డ్వాక్రా మహిళలకూ టోపీ..!

డ్వాక్రా మహిళలకూ టోపీ..! - Sakshi


సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) కింద 61,711 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. ఇందులో 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మార్చి 31 నాటికి 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలు రూ.1611.03 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకున్నారు. చంద్రబాబు హామీ మేరకు ఆ రుణాలన్నింటినీ మాఫీ చేయాలి. కానీ.. సీఎంగా బాధ్యతలు స్వీకరిం చగానే మాట మార్చారు.



డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేమని ఏకంగా చేతులెత్తేశారు. ఒక్కో సంఘానికి రూ.లక్ష వంతున ప్రోత్సాహకంగా మూలధనాన్ని అందిస్తామని సెలవిచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాలకు రూ.617.11 కోట్లను ప్రోత్సాహకం రూపంలో మూలధనంగా అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూలధనం రూపంలో అందించే రూ.లక్షను ఎప్పటిలోగా సంఘాలకు విడుదల చేస్తారన్న అంశంపై స్పష్టత లేదు.



మంగళవారం విజయవాడలో రైతు సాధికార సంస్థ ప్రారంభోత్సవం సమయంలో డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకం అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పంట రుణాలను చెల్లించినట్లుగానే ఏటా 20 శాతం వంతున డ్వాక్రా సంఘాలకు ప్రోత్సాహక మూలధనాన్ని అందించాలని నిర్ణయించారు.



అంటే.. ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.లక్ష వంతున ఇచ్చే మూలధనంలో ఏటా రూ.20 వేల వంతున ఐదేళ్లపాటూ సంఘాల ఖాతాల్లో జమ చేస్తారన్న మాట. ఒక్కో సంఘంలో కనిష్టంగా పది నుంచి గరిష్టంగా 15 మంది వరకూ సభ్యులుగా ఉంటారు. సగటున ఒక్కో సంఘానికి పది మంది సభ్యులుగా ఉంటారని పరిగణించినా.. ఒక్కో మహిళకు ఏడాదికి రూ.రెండు వేలకు మించి దక్కదన్నది స్పష్టమవుతోంది.

 

మండిపడుతున్న మహిళలు..



ప్రభుత్వ నిర్ణయంపై మహిళలు మండిపడుతున్నారు. జిల్లాలో సంపూర్ణ ఆర్థిక చేకూర్పు(టోటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) పథకం కింద జిల్లాలోని 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలకు బ్యాంకర్లు రూ.1611.03 కోట్లను రుణాలుగా అందించారు. ఆ రుణాలు మాఫీ అవుతాయనుకున్న మహిళల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసింది. సాధారణంగా మహిళా సంఘాలకు బ్యాంకులు ఏడు శాతం వడ్డీపై రుణాలు ఇస్తాయి. కంతులను మహిళలు సక్రమంగా చెల్లిస్తే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. కానీ.. రుణమాఫీ అవుతుందని భావించిన మహిళలు కంతులు చెల్లించకపోవడంతో 14 శాతం వడ్డీని బ్యాంకర్లు వసూలు చేస్తున్నారు. మోయలేని రీతిలో వడ్డీ భారం పడటంతో మహిళలు లబోదిబోమంటున్నారు.

 

అప్పు కట్టకపోతే సీఐఎఫ్‌లో కట్..



డ్వాక్రా రుణాలను మాఫీ చేసేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో బ్యాంకర్లు వసూళ్లకు శ్రీకారం చుట్టారు. రుణాలను చెల్లించకపోతే సీఐఎఫ్(సామాజిక పెట్టుబడి నిధి), పొదుపు మొత్తం నుంచి నిధులను కంతులకు మళ్లిస్తామని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు. సీఐఎఫ్, పొదుపు నిధుల్లో ఒక్క రూపాయిని డ్రా చేయాలన్నా గ్రామైక్య సంఘం, ఆయా మహిళా సంఘాల అనుమతి తప్పనిసరి. కానీ.. బ్యాంకర్లు నిబంధనలను తుంగలోతొక్కి సీఐఎఫ్, పొదుపు నిధులను యథేచ్ఛగా అప్పుల కింద జమ చేసుకుంటున్నారు. జిల్లాలో సీఐఎఫ్(సామాజిక పెట్టుబడి) నిధి రూ.196 కోట్ల నుంచి రూ.95 కోట్లకు తగ్గిపోయినట్లు సమాచారం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top