అశ్రునయనాలతో డీవీ అంత్యక్రియలు

అశ్రునయనాలతో  డీవీ అంత్యక్రియలు


అధికార లాంఛనాలతో నిర్వహణ

దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖులు


 

విశాఖ లీగల్ : విశాఖ మాజీ మేయర్ డి.వి.సుబ్బారావు అంత్య క్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో ముగిశాయి. కాన్వెంట్ జంక్షన్ దరి హిందూ శ్మశాన వాటికలో డి.వి.తనయుడు అశేష జనవాహిని మధ్య చితికి నిప్పంటించారు. కిర్లంపూడి లే అవుట్‌లోని స్వగృహంలో ఉంచిన డి.వి.సుబ్బారావు పార్ధివదేహాన్ని సందర్శించడానికి దేశం నలుమూలల నుంచి అభిమానులు, సహచరులు, న్యాయవాదులు, అధికారులు, నగర ప్రముఖులు విచ్చేశారు. భారతీయ జనతా పార్టీకి సుధీర్ఘ సేవలు అందించినందుకు గానూ డీవీ సుబ్బారావు పార్థివ దేహంపై పార్టీ జెండాను ఎంపీ హరిబాబు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. డీవీ సుబ్బారావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగోపాల్‌నాయక్ డీవీ ఇంటి వద్ద గౌరవ వందనం  చేశారు. పోలీస్ బ్యాండ్‌తో ఊరేగింపు చేశారు. వేదిక ప్రక్రియ పూర్తయిన తర్వాత డీవీ తనయుడు సోమయాజులు చితికి నిప్పంటించారు.



పోలీసులు గౌరవ సూచకంగా వందన సమర్పణ చేసి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. మాజీ ఎంపీ భాట్టం శ్రీరామ్మూర్తి, రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్‌రాజు, స్టీల్‌ప్లాంట్ సీఎండీ మధుసూదనరావు, పోర్టు చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా సింహాచలం, ద్రోణంరాజు శ్రీనివాస్, వైఎస్సార్ కాంగ్రెస్ ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల సమన్వయకర్తలు తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, కేంద్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రామచంద్రరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యురాలు సీహెచ్ మాధవీలత, ఎస్.కృష్ణమోహన్, కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్, విశాఖ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు జనపరెడ్డి ఫృధ్వీరాజ్ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top