ఎన్నికల కోడ్‌ అపహాస్యం!

ఎన్నికల కోడ్‌ అపహాస్యం! - Sakshi

యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘిస్తున్న అధికారపార్టీ నేతలు

- సమయం దాటిన తర్వాత ప్రచారం చేసిన మంత్రి అఖిల

రాత్రి పొద్దుపోయేవరకూ జిల్లాలోనే మంత్రులు

వైఎస్సార్‌సీపీ నేతలపై కొనసాగుతున్న దాడులు  

విపక్ష ఎమ్మెల్సీ గంగుల ఇంట్లో సోదాలు

 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల కోడ్‌ను అధికారపార్టీ నేతలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ప్రచార సమయం ముగిసిపో వడంతో సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఇతర జిల్లాలకు చెందిన వారు జిల్లా వదిలివెళ్లాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే, ఆ ఆదేశాలను  మంత్రులు లెక్కచేయ లేదు. ముగ్గురు మంత్రులు బనగానపల్లె ఎమ్మెల్యే ఇంట్లో రాత్రి పొద్దుపోయేదాకా ఉండి విందు చేశారు. ఇక మంత్రి అఖిలప్రియ సాయంత్రం 6 గంటల వరకూ ప్రచారాన్ని నిర్వహించారు. అయినప్పటికీ అక్కడ ఉన్న పోలీసులు పట్టించుకోలేదు.



అదేవిధంగా పక్క జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే ఒకరు గోస్పాడు మండంలంలోని ఓ గ్రామంలో ఉండిపోయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సర్వే కోసం కోస్తా జిల్లాల నుంచి వచ్చిన పలువురు అధికార పార్టీ నేతలు.. స్థానికుల ఇళ్లల్లో తలదాచుకున్నట్టు సమాచారం. ఒకవైపు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్న అధికారపక్షం.. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తోంది. ఇప్పటికే సుమారు 20 మంది ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన పోలీసు యంత్రాంగం.. సోమవారం కూడా వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దాడులు కొనసాగించింది.



ప్రతిపక్ష ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేశారు. మరోవైపు ప్రచారం మొదలైనప్పటి నుంచి మంత్రులు, టీడీపీ నేతలు స్థానికంగా ఓ హోటల్‌లో మకాం వేసి, అక్కడి నుంచే అన్ని ఆర్థిక వ్యవహారాలు నడిపారని ఆరోపణలు వస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక టీడీపీ నేతలు మహిళా ఓటర్లకు కొన్ని చోట్ల ముక్కుపుడకలు, మరికొన్ని చోట్ల చీరలు పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది.     

 

దాడులతో భయోత్పాతం

ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో అధికారపార్టీ దాడులకు తెగబడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. వైఎస్సార్‌ నగర్‌లో రేషన్‌ సరుకులు తీసుకునేందుకు వెళ్లిన ఒక అవ్వ వైఎస్సార్‌ సీపీకి ఓటు వేస్తాననడంతో అధికారపార్టీకి చెందిన డీలరు, నేతలు ఆదివారం ఆమెపై దాడి చేశారు. సోమవారం అధికారపార్టీ నేతలు అయ్యలూరులో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు పరమేశ్వరరెడ్డి ఇంట్లోకి వెళ్లి దారుణంగా చితకబాదారు.



తాము ఓడిపోతామన్న భయంతోనే అధికారపార్టీ ఈ విధంగా దాడులకు దిగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో ఏమీ లభించలేదు. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లో ఏమీ లభించకపోయినప్పటికీ దాడులు మాత్రం కొనసాగిస్తూ భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో ఓటింగ్‌ జరగకుండా చూడాలనేది అధికారపార్టీ ఎత్తుగడగా ఉంది. అధికారపార్టీ దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని వైస్సార్‌సీపీ నేతలు తేల్చిచెబుతున్నారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top