దసరా ఉత్సవాలకు రాష్ట్ర హోదా నేడో రేపో జీవో


ఉత్సవాలకు సిద్ధమవుతున్న దుర్గమ్మ ఆలయం

యాప్ టోల్‌ఫ్రీ నంబర్ 1800-121-7749

భక్తులకు అత్యుత్తమ సేవల కోసమే : కలెక్టర్    

 


విజయవాడ : ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, దీనిపై నేడో రేపో జీవో జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.



కలెక్టర్ ఆధ్వర్యంలో ఉత్సవాలు...

 దసరా ఉత్సవాలను ఇప్పటివరకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, మెడికల్, అగ్నిమాపక శాఖ తదితర శాఖలన్నీ దేవస్థానానికి సహకరిస్తున్నాయి. ఆయా శాఖలకు అయ్యే ఖర్చును దేవస్థానమే భరిస్తోంది. దీంతో దేవస్థానంపై ఆర్థిక భారం పడుతోంది. ప్రస్తుతం దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తే.. వీటి నిర్వహణ బాధ్యతను కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు తీసుకుంటారు. దీనికితోడు ఏ శాఖకు చెందిన పనుల్ని ఆ శాఖ అధికారులు నిర్వహిస్తారు. కేవలం ఉత్సవాలకు వచ్చే భక్తులకు కావాల్సిన క్యూలైన్ల ఏర్పాటు, ప్రసాదాల విక్రయం, దర్శనం వంటి కార్యక్రమాలనే దేవస్థానం అధికారులు చేపడతారు. ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. దీనివల్ల దేవస్థానం అధికారుల పై ఒత్తిడి, దేవాలయంపై ఆర్థిక భారం తగ్గుతాయి.



ప్రస్తుతం దేవస్థానం ఆధ్వర్యంలోనే...

 పక్షం రోజుల క్రితం రాష్ట్ర పండుగ హోదా ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం, మరోవైపు ఉత్సవాల సమయం దగ్గర పడటంతో దేవస్థానం అధికారులే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు జీవో వస్తే ఇక ఏర్పాట్ల బాధ్యతంతా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులే చూసుకుంటారని తెలుస్తోంది.

 

దసరా ఉత్సవాలకు 23 లక్షల లడ్డూలు

ఇంద్రకీలాద్రి : దసరా ఉత్సవాల కోసం 23 లక్షల లడ్డూలు తయారు చేసేందుకు అనుమతులు మంజూరు చేసినట్లు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఈవో నర్సింగరావు తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 13 నుంచి 22 వరకు జరిగే దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. వినాయకుడి గుడి నుంచి రెండు క్యూలైన్లుగా ప్రారంభమై ఆలయ ప్రాంగణానికి వచ్చే సరికి ఐదు క్యూలైన్లుగా మారతాయన్నారు. రెండు ఉచిత దర్శనం క్యూలైన్లు, రూ.50 టికెట్, రూ.100 టికెట్, రూ.250 టికెట్ దర్శనం క్యూలైన్లు సిద్ధం చేస్తామని చెప్పారు. దర్శనానంతరం మల్లికార్జున మహా మండపం నుంచి మూడు క్యూలైన్లు కొండ కిందకు దిగేలా ఏర్పాటు చేశామన్నారు. మల్లికార్జున ఆలయం నుంచి మరో రెండు క్యూలైన్లు కొండ కిందకు దిగేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 13వ తేదీ ఉదయం 8.30 గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని, మిగిలిన రోజుల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 వరకు దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. మూలా నక్షత్రం రోజున తెల్లవారుజామున 1.30 గంటల నుంచే భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. సమావేశంలో ఏఈవో వెంకటరెడ్డి, అచ్యుతరామయ్య, ఈఈ కోటేశ్వరరావు, వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్య తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top