బహిరంగం వద్దు!


మరుగుదొడ్డితో ఆరోగ్యకరమైన జీవనం

  బహిరంగ మల విసర్జనను విడనాడండి

  టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వ తరఫున ఆర్థిక సాయం

 

 ఒకప్పుడు పచ్చిగాలితో సేద తీర్చే పల్లెపట్టులు ఇప్పుడు  దుర్గంధభూయిష్టంగా మారాయి. రోడ్లే బహిర్భూములుగా మారిపోయాయి.  ముక్కుమూసుకోనిదే గ్రామాల్లోకి వెళ్లడం దుర్లభం. మహిళల ఇబ్బందులు వర్ణానాతీతం. సిగ్గు విడిచి...చేసేది లేక చెట్లు,పుట్టల మాటుకు వెళ్లవలసి వస్తోంది.  గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన జరుగుతోంది.  దీన్ని నిర్మూలించేందుకు  ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇదే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు డ్వామా పీడీ ప్రశాంతి.  పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలోని పలు వీధుల్లో  పర్యటించిన ఆమె గ్రామస్తులతో  మాట్లాడారు.  ఆ సంభాషణ ఇలా సాగింది...

 

 పీడీ : నీ పేరేంటమ్మ..?

 మహిళ: నా పేరు లక్ష్మి.

 పీడీ: మరుగుదొడ్డి లేకుండా

 ఇన్ని సంవత్సరాలు ఉన్నారా..?

 లక్ష్మి: లేదమ్మ కట్టుకుంటున్నాం. ఇటీవలే అందుకు అవసరమయ్యే  గుంతను తవ్వించాం.

 పీడీ: ఎన్ని రోజుల్లో మరుగుదొడ్డి నిర్మాణ పనులు పూర్తి చేస్తారు ?

 లక్ష్మి : 15 రోజుల్లో     పూర్తవుతుందమ్మ.

 పీడీ : ఆ తరువాత మరుగుదొడ్డిని వినియోగిస్తారా ? బయటకు వెళతారా ?

 లక్ష్మి: లేదమ్మ మరుగుదొడ్డినే వాడుతాం. ఆడ వాళ్లు బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలం వస్తే మరింత నరకం. అందుకేనమ్మ కొత్తగా కట్టుకుంటున్నాం.

 పీడీ : బహిరంగ మలవిసర్జన  వల్ల వ్యాధులు ప్రబలడమేకాకుండా ఊరు కూడా అపరిశుభ్రంగా ఉంటుంది.  అందుకే ప్రభుత్వం తరఫున పోత్సాహకం అందిస్తున్నాం. తెలుసా..?

 లక్ష్మి : తెలిసిందమ్మా, ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే దీనిని నిర్మిస్తున్నాం.  రూ.15 వేలు చాలదు కాబట్టి మా ఇంట్లో డబ్బులతో కట్టుకుంటున్నాం.

 పీడీ : ఎందుకు చాలదు ? అందుకు తగిన కొలతలు ఇంజినీరింగ్ అధికారులు ఇవ్వలేదా ?

 లక్ష్మి : ఇచ్చారమ్మ. అయితే మా కుటుంబం పెద్దది. చాలదని మా  సొంత  డబ్బులు కలిపి  పెద్దది

 కట్టుకుంటున్నాం.

 పీడీ : నీ పేరంటమ్మ ..? మీ ఇంట్లో ఎందమంది ఉంటున్నారు.... మరుగుదొడ్డి ఉందా..?

 మహిళ : నాపేరు ఎర్రా.లీలావతి.    నేనూ, నా భర్త ఉంటున్నాం. ఇద్దరు ఆడపిళ్లకు పెళ్లిళ్లు అయిపోయాయి. అత్తవారింటికి  వెళ్లిపోయారు.  నెల రోజుల క్రితమే మరుగుదొడ్డి కట్టుకున్నాం.

 పీడీ : మరి వాడుతున్నారా..? మరుగుదొడ్డికి నీటి సరఫరా ఉందా..?

 లీలావతి: ఇంకా వాడలేదు. మామూలుగా బకెట్‌తో నీళ్లు పెట్టుకుని వాడుకోవటమే.

 పీడీ : కట్టుకున్న తరువాత మరుగుదొడ్డిని వాడలి..? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి..?

 లీలావతి: అలాగేనమ్మ . తప్పకుండా వాడుతాం.

 పీడీ : మీ పేరంటమ్మ ..? మీ  ఇంటికి మరుగుదొడ్డి ఉందా..?

 మహిళ: నా పేరు అనకం వీర్రాజు. ఇటీవలే మరుగుదొడ్డి కట్టుకున్నాం.

 పీడీ : మరి వాడుతున్నారా..? ముహూర్తం

 గురించి చూస్తున్నారా...?

 వీర్రాజు: ఇంకా వాడలేదు. గదికి తలుపులు వేయాల్సి ఉంది. వేసిన తరువాత ఉపయోగిస్తాం.

 పీడీ: ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే మంచిది కాదు. తప్పని సరిగా వాడాలి..?

 వీర్రాజు: అలాగేనమ్మ. మరుగుదొడ్డి కట్టినందుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇంకా రాలేదు.

 పీడీ : సొమ్ము విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటాం

 పీడీ : నీపేరంటమ్మ ..? మీ ఇంటికి మరుగుదొడ్డి ఉందా..?

 మహిళ: నా పేరు వెంకటలక్ష్మి. మా ఇంటికి మరుగుదొడ్డి లేదమ్మ,

 పీడీ : ఎందుకు కట్టుకోలేదు...?

 వెంకట లక్ష్మి: స్థలం లేక కట్టుకోలేదమ్మ.

 పీడీ : కొద్ది పాటి స్థలం ఉన్నా  అందులో మరుగుదొడ్డి కట్టుకోవచ్చు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అవసరం, లేకపోతే అనారోగ్యాల పాలవుతారు.. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్లు ఇబ్బందులు పడతారు. ?

 వెంకటలక్ష్మి:  ఎలా కట్టుకోవాలో తెలియకనే ఊరుకున్నాం.ఎలా కట్టాలో చెబితే కట్టుకుంటాం.

 పీడీ :  మీ గ్రామ సర్పంచ్‌ను గాని, కార్యదర్శినిగాని సంప్రదించండి

 పీడీ : మీ పేరేంటండి..?

 పురుషుడు : నా పేరు దల్లి ముత్యాలరెడ్డి. గ్రామ సర్పంచ్‌ను మేడమ్.

 పీడీ : మీ ఊరిలో మొత్తం ఎన్ని ఇళ్లు ఉన్నాయి..? అందులో ఎంత మందికి మరుగుదొడ్డి సౌకర్యం ఉంది..?

 సర్పంచ్ : మా గ్రామ పంచాయతీ కుమిలితో పాటు మధుర గ్రామాలుగా మరో మూడు ఉన్నాయి.

 మొత్తంగా 2,300 వరకు ఇళ్లు ఉన్నాయి. అందులో 200  ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. మరో 200 ఇళ్ల వరకు కొత్తగా కట్టుకుంటున్నారు.

 పీడీ : మిగిలిన వారంతా ఎందుకు కట్టుకోవటం లేదు. భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది కదా..? ఎందుకు ప్రజల్లో అవగాహన రావటం లేదు. ?

 సర్పంచ్:  లేదమ్మ. అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకోసం గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ, మహిళా వారు మెంబర్లు, వైద్య ఆరోగ్యశాఖసిబ్బందితో అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

 పీడీ:  కట్టిస్తాం అని చెప్పటం కాదు... అందరూ కట్టుకునేలా చేస్తారా..?

 సర్పంచ్ : అందరి ఇళ్లల్లో మరుగుదొడ్డి నిర్మాణాలు జరిగేలా చూస్తా. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం.

 పీడీ : మరుగుదొడ్డి నిర్మాణాలుచేపట్టిన తరువాత కూడా బహిరంగ మలవిసర్జనకు అలవాటు పడిన వారు వెళుతుంటే ఏం చర్యలు తీసుకుంటారు..?

 సర్పంచ్: ముందుగా బహిరంగ మలవిసర్జనకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటా. గ్రామానికి సమీపంలో ఉన్న తుప్పలు, డొంకలను శుభ్రం చేస్తాం. అప్పటికీ వెళితే రూ 500 చొప్పున అపరాధ రుసం విధించేందుకు  వెనుకాడం.

 పీడీ: గ్రామాల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి మహిళల కోసమే అన్నట్టుగా పురుషులు బహిరంగ మలవిసర్జనకు వెళుతున్నారు.  దీనిపై మీ సమాధానం..?

 సర్పంచ్: ఆడ, మగ, పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు మరుగుదొడ్డిని  వినియోగించేలా చర్యలు తీసుకుంటాం. త్వరలో స్వచ్ఛ కుమిలిగా మారుస్తాం.

 పీడీ: ఏమమ్మా.. మీ ఇంట్లో మరుగుదొడ్లు ఉన్నాయా..?  

 మహిళ: నాపేరు జానకి అండి. మేం మరుగుదొడ్డి కట్టుకున్నాం.  దానినే వాడుతున్నాం. బయటకు వెళ్లడం లేదు.

 పీడీ: మరి మీరో..?

 మహిళ: నా పేరు రాము. మాకు  సొంత ఇళ్లు లేదు. కట్టుకోలేదమ్మ.

 పీడీ : మీ పేరు... ఈ ఊరిలో మీరు ఏం చేస్తుంటారు...

 కార్యదర్శి : నా పేరు సంతోష్‌కుమార్. నేను కుమిలి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నా.

 పీడీ : మీ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.

 కార్యదర్శి: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం  ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించేలా చర్యలు తీసుకుంటాం.   పంచాయతీ పరిధిలో మొత్తం 2,300 ఇళ్లు ఉండగా.. అందులో 200 మందికే మరుగుదొడ్లు ఉన్నాయి.

 పీడీ : మరి మిగిలిన వారి పరిస్థితి..?

 కార్యదర్శి:ప్రస్తుతం పంచాయతీ పరిధిలో 270 యూనిట్లు మంజూరుకాగా, అందులో 110 వరకు పూర్తయ్యాయి. మిగిలిన వారు బాగానే స్పందిస్తున్నారు.

 పీడీ : మీపేరు.. ఈ ఊరిలో ఏం చేస్తుంటారు..?

 ఏఈ: నాపేరు మురళీమోహన్, హౌసింగ్ ఏఈగా పని చేస్తున్నా.

 పీడీ: గ్రామంలో చాలా వరకు ఇళ్లల్లో పెద్ద పెద్ద ట్యాంక్‌లతో మరుగుదొడ్డి నిర్మాణం చేపడుతున్నారు. అందువల్ల వారికి ఆర్థిక భారం పెరుగుతుంది కాదా... మరి అవగాహన కల్పించలేదా..?

 ఏఈ:  అవగాహన కల్పిస్తున్నాం, అయితే కొంతమందివి పెద్ద కుటుంబాలు కావటంతో పెద్ద ట్యాంక్‌లు కట్టుకుంటున్నారు.  ఈవిషయంలో వార్డు మెంబర్లను సమన్వయం  చేయటం ద్వారా  లక్ష్యాలను చేరుకుంటాం.

 పీడీ : మీ పేరు.. ?

 ఎంపీడీఓ : నా పేరు లక్ష్మి, నేను పూసపాటిరేగ మండల ఎంపీడీఓగా పని చేస్తున్నా.

 పీడీ:  మండలంలో మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతి ఎలా ఉంది..?

 ఎంపీడీఓ: మొత్తం 17వేల వరకు ఇళ్లు ఉండగా... అందులో 2000 మందికి ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం యూనిట్ ధరను పెంచటం వల్ల లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు. దీనిని మేము ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నాం.

 పీడీ: ప్రజల్లో ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు..?

 ఎంపీడీఓ : మండల స్థాయిలో ఉన్న అధికారుల సమన్వయంతో ఆయా శాఖల వారీగా ప్రతి సమావేశంలో అవగాహన కల్పిస్తున్నాం. గ్రామ స్థాయిలో ఉన్న 12 మంది అధికారులకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నాం.

 పీడీ: ఎక్కువ సంఖ్యలో నిర్మాణాలు జరిగే సమయంలో లబ్ధిదారులకు మెటిరీయల్ సప్లై చేస్తున్నారా..?

 ఎంపీడీఓ : ఇప్పటి వరకు ఎవరి వారే తెచ్చుకుంటున్నారు. కావాలని అడిగితే ఇంజినీరింగ్ అధికారులతో ఒకే మొత్తంలో తెప్పించే ఏర్పాటు చేస్తాం.

 

 బహిరంగ మలవిసర్జనకు

 స్వస్తి  చెప్పాలి :  పీడీ ప్రశాంతి

  బహిరంగ మలవిసర్జనకు స్వస్తి చెప్పాలి. బహిరంగ మల  విసర్జన  వల్ల ప్రధానంగా మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో రోగాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే పతి ఒక్కరు మరుగుదొడ్డి నిర్మించుకుని ఆరోగ్యకరంగా జీవనం సాగించాలి. మరుగుదొడ్డి నిర్మాణం కోసం ప్రభుత్వ పరంగా కొంత మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నాం.  ఆరు అడుగుల పొడవు , నాలుగు అడుగుల వెడల్పుతో నిర్మించే మరుగుదొడ్డికి  రూ15వేలు, మూడు అడుగులు పొడవు, నాలుగు అడుగుల వెడల్పు కలిగిన మరుగుదొడ్డి రూ12వేలు చొప్పున ప్రభుత్వం మంజూరు  చేస్తోంది. ప్రధానంగా లీచ్‌పిట్  నమూన తరహా నిర్మాణాలు స్థలం తక్కువగా ఉన్న వారు కట్టుకోవచ్చు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపడుతున్న కార్యక్రమాన్ని అన్ని వర్గాల వారు అర్ధం చేసుకుని విజయవంతం చేయాలి.  ఈ గ్రామంలో యూనిట్ మంజూరైన బ్యాంక్ నుంచి నిధులు విడుదల కావడం లేదన్నది ప్రజలు చెబుతున్నారు. ఈవిషయంపై  కలెక్టర్ ద్వారా బ్యాంక్ అధికారులను సంప్రదించి బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఇంట్లో  రెండు బ్యాంక్ అకౌంట్‌లు కలిగి ఉండటంతో పాటు వాటిని ఆధార్‌సీడింగ్ చేసుకోవటం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top