పచ్చ రచ్చ!

పచ్చ రచ్చ! - Sakshi


అనంతపురం కార్పొరేషన్ : కొత్త పాలక వర్గం ఏర్పడ్డాక అనంతపురం నగర పాలక సంస్థ తొలి కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చయింది. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ప్రతి అంశంలోనూ కాదంటే అవునంటూ..అవునంటే కాదంటూ గొడవపడ్డారు. చాలా అంశాల ఆమోదంలో అధికార సభ్యుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. గురువారం మేయర్ మదమంచి స్వరూప అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. అధ్యక్షోపన్యాసం తర్వాత ఎక్స్‌అఫిషియో సభ్యుడు, ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ.. నగర అభివృద్ధే అజెండాగా పని చేయాలని సభ్యులకు సూచించారు.



అంశాల వారీగా చర్చ :

సెంట్రల్ పార్క్‌లో మ్యూజికల్ ఫౌంటెన్‌ను రూ.34 లక్షలతో ఏర్పాటు చేయాలన్న అంశంపై వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు బాలాంజనేయులు, జానకి అభ్యంతరం చెప్పారు. పార్కును శిల్పారామంకు అప్పగించాలనే ప్రతిపాదన చేస్తూనే ప్రజాధనం వెచ్చించడం ఎందుకని ప్రశ్నించారు. అయితే అధికార సభ్యులు అది ప్రజల కోసమే చేస్తున్నామంటూ ఆమోదించారు.



సూర్యానగర్ ఐరన్ బ్రిడ్జి కూడలిలో ఏకలవ్యుడి విగ్రహం ఏర్పాటు చేయాలని డిప్యూటీ మేయర్ గంపన్నతో పాటు మరో కార్పొరేటర్.. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర విగ్రహం ఏర్పాటు చేయాలని కో ఆప్షన్ సభ్యుడు కృష్ణకుమార్, సరిపూటి రమణతో పాటు మరికొంత మంది టీడీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అయితే ఈ అంశం ఇక్కడ చర్చించాల్సినది కాదంటూ మరికొందరు సభ్యులు సూచన చేస్తూ ఆ అంశాన్ని మేయర్ ‘కోర్టు'లోకి నెట్టారు.



కార్మికుల నియామకానికి సంబంధించిన కామధేను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ టెండర్ గడువును 2015 మార్చి వరకు పొడగించాలని టీడీపీ సభ్యులు నటేష్ చౌదరి, రహమత్ బీ, మరో ఇద్దరు సభ్యులు ఆమోదం తెలుపగా.. కో ఆప్షన్ సభ్యుడు కృష్ణకుమార్, సభ్యుడు సరిపూటి రమణ అభ్యంతరం చెప్పడంతో దాన్ని తిరస్కరించారు.



నగర పాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌లలో 25 ఏళ్ల లీజు కాలం పూర్తయిన దుకాణాలను తిరిగి వేలం నిర్వహించే అంశంపై టీడీపీ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. చివరకు కొద్దిరోజులు గడువిచ్చి వేలం నిర్వహించాలని తీర్మానించారు.



ప్రధాన రోడ్ల విస్తరణ, డివైడర్ల ఏర్పాటు అంశాలు ఆమోదించే విషయంలో అధికార పార్టీ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. సాధారణ నిధుల నుంచి రూ.2 కోట్లతో అంచనాతో ఉన్న ఈ పనులు అవసరం లేదని, భూగర్భ డ్రైనేజీ వస్తే అవన్నీ తొలగిస్తారని తద్వారా ప్రజాధనం వృథా అవుతుందని, ప్రత్యేక గ్రాంట్ వస్తే చేసుకోవచ్చని అధికార సభ్యులు నటేష్ చౌదరి, బంగిసుదర్శన్, సరళ చెప్పారు.



దీనిపై మరో పక్క నుంచి అధికార సభ్యులు కృష్ణకుమార్, రాజారావు మాట్లాడుతూ నగర సుందరీరణలో భాగంగా డివైడర్ల ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. ఒక వర్గం వద్దని, మరో వర్గం చేయాలని చెప్పారు. దీనిపై మేయర్ మాట్లాడుతూ రూ.62 కోట్లతో ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపామని, ఆ నిధులు వచ్చిన తరువాత చేస్తామని చెప్పడంతో అంశాన్ని ఆమోదించారు.



 పోడియం వద్ద బైఠాయింపు

 తన డివిజన్ పరిధిలోని గుల్జార్‌పేటలో జరిగిన పారిశుద్ధ్య పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు బిల్లు ఇవ్వకపోవడంతో వారు తన ఇంటి ముందు కూర్చుకుంటున్నారంటూ వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్ షుకూర్ ఆవేదన వ్యక్తం చేస్తూ మేయర్ పోడియం ముందు బైఠాయించారు. కార్పొరేటర్లు మల్లికార్జున, జానకి, బాలాంజనేయులు మద్దతు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డిప్యూటీ మేయర్ గంపన్న ఇతర సభ్యులు రాజారావు సర్చిచెప్పినా వారు వినలేదు.



చివరకు సమస్య పరిష్కరిస్తామని మేయర్ చెప్పడంతో వారు శాంతించారు. మాతా శిక్ష సంరక్షణ కేంద్రాల్లో అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని వైసీపీ కార్పొరేటర్ హిమబిందు సూచించారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలంటూ కౌన్సిల్ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు బాలాంజినేయులు, బోయ పక్కీరమ్మ, జానకీ, సీపీఎం కార్పొరేటర్ భూలక్ష్మిలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు.



 ఆరోగ్యాధికారి విషయంలో గొడవ

 ఆరోగ్యాధికారి నారాయణస్వామి సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని, పని చేయించడం లేదని అధికార సభ్యుడు నటేష్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన డివిజన్లో కార్మికులను తొలగించారని ఫిర్యాదు చేశారు. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. అధికార సభ్యులు సరళ, లోక్‌నాథ్, రహమత్ బీ మద్దతుగా నిలిచారు. దీంతో వాటికి ఆయనొక్కడే బాధ్యుడా అంటూ అధికార సభ్యుడు బంగి సుదర్శన్ ప్రశ్నిస్తూ సరెండర్ చేస్తామని అనడం సరికాదని ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.



కో-ఆప్షన్ సభ్యుడు కృష్ణకుమార్, కార్పొరేటర్ రమణలు మద్దతుగా నిలిచారు. ఆరోగ్యాధికారి దళితుడనే ఉద్దేశంతో ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని, పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండడానికి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కూడా బాధ్యులేననీ, అందరినీ సరెండర్ చేయాలని కృష్ణకుమార్ అన్నారు. దీంతో గొడవ పెద్దదై దాడులు చేసుకుంటారా అనేలా ఒకరి మీదకు ఒకరు దూసుకుపోయారు.



పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కమిషనర్ కలుగజేసుకుని సభ్యులను సముదాయించి కూర్చోబెట్టారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందనేది వాస్తవం. ఇకపై అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేస్తారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని చెప్పారు.



ఆర్‌ఐపై చర్యలకు డిప్యూటీ మేయర్ పట్టు

రెవెన్యూ విభాగంలో అవినీతి పెరిగింది. ఇటీవల ఒక ఆర్‌ఐ అవినీతికి పాల్పడి ఆస్తిపై పేరు మార్పు చేస్తే మీరేమి చర్యలు తీసుకున్నారంటూ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డిని డిప్యూటీ మేయర్ గంపన్న నిలదీశారు. చర్యలు తీసుకోవాలని తాను చెబితే ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహించారు.



ఇందుకు ఆర్‌ఓ లక్ష్మిదేవి సమాధానమిస్తూ ఆర్‌ఐ బాలాజీ అవినీతికి పాల్పడిన మాట వాస్తవమేనని చెబుతూ, చర్యలకు సిఫారసు చేశామన్నారు. దీనిపై డిప్యూటీ మేయర్ మరింత ఆగ్రహిస్తూ ఎన్నేళ్లు పడుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో కమిషనర్ స్పందిస్తూ అక్కడికే ఫైలు తెప్పించి ఆర్‌ఐపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top