విద్యకు కులం లేదు

విద్యకు కులం లేదు - Sakshi


యువతదంతా ప్రేమకులం

ప్రముఖ సినీ నటుడు

మంచు మనోజ్


 

గుంటూరు రూరల్ : విద్యకు కులంలేదు, రక్తానికి కులం లేదు, మరి మనుషులకెందుకు ఈ వర్గ విభేదాలని ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. మండలంలోని చౌడవరం గ్రామంలో గల ఆర్వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన 31వ వార్షికోత్సవంలో  ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ప్రతి పని చేసేవారికి ఆ వర్గం చేసే పనిని తెలిపేందుకు కులాలను ఏర్పాటు చేశారని, కానీ నేడు అలాంటివి లేవని, అంతా ఒకటేనన్నారు. మనమంతా ప్రేమకులానికి చెందిన వారమని తెలిపారు. కష్టపడకుండా ఏదీ సాధ్యంకాదని ప్రతి విద్యార్థి తమ లక్ష్య సాధనకోసం రోజూ ఒక గంట కష్టపడితే తప్పని సరిగా లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. యువత నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి వారి తల్లిదండ్రుల గురించి ఆలోచించాలన్నారు.





లక్ష్యసాధనకు పట్టుదల అవసరం

 ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని కష్టపడాలని, లక్ష్య సాధన కోసం  పట్టుదలతో కృషిచేయాలని రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ బి.ఉదయలక్ష్మి తెలిపారు. యువత తమలో ఉన్న శక్తిని ఉపయోగించుకుని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. తెలివితేటలు, నైపుణ్యాలను పంచుకుంటూ, పెంచుకోవాలన్నారు. ప్రతి విద్యార్థికి నిజాయితీ, ఆత్మవిశ్వాసం, సత్ప్రవర్తన, సమాజంపై అవగాహన అనే లక్షణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.  సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి ఒక మేధావిగా తయారవ్వాలన్నారు.  మంచు మనోజ్, ఉదయలక్ష్మిలను ఘనంగా సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, కళాశాల అధ్యక్షుడు డాక్టర్ కె.బసవపున్నయ్య, కార్యదర్శి ఆర్.గోపాలకృష్ణ, కోశాదికారి ఎం.గోపాలకృష్ణ, ప్రిన్సిపల్ సుధాకర్, ఏవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top