ఆధ్యాత్మిక ప్రయాణం.. విధి రాసిన విషాదం

ఆధ్యాత్మిక ప్రయాణం.. విధి రాసిన విషాదం - Sakshi


ఆధ్యాత్మికానందం కోసం సాగిస్తున్న ఆ ప్రయాణం మధ్యలోనే ముగిసింది. ఏడుగురు యాత్రికులు.. వందల కిలోమీటర్ల దూరం.. మూడు రోజుల కిందట బయలుదేరిన వీరు శ్రీశైలేశుని దర్శనానంతరం వెంకన్న సన్నిధికి పయనమయ్యారు. సోమవారం వేకువజామున వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం చాగలమర్రి మండల పరిధిలోని చిన్నబోధనం వద్ద జాతీయ రహదారి పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఎన్ని రోజుల యాత్రో తెలియదు.. ఎక్కడితో ముగుస్తుందో తెలియదు.. వాహనంలోని ఏడుగురూ మృత్యువాత పడ్డారు. వాహన రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పేర్లు మాత్రమే తెలుసుకోగలిగారు. మృతులంతా ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ నియోజకవర్గానికి

 చెందిన వారుగా గుర్తించారు.

 

 చాగలమర్రి: మృత్యువు మాటు వేసి విసిరిన పంజాకు రెప్పపాటులో ఘోరం జరిగింది. ఆనందంగా సాగుతున్న ఆ యువకుల తీర్ధయాత్ర అనంత లోకాలకు చేరింది. సోమవారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామ సమీపంలో ఇంట్లోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లిన ప్రమాదంలో ఏడుగురు యువకులు దుర్మరణం చెందారు. వాహనంలో అందరూ మృత్యువాత పడటంతో ప్రమాదానికి కారణాలు తెలియడం లేదు. కాగా వాహన డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది.

 

  మహారాష్ట్రలోని భారమతి నియోజకవర్గం దూలేగాం గ్రామానికి చెందిన రసాల్ సాగర్ అంకుష్(30), రసాల్‌సాగర్ బాలసు రసాయి(29), ర సాల్ ఆజీత్ రాంచంద్ర(28), ఉండవాడి సూప గ్రామానికి చెందిన గవాలి అనీల్మ్రేష్ (31), గవాలి శేఖర్ బాపురావు (27), గవాలి రుషికేష్(26), గవాలి మోహన్ దత్తాత్రేయ(30) లు ఎంహెచ్ 42కే 2443 నంబరు గల స్కార్పియో వాహనంలో మూడు రోజుల క్రితం దైవ దర్శనానికి బయలు దేరారు. రెండు కుటుంబాలకు చెందిన వీరంతా ఈనెల 21వ తేదీన బయలుదేరి మొదట శ్రీశైలం వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తుండగా కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిపై పెద్దబోధనం గ్రామం వద్ద రహదారి పక్కనే ఉన్న బాల ఓబయ్య ఇంట్లోకి వాహనం వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న రసాల్‌సాగర్ అంకుష్, రసాల్ సాగర్ బాలసు రసాయి, ర సాల్ ఆజీత్ రాంచంద్ర, గవాలి శేఖర్ బాపురావు, గవాలి రుషికేష్ వాహనంలో ఇరుక్కొని అక్కడి అక్కడే మృతి చెందారు. కారులో ఇరుక్కొని పోయిన మృతదేహాలను ఏఎస్‌పీ శశికుమార్ క్రేన్ ద్వారా బయటకు తీసి కారును పక్కకు తీయించారు.

 

 తీవ్రంగా గాయపడిన ఉండవాడిసూప గ్రామానికి చెందిన గవాలి అనీల్ రమేష్, డ్రైవర్ గవాలి మోహన్ దత్తాత్రేయలను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న పెద్దబోధనం గ్రామానికి చెందిన బాలనాగమ్మకు తీవ్ర గాయూలు కాగా కడపకు తరలించారు. శేఖర్, సురేంద్రకు స్వల్ప గాయాలయ్యాయి.   విషయం తెలుసుకొన్న ఆళ్లగడ్డ ఏఎస్‌పీ శశికుమార్, అగ్నిప్రమాదదళ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆళ్లగడ్డ ఇన్‌చార్జి సీఐ ప్రభాకర్ రెడ్డితో ప్రమాద వివరాలను అడిగి తెలుసుకొన్నారు. వాహన నంబర్ ఆధారంగా అక్కడి పోలీసులకు సమాచారం అం దించగా మృతుల వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలకు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మహారాష్ట్ర పోలీసులకు అప్పగిస్తామని ఆయన వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top