ఈ-పంచాయితీ

ఈ-పంచాయితీ - Sakshi


 ఒంగోలు టూటౌన్, పర్చూరు:పల్లె ప్రజలకు పారదర్శకంగా పౌరసేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-పంచాయతీ వ్యవస్థ జిల్లాలో అమలు కావడం లేదు. అన్నీ గ్రామాలను ఈ-పంచాయతీలుగా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలో 1028 పంచాయతీలున్నాయి. వీటిని 568 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో రెండు లేక మూడు పంచాయతీలుంటాయి. మొదటి దశలో 279 క్లస్టర్లలో ఈ-పంచాయతీ సేవల అమలుకు శ్రీకారం చుట్టారు. వెంటనే 342 కంప్యూటర్లను రెండు నెలల క్రితమే పంచాయతీలకు అందించారు. పంచాయతీ భవనాలు లేని కొన్ని చోట్ల గ్రామంలో ఉన్న సామాజిక భవనంలో కంప్యూటర్లను అమర్చారు. జిల్లా పంచాయతీ కార్యాలయం, డీఎల్‌పీవోల కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాల్లో ఒక్కో కంప్యూటర్ చొప్పున అమర్చారు. 152 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు.

 

 వీరికి డివిజన్ల వారీగా ఇటీవల శిక్షణ కూడా ఇచ్చారు. వీటి నిర్వహణ బాధ్యతను కార్వే సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. జిల్లాకు డీపీఎం, ఏడీపీఎం, టెక్నికల్ సిబ్బందిని నియమించారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఒక ప్రత్యేక గదిని వీరికి కేటాయించారు.  ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే బాధ్యత బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించారు. ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టి రెండు నెలలు దాటిపోయింది. కానీ ఇంత వరకు పంచాయతీల్లో పౌర సేవలు అందించడంలేదు. కంప్యూటర్లు మూలకు చేరాయి. వీటి గురించి పట్టించుకున్న నాథుడు లేకుండా పోయాడు. ఉదాహరణకు పర్చూరు మండలంలో 14 క్లస్టర్లున్నాయి. వీటిలో పర్చూరు, చెరుకూరు, నూతలపాడు, అన్నంబొట్లవారిపాలెం, అడుసుమల్లి, ఉప్పుటూరు, నాగులపాలెం గ్రామ పంచాయతీలకు మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. వీరన్నపాలెం, తిమ్మరాజుపాలెం, దేవర పల్లి, గర్నెపూడి, ఇనగల్లు, రమణాయపాలెం, పోతుకట్లలో కేబుల్ సౌకర్యం లేనందున సాధ్యం కాదని అధికారులు తెలిపారు. ఇలా జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయి.

 

 ఈ-పంచాయతీ సేవల లక్ష్యమిదీ..

 =    పంచాయతీల్లో మాన్యువల్ సేవలకు స్వస్తి చెప్పడం

 =    అవినీతి అక్రమాలకు తావులేకుండా చేయడం

 =    {పజలకు ఉపయోగపడే సర్టిఫికెట్లు ఇవ్వడం

 =    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న పలు అభివృద్ధి పథకాల నిధులు దారిమళ్లకుండా ఎప్పటికప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఆన్‌లైన్ చేయడం

 =    పంచాయతీల్లో కేడర్ వారీగా ఉన్న సిబ్బంది వివరాలు, వారి జీతభత్యాల వివరాలు మొత్తం ఆన్‌లైన్‌లో పెట్టడం వంటివి చేయాలి.

 

 కానీ రెండు నెలలైనా నేటికీ ఇంటర్నెట్ సౌకర్యానికి కంప్యూటర్లు నోచుకోలేదు. పౌరసేవలు అమలు కాలేదు.

 అధికారులతో చర్చిస్తున్నాం...

 కొన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాం. మరికొన్ని పంచాయతీలకు సోమవారం కల్పిస్తాం. దీనిపైనే సంబంధిత అధికారులతో చర్చిస్తున్నాం. పంచాయతీ రాజ్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణమోహన్ కూడా వచ్చారు. ఆయన కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.     

 

 బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో

 మాట్లాడాం...

 అనీల్, కార్వే సంస్థ జిల్లా కోఆర్డినేటర్

 ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు గురించి బీఎస్‌ఎన్‌ఎల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దీనిపైనే పంచాయతీరాజ్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణమోహన్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top