ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం:విజయసాయి రెడ్డి

విజయసాయి రెడ్డి - Sakshi


విజయనగరం: వైఎస్ఆర్ సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పిలుపు ఇచ్చారు. చిత్తశుద్ధి ఉన్న కార్యకర్తలను గుర్తించాలన్నారు. తుపాను వల్ల జిల్లాలో  మృతి చెందిన 15 మంది కుటుంబ సభ్యులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదగా 50వేల రూపాయలు సహాయం అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు రానున్న నాలుగేళ్లలో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. రాబోయే రోజులలో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వారి సేవలకు గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రతి జిల్లా కార్యాలయాన్ని కేంద్ర కార్యాలయంతో వీడియో లింక్తో అనుసంధానం చేస్తామని చెప్పారు. డిసెంబరు 5న జిల్లా కేంద్రాలలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలన్నారు.



వైఎస్ఆర్ హయాంలో అభివృద్ధి, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధికి మధ్య ఉన్న తేడా ప్రజలకు తెలియజేయాలన్నారు. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ హయాంలో మూడు సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించినట్లు తెలిపారు. జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీతో సహా నాలుగు కోట్ల రూపాయలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. 20,033 ఎకరాలను నిరుపేదలకు పంచారన్నారు. రెండు లక్షల 81వేల మందికి అదనంగా పెన్షన్లు మంజూరు చేశారని చెప్పారు.



చంద్రబాబు వచ్చిన ఆరు నెలల్లో జిల్లాలో 1155 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక్క రూపాయి వడ్డీ కూడా చెల్లించలేదన్నారు. ఆధార్ లేదన్న సాకుతో 45వేల మంది రైతులను రుణమాఫీ జాబితా నుంచి తొలగించారని చెప్పారు. బాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు ఫ్యాక్టరీలు మూతపడ్డాయని తెలిపారు. అతని అసమర్ధ పాలన వల్ల 30 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పారు.


త్రిసభ్య కమిటీ పర్యటన


ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ విజయనగరం జిల్లాలో పర్యటించింది. పార్టీ నేతలు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దుర్గా ప్రసాద్ రాజు సమావేశానికి హాజరయ్యారు. పార్టీలో గ్రామస్థాయి వరకు 80శాతంపైగా కమిటీల నియామకం పూర్తి అయినట్లు జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి త్రిసభ్య కమిటీకి వివరించారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top