డయ్యింగ్..డేంజర్


చీరాల : వస్త్ర వ్యాపారానికి, చేనేత వస్త్రాల తయారీకి పేరెన్నికగన్న చీరాలలో డయ్యింగ్ పరిశ్రమలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పుడవే చీరాల ప్రాంతానికి ప్రమాదకరంగా పరిణమించాయి. డయ్యింగ్ యూనిట్ల నుంచి వచ్చే ప్రమాదకర రసాయనాలతో కూడిన జలాల వల్ల పరిసరాలు కాలుష్యకోరల్లో చిక్కుకుంటున్నాయని..తమిళనాడులో వాటిని నిషేధించారు. దీంతో అక్కడి డయ్యింగ్ యూనిట్ల యజమానుల కన్ను చీరాల ప్రాంతంపై పడింది.



ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడ యూనిట్లు నెలకొల్పారు. ఎటువంటి అనుమతులు లేకుండా...కనీస నిబంధనలు పాటించకుండా యూనిట్లు ఏర్పాటు చేశారు. ఏదో చేనేతకు సంబంధించిన నూలే కాదు..ఏకంగా ఫ్యాబ్రిక్స్ (బనియన్లు, టీషర్టులు, ఇతర రెడీమేడ్ వస్త్రాలు) డైలు వేసి కెమికల్ వ్యర్థాలను చీరాల భూముల్లో వదిలేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ అక్రమ డయ్యింగ్ యూనిట్ల వ్యవహారం జరుగుతున్నా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు వీరిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.



 తమిళనాడు నుంచి వచ్చిన వారితోపాటు స్థానికులు కొందరు భారీ యూనిట్లు నెలకొల్పారు. ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు మొత్తం 60 డయ్యింగ్ యూనిట్లు ఉండగా..వాటిలో 20కిపైగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన యూనిట్లు ఉండటం విశే షం. తమిళనాడులోని తిరువూరు, సేలం, ఇరోడ్డు, కంచి, నగరి, కుంభకోణం వంటి ప్రాంతాలలో డయ్యింగ్ యూనిట్లను నిషేధించారు.



కలుషిత నీటిని శుద్ధిచేసే ప్లాంట్లు ఉంటేనే డయ్యింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని ఖచ్చితమైన నిబంధన విధించింది. ఈ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు పెట్టాలంటే కోట్లతో కూడుకున్న పని. దీంతో చీరాలలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టినప్పటికీ అధికారులు, స్థానికుల వలన ఇబ్బందులు ఉండవని ఆలోచించారేమో కానీ ఏకంగా 20 మంది వ్యాపారులు చీరాలకు వచ్చి భారీ డయ్యింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి అక్కడ అమ్మే వస్త్రాలకు చీరాలలో డైలు వేసి మరలా వాటిని అక్కడికే తరలిస్తున్నారు. అంటే కేవలం వస్త్రాలకు రంగులు వేసేందుకు మాత్రమే చీరాలలో యూనిట్లను స్థాపించారు.



 చీరాల విషపూరితమవుతుందిలా..

 చీరాల ప్రాంతంలో ఉన్న 42 డయ్యింగ్ యూనిట్ల నుంచి రోజుకు 50 లక్షల లీటర్లకు పైగానే వివిధ రసాయనాలు, ఇతర వ్యర్థ పదార్థాలు భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. సుమారు ఒక్కొక్క డయ్యింగ్ యూనిట్‌లో మూడు నుంచి నాలుగు వేల కేజీల వస్త్రాలకు డయ్యింగ్ వేస్తారు. ఒక్కో కేజీ వస్త్రానికి డయ్యింగ్ వేయాలంటే రెండు వందల లీటర్లు కెమికల్స్‌తో కూడిన నీటిని వినియోగిస్తారు. తర్వాత ఆ నీటిని నేరుగా కుందేరు లేదా ఆ పక్కనే వదిలేస్తున్నారు.



 సంభవించే ప్రమాదాలివే...

 ఈ విషపూరితమైన నీరు నేరుగా విడుదల చేయడంతో అవి భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. అలానే కుందేరులో విడుదల కావడంతో ఆ పరిసర ప్రాంతాలతో పాటు సముద్రంలో కలవడం వలన కూడా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లోని బోర్లు, బావుల్లోకి కలుషిత నీరు చేరుతోంది.  ఈ నీటిని ప్రజలు తాగడం వలన కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వస్తాయి.



 నీటిలో ఉప్పు శాతం పెరిగిపోతుంది. దాని వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడటంతో పాటు జీర్ణవ్యవస్థ దెబ్బతిని జీర్ణకోశ వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. అలానే బావులు, బోర్లలోని నీరు మందంగా మారుతాయి. వాటిని తాగడం వలన కూడా అనేక అనర్థాలు ఏర్పడతాయి. నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోతుంది. దీనివల్ల చేపలు, రొయ్యలతో పాటు సముద్ర జీవులు చనిపోతాయి. పంట పొలాలు సైతం దెబ్బతింటాయి.



 నిబంధనలకు నీళ్లు..

 డయ్యింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందుగా సీఎస్టీ అనుమతిని కాలుష్య నియంత్రణ బోర్డు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ పెట్టే స్థలం అందుకు అనుకూలమైందా, స్థానికులకు ఇబ్బందులకు ఏర్పడతాయా అనేది పరిశీలించాలి. ఆ తర్వాత పరిశ్రమకు సంబంధించిన అనుమతి తీసుకోవాలి. తప్పకుండా యూనిట్ల నుంచి విడుదలయ్యే కలుషిత నీటిని శుద్ధి చేసేందుకు ట్రీట్‌మెంట్ ప్లాంట్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. కానీ చీరాలలో ఉన్న 42 డయ్యింగ్ యూనిట్లకు ఇటువంటి అనుమతులేమీ లేవు.



 మాట తప్పిన డయింగ్ యజమానులు..

 డయ్యింగ్ యూనిట్ల యజమానులందరూ కలిసి మొత్తం మీద ఒక ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు. ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ప్రత్యేకంగా ఒక పైపులైన్‌ను వేసి డయ్యింగ్ యూనిట్ల నుంచి వచ్చే కలుషిత నీటిని ఈ పైపులైన్ ద్వారా ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు అనుసంధానించాలని సూచించారు. ట్రీట్‌మెంట్ ప్లాంట్ పెట్టాలంటే 4 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ కల్పిస్తుందని, మిగిలిన మొత్తం డయ్యింగ్ యూనిట్ల యజమానులు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అందుకు అంగీకరించిన డయ్యింగ్ యూనిట్ల యజమానులు ఇంత వరకు ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోకుండా కలుషిత నీటిని సమీప ప్రాంతాల్లో వదిలేస్తున్నారు.



 వత్తాసు పలుకుతున్న పొల్యూషన్ బోర్డు అధికారులు...

 చీరాలలో ఉన్న డయ్యింగ్ యూనిట్ల నుంచి వస్తున్న విషపూరిత నీటి వలన జరిగే ప్రమాదాలపై అనేక మంది మానవహక్కుల సంఘం, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డును ఆశ్రయించారు. దీంతో హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి లేని డయ్యింగ్ యూనిట్లను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక్క డయ్యింగ్ కేంద్రం కూడా మూసివేసిన దాఖలాలు లేవు. నూతనంగా తమిళనాడు నుంచి వచ్చేవి మాత్రం వస్తూనే ఉన్నాయి. వీటిని నియంత్రించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాత్రం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top