డ్వాక్రా మహిళలు.. వద్దే వద్దు !


చిత్తూరు: డ్వాక్రా సంఘాలను నెలకొల్పింది తామేనని, మహిళల్లో చైతన్యం వచ్చింది తన హయంలోనేనని గొప్పలుపోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు డ్వాక్రా మహిళల పేరు ఎత్తితేనే బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యమంత్రి సభల్లో మహిళలు రుణమాఫీ హామీ ఏమైదంటూ ప్రశ్నిస్తుండడంతో ఆయన అసలు తన సభలకు డ్వాక్రా మహిళలనే తరలించవద్దంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అధికారుల చూపంతా విద్యార్థులపై పడింది. పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులందరినీ సీఎం సభలకు తరలించే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాకు వారానికొకమారు వస్తుండడంతో ఆయన సభలకు వెళ్లడం విద్యార్థులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇష్టమున్నా..లేకున్నా సభలకు వెళ్లాల్సిందే.



బాబు వచ్చేంతవరకు గంటల తరబడి వేచి చూడాల్సిందే. ఆ తరువాత ఆయన గంటల కొద్ది చేస్తున్న ప్రసంగాలు వినాల్సిందే. దీంతో విద్యార్థులు బాబు పర్యటన అంటేనే జడుసుకుంటున్నారు.  ఇంటర్ పరీక్షలు ముగియగా డిగ్రీ, పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఒక పక్క వరుస పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు చదువులతో కుస్తీ పడుతున్నారు. మరో వైపు శనివారం ముఖ్యమంత్రి ఏర్పేడు పర్యటన ఖరారైంది. శనివారం శ్రీరామనవమి సెలవు. అయినా విద్యార్థులు ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఇంట్లో ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఏర్పేడు సీఎం సభకు పెద్ద ఎత్తున విద్యార్థులను తరలించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో విద్యార్థులను తప్పనిసరిగా సీఎం సభకు పంపించాలని అన్ని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు జిల్లా అధికారులు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో సెలవు రోజు సైతం పాఠశాలలకు రావాల్సిందేనంటూ యాజమాన్యాలు విద్యార్థులకు ఆదేశాలిచ్చాయి. ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే రుణమాఫీ సమస్య పుణ్యమా అని డ్వాక్రా మహిళలను తరలించవద్దన్న ఆదేశాలున్నాయని, అందుకే విద్యార్థులను విధిలేక  తరలించాల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top