగం ముగియగానే అయ్యలూరులో బాధితులు కేకలు వేశారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అగ్రిగోల్డ్, కేశవరెడ్డిలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచి పోషించిందని ఆరోపించారు. కేశవరెడ్డిని టీడీపీలో చేర్చుకుంది  మీరేనని కొందరు కేకలు వేసినా సీఎం పట్టించుకోలేదు.

 

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన సీఎం

నంద్యాల రోడ్‌షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి పలు హామీలు గుప్పించారు. రెండు నెలల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, కాపులకు ఉద్యోగ, విద్యా అవకాశాలు కల్పిస్తానని, రూ. వందకోట్లు నిధులు కేటాయించి ముస్లిం కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లు ప్రభుత్వమే చేసేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడతామని, చంద్రన్న బీమా పథకం కింద అందజేసే డబ్బులు చనిపోయిన వ్యక్తి పెద్దకర్మ రోజునే అందేలా, 50 ఏళ్లలోపు వ్యక్తి చనిపోతే రూ. 2 లక్షలు వెంటనే అందజేస్తామని హామీలు ఇచ్చి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మాట్లాడటం గమనార్హం.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top