ప్రతి పాఠశాలలో మరుగుదొడ్డి


* 15 రోజుల్లో వినియోగంలోకి రావాలి

* విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలు


 ఏలూరు సిటీ : జిల్లాలోని ప్రతి పాఠశాల, వసతి గృహంలో 15 రోజుల్లో మరుగుదొడ్లు వినియోగంలో ఉండాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. శుక్రవారం ఆయన పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 650 పాఠశాలల్లో మరుగుదొడ్లకు మరమ్మతులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినా సరైన స్పందన లేదన్నారు.



19 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై గతంలో సమీక్షించినా ఇప్పటికీ చేపట్టకపోవడంపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన బోధన అందించి మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందించే ప్రణాళిక సిద్ధం చేయాలని విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఆదేశిం చారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి మధుసూధనరావు, సర్వశిక్ష అభియాన్ పీవో విశ్వనాథం పాల్గొన్నారు.

 

విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి

ఏలూరు : రాష్ట్రంలో హుదూద్ తుపాను సృష్టించిన విధ్వంసాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని ఇటువంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విపత్తుల నివారణ, పునరావాస కార్యక్రమాల చర్యలపై సమావేశం నిర్వహించారు.  



జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు మాట్లాడుతూ జిల్లాలోని ఆయా శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఇతర సిబ్బంది హోదా, వారు పనిచేస్తున్న ప్రాంతం, వారి ఫోన్ నెంబర్లుతో  కూడిన సమాచారాన్ని అందించాలని అధికారులను ఆయన కోరారు. సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

డేటా ఎంట్రీని త్వరగా పూర్తి చేయండి

ఏలూరు : జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన సమస్యలు, వివిధ పథకాల లబ్ధిదారుల ఆధార్, ఫోన్ నంబర్లతో సమగ్ర సమాచార డేటా ఎంట్రీని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. జన్మభూమి దరఖాస్తుల డేటా ఎంట్రీ తీరుపై శుక్రవారం ఆయన సమీక్షించారు. జన్మభూమి సమస్యలపై మండలస్థాయిలో బాధ్యతాయుతమైన అధికారిని పర్యవేక్షణాధికారిగా నియమించాలన్నారు.



దీనిపై జిల్లాస్థాయిలో మరో పర్యవేక్షణాధికారిని నియమిస్తామని భాస్కర్ తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్లను ఎంతమంది నిర్మించుకున్నారు? లేని వారి వివరాలను కూడా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి పింఛన్ల కోసం అందిన 49 వేల దరఖాస్తుదారుల వివరాలను పూర్తిస్థాయిలో అందించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు కార్యాచరణ

ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేయాలని  కలెక్టర్  భాస్కర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.మండల స్థాయి అధికారులతో ఆయన శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి సరైన పోషకాహారాన్ని అందించాలని, దీనివల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా జన్మిండమే కాకుండా తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.  జేసీ బాబూరావునాయుడు, అసిస్టెంట్ కలెక్టర్ పి.రవి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top