నోటు కొట్టు..ప్రమోషన్‌ పట్టు!

నోటు కొట్టు..ప్రమోషన్‌ పట్టు!


ఎయిడెడ్‌ టీచర్ల పదోన్నతుల వ్యవహారంలో చేతులు మారుతున్నడబ్బు

విద్యాశాఖలో పోటెత్తిన దిగువస్థాయి సిబ్బంది చేతివాటం

అధికారుల పేరుతో అడ్డగోలు వసూళ్లు

చేయి తడిపిన ఫైళ్లకు వెంటనే మోక్షం




ఒంగోలు : ఎయిడెడ్‌ పాఠశాలల్లోని పదోన్నతుల వ్యవహారంలో విద్యాశాఖ అధికారులు చేతివాటం ప్రారంభించారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారి డి.వి సుప్రకాష్‌ అవినీతి అధికారుల ఉచ్చులో చిక్కి సస్పెన్షన్‌కు గురికావడంతో కొంతకాలం పాటు చేతివాటానికి బ్రేక్‌ పడినట్లైంది. ఈ నేపథ్యంలో పదమూడు సంవత్సరాలుగా పదోన్నతుల కోసం వేచి ఉన్న ఎయిడెడ్‌ విద్యాసంస్థలోని సిబ్బంది ఆతృతను సొమ్ము చేసుకునేందుకు విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారని అంతా విమర్శస్తున్నారు.



ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో..

ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పదోన్నతులను నిలుపుదల చేస్తూ 2004 అక్టోబరు 10న 18836 నంబరు పేరుతో మెమో విడుదలైంది. దీంతో 2005లో ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఉపాధ్యాయులకు అనుకూలంగా వచ్చింది. దీంతో ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు జీఓ ఎంఎస్‌ నెంబర్‌ 40 విడుదలైంది.



దీని ప్రకారం ఈనెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పదోన్నతులు భర్తీచేయాలి. అయితే ఒక ప్రభుత్వ, స్థానిక విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ బదిలీల ప్రక్రియ తెరపైకి రావడంతో ఎయిడెడ్‌ ప్రక్రియ మందగించింది. దీంతో తిరిగి ఎటువంటి ఉత్తర్వులు వస్తాయో అనే ఆందోళన ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయుల్లో నెలకొంది. దీంతో త్వరితగతిన ఫైలును ఆర్‌జేడీ కార్యాలయానికి పంపేందుకు ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ఇది చివరకు విద్యాశాఖ కార్యాలయంలోని పలువురు ఉద్యోగులకు వరంగా మారింది.



చేతివాటం ఇలా..

తొలుత ఈ ఫైలు ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి డీఈఓ కార్యాలయానికి చేరాలి. దీనికోసం ఉప విద్యాశాఖ అధికారుల కార్యాలయాల్లోని ఉద్యోగులు కనీసం రూ. 5వేల చొప్పున వసూళ్లకు దిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ నుంచి ఫైలు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి చేరుతుంది. ఇక్కడ కొంతమంది దళారీలు తయారయ్యారని, వారు ఉపాధ్యాయులను ఆకట్టుకొని ఫైలును వేగవంతం చేపిస్తామంటూ ఆశచూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలోనే ఒక పాఠశాలలో నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ను కూడా ప్రలోభ పెట్టేందుకు యత్నించారు.



అయితే ఆయన మాత్రం తనకు పదోన్నతి వల్ల వచ్చే లాభం కంటే మీరు అడుగుతున్న మొత్తమే ఎక్కువుగా ఉంటుందని.. వారి డిమాండ్‌ను తిరస్కరించినట్లు చర్చ జరుగుతోంది. అయితే కొంతమంది మాత్రం అడ్డదారిలో ఆశచూపించి ఫైళ్లను ఇప్పటికే వేగవంతం చేయించుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేవలం ఒత్తిళ్లు, చేతివాటం కలిగిన వారికి సంబంధించి ఫైళ్లు మాత్రమే ఎక్కువ శాతం ఆర్‌జేడీ కార్యాలయానికి వెళుతున్నాయని, లేకుంటే డీఈఓ కార్యాలయంలోనే ఉండిపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు వందమంది వరకు పదోన్నతుల కోసం వేచి ఉన్న దశలో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



త్రీమెన్‌ కమిటీ?

ఇది పలు ఉపాధ్యాయ సంఘాలకు కూడా తలనొప్పిగా మారింది. ఈనెల 23వ తేదీలోపు అన్ని ఫైళ్లు తప్పనిసరిగా ఆర్‌జేడీ కార్యాలయానికి వెళతాయని, ఎందుకు మీలోమీరు పోటీపడి చేతివాటం ప్రదర్శిస్తున్నారంటూ అడిగినట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులు త్రీమెన్‌ కమిటీగా ఏర్పడి జిల్లా విద్యాశాఖ కార్యాలయంతోపాటు ఆర్‌జేడీ కార్యాలయంలో చేతివాటంకు సంబంధించి ఎంత చెల్లించాలో ముందస్తుగానే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.



ఒక్క రూపాయి ఇవ్వవద్దు:  

ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి ఎవ్వరూ ఒక్కరూపాయి కూడా చెల్లించవద్దు. పదోన్నతుల ప్రక్రియ ప్రస్తుతం మందకొడిగా సాగుతున్నా మరో వారం రోజుల్లో పూర్తవుతుంది. అందరికీ న్యాయం జరిగేలా ఏపీ టీచర్స్‌గిల్డ్‌ కృషి చేస్తుంది.

– సీహెచ్‌.ప్రభాకరరెడ్డి: ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి



ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం:

ఎయిడెడ్‌ పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి జాప్యానికి కారణం ఇటీవలి వరకు జరిగిన కౌన్సెలింగ్‌. ఈ ప్రక్రియకు సంబంధించి ఇంతవరకు నావద్దకు ఎటువంటి ఫిర్యాదురాలేదు. నాకు రాతపూర్వకంగా ఎవరైనా ఫిర్యాదు ఇస్తే తక్షణ చర్యలు తీసుకుంటా. దాంతోపాటు ఈ ఆరోపణలకు సంబంధించి కూడా తక్షణమే దృష్టిసారించి నిజానిజాలను నిగ్గు తేలుస్తా.

– జిల్లా విద్యాశాఖ అధికారి బి.విజయభాస్కర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top