ఈ ప్రయోగం ఫెయిల్


ఈ-పాస్ విధానంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికడతామని ప్రకటించిన ప్రభుత్వం ప్రయోగ పరీక్షలోనే ఫెయిలైంది. ఆధునిక సాంకేతిక విధానంతో అనుసంధానించి తొలివిడతగా జిల్లాలోని 245 రేషన్ షాపుల్లో ఈ నెల నుంచి ఈ పాస్ అమలు ప్రారంభించారు. అయితే సాంకేతిక, ఇతరత్రా లోపాలతో కొత్త విధానంలో రేషన్ అందజేయడంలో అధికారులు విఫలమయ్యారు. సరుకులు అందక లబ్ధిదారులు గగ్గోలు పెడుతుండటంతో చివరికి ఈ పాస్ పని చేస్తున్న 50 డిపోలు మినహా మిగిలిన వాటిలో పాత విధానంలోనే ఈ నెల సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

 

 పాలకొండ: జిల్లాలో అన్ని రకాలు కలిపి సుమారు 11 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు సరుకులు అందజేసేందుకు సుమారు 2వేల రేషన్ డిపోలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా గత నెల వరకు సాధారణ తూనిక పద్ధతుల్లోనే సరుకులు అందించేవారు. దీని వల్ల డిపోల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీంతో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని జీపీఎస్ విధానంలో ప్రజాపంపిణీ అనుసంధానించి బయోమెట్రిక్ కూడా జోడించి సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ-పాస్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాటాలను వినియోగంలోకి తీసుకువచ్చారు.

 

  తొలి విడతగా  జిల్లాలో 245 రేషన్ డిపోల్లో వీటిని ఏర్పాటు చేసి, ఏప్రిల్ కోటా వీటి ద్వారానే పంపిణీ చేయాలని ఆదేశించారు. మొదట్లో రేషన్  డీలర్లు ఈ విధానంలో ఎదురయ్యే ఇబ్బందులను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద సరుకులను తూకం వేసి ఇస్తేనే తీసుకెళ్తామని తేల్చి చెప్పారు. అలా తూకం వేస్తే ప్రతి బస్తాలో 2 నుంచి 3 కేజీల వరకు సరుకులు తక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. దీనిపై జాయింట్ కలెక్టర్ స్పందించి వేబ్రిడ్జిల్లో సరుకులు తూకం వేయించిన తర్వాతే డీలర్లకు అందించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి 5వ తేదీ దాటిపోయింది. అనంతరం రేషన్ పంపిణీకి ఈ-పాస్ యంత్రాలను ఏర్పాటు చేశారు.

 

 ఆది నుంచీ అవి మొరాయించడం ప్రారంభించాయి. చాలా వరకు ఈ-పాస్ యంత్రాలు ఆన్ కాకపోవడం, ఆన్ అయినా  సర్వర్ డౌన్ అని చూపించటం వంటి సాంకేతిక కారణాలతో సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ఉన్నతాధికారులు పరిశీలించి యంత్రాలకు మరమ్మతులు చేయించినా అవి తాత్కాలికంగానే పని చేశాయి. మరో వైపు ఈ నెల 15లోగా సరుకుల పంపిణీ పూర్తి చేయాల్సి ఉండటంతో లబ్ధిదారుల నుంచి డీలర్లపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. సక్రమంగా పనిచేసిన యంత్రాల ద్వారా కూడా రోజుకు 10 మంది కార్డుదారులకు మించి సరుకులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రేషన్ సరుకుల కోసం రాత్రుళ్లు కూడా లబ్ధిదారులు వేచి ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది.

 

 50 డిపోలకు పరిమితం

 ఈ-పాస్ యంత్రాల ద్వారా సరుకుల పంపిణీలో విఫలమైన అధికారులు ప్రస్తుతానికి ఈ విధానాన్ని పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా సక్రమంగా పని చేస్తున్న 50 పరికరాలున్న డిపోల్లోనే ఈ పాస్ విధానం కొనసాగించాలని, మిగిలిన డిపోల్లో వాటిని పక్కన పెట్టాలని జాయింట్ కలెక్టర్ వివేకయాద్ రెవెన్యూ అధికారులకు సూచించారు. పాతపద్ధతిలో సరుకులు పంపిణీ చేయాలని ఆదేశిస్తూ.. దీనికి గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు.

 

 చిత్తశుద్ధి లోపం

 ఈ పాస్ పరికరాల ఏర్పాటులో అత్యాత్సుహం చూపిన అధికారులు ఈ విధానం అమలులో మాత్రం చిత్తశుది ్ధ చూపకపోవడమే ఇది విఫలం కావడానికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. ఈ-పాస్ విధానం ద్వారా బోగస్ లబ్ధిదారుల గుర్తింపు జరుగుతున్న సమయంలో సాంకేతిక లోపాలను సకాలంలో పరిష్కరించడంలో అధికారులు ఎందుకు శ్రద్ధ చూపించటం లేదన్నది ప్రశ్నగా మారింది. 50 కేంద్రాల్లో ఈ విధానం కొనసాగించాలని అనుకున్నా అది కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. మిగిలిన కేంద్రాల్లో పాత పద్ధతిలో సరుకులు పంపిణీ చేసి 50 కేంద్రాల్లో యంత్రాల ద్వారా పంపిణీ చేసేందుకు డీలర్లు సుముఖంగా లేరు. ఈ సమస్యలన్నింటిని ముందుగానే అంచనా వేసి విధానం అమలు చేసి ఉంటూ అభాసుపాలయ్యేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top