మూలకు చేరిన మాఫీ


 పాలకొండ: డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటూ హామీలు గుప్పించిన తెలుగుదేశం పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కొత్తకొత్త ఆంక్షలు విధిస్తోంది. మాఫీ మాట మార్చి మూలధనం పేరును తెరపైకి తెచ్చింది. ఇందులోను సవాలక్ష కొర్రీలతో పైసా కూడా మహిళా సంఘాలకు అందించకుండానే... హామీ అమలు చేశామని ప్రకటించుకోవడానికి కొత్త ఎత్తుగడ మొదలెట్టింది. అర్భాటంగా చేస్తున్న మహిళా రుణమాఫీలో

 

  మెలికలను పరిశీలిస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి బహిర్గతమవుతోంది.

 జిల్లాలో డ్వాక్రా మహిళా సంఘాలు 41,989 ఉన్నాయి. వీటి పరిధిలో 4,75,732 మంది సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఈ సంఘాలకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టింది. పది నెలలు పూర్తి కావచ్చినా మాఫీపై స్పష్టత లేకపోవడంతో మహిళా సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మభ్యపెట్టే ప్రయత్నాలు మొదలెట్టింది.

 

 వ్యక్తి గత ఖాతాలు లేనట్టే..

 పది నెలలుగా మహిళా సంఘాలకు వ్యక్తిగత ఖాతాలు ప్రారంభించాలని అధికారులు సూచిస్తూ వస్తున్నారు. వ్యక్తిగత ఖాతాలు లేకపోవడంవల్లే రుణమాఫీ జరగలేదని మభ్యపెట్టారు. డ్వాక్రా సంఘాల సభ్యులు హడావుడిగా చేతి చమురు వదుల్చుకుని ఖాతాలు తెరిచారు. పూర్తి రుణ మాఫీ కాదనీ, అప్పులతో సంబంధం లేకుండా సభ్యురాలికి రూ.10వేలు చొప్పున ఖాతాలకు జమ చేస్తామని ప్రకటించారు. ఈ నిబంధన సైతం మార్చి మొదటి విడతగా ఒక్కో సభ్యురాలికి 30 శాతం అంటే రూ.3వేలు చొప్పున బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని నమ్మబలికారు. తాజాగా వ్యక్తిగత ఖాతాలకు నిధులు జమ కాకుండా సంఘానికి 30 శాతం నిధులు మళ్లిస్తామని చెబుతున్నారు.

 

 మూలధనం మతలబు

 తాజాగా ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం డ్వాక్రా సంఘానికి సభ్యుల సంఖ్యను బట్టి రూ. 3వేలు చొప్పున బ్యాంకులకు జమ చేస్తారు. ఈ నిధులు మహిళా సంఘాలు వినియోగించుకునేందుకు వీలులేదు. బ్యాంకులో ఈ నిధులు మూలధనంగా ఉంచి బ్యాంకు రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. వంద శాతం నిధులు పూర్తయ్యే వరకు ఈ నిధులు బ్యాంకులోనే ఉండాలి. ఈ మొత్తాన్ని బ్యాంకు నుంచి విత్ డ్రా చేసేందుకు అనుమతి ఉండదు. కేవలం నిధులు మూలధనంగా మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన 70 శాతం ఎన్ని నెలల్లో జమ అవుతుందన్నది స్పష్టత లేదు.

 

 లబ్ధి అంతంతే...

 జిల్లాలో మహిళా సంఘాలరుణాలన్నీ మాఫీ చేయాల్సి వస్తే.. రూ.600 కోట్లు పైబడి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా సంఘానికి లక్ష చొప్పున చెల్లించినా.. రూ.419.89 కోట్లు వారి ఖాతాలకు జమ చేయాల్సి ఉంటుంది. తాజాగా పెట్టిన నిబంధనతో 30 శాతం నిధులు అంటే రూ.142 కోట్లు సంఘాలకు జమ కావాల్సి ఉంది. అదీ నిధులు జమ చేయకుండా కేవలం బ్యాంకులకు భరోసాతోనే సరిపెట్టేలా ఉంది.

 

 వడ్డీతోనే కాలయాపన..

 జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలు పొదుపు చేసిన మొత్తానికి సంబంధించి పది నెలల కాలానికి రూ.35,15,49,068లు వడ్డీ రూపంలో మహిళా సంఘాలకు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు మొత్తం మహిళా సంఘాలు పొదుపు చేసి రుణాలు చెల్లించిన దానికి రాయితీ కింద అందించాల్సినవే. ప్రస్తుతానికి ఈ నిధులనే బ్యాంకు ఖాతాలకు జమ చేసి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top