దుర్గమ్మ తొలి దర్శనం ఐఏఎస్, ఐపీఎస్‌లకే

దుర్గమ్మ తొలి దర్శనం ఐఏఎస్, ఐపీఎస్‌లకే - Sakshi


విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారి తొలి దర్శనం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే చేసుకున్నారు. దుర్గగుడి అధికారులు మంగళవారం రాత్రి 1.40 నిమిషాలకు సరస్వతీదేవిగా కొలువైన అమ్మవారి దర్శనానికి అనుమతించారు.



ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావుతో పాటుగా జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, నగరంలో సీపీలుగా పని చేసి వెళ్లిన మధుసూదనరెడ్డి, బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ మురళి, మున్సిపల్ కమిషనర్ హరికృష్ణ, సబ్ కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్న వారిలో ఉన్నారు. ఆలయ ఉపప్రధాన అర్చకులు లింగంభొట్ల బదరీనాథ్‌బాబు అమ్మవారికి అద్వితీయంగా అలంకారం చేశారు. ప్రసన్నవదనంతో పద్మాసనంలో సరస్వతీదేవిగా కొలువుతీరిన అమ్మవారిని తిలకించిన ప్రతి ఒక్కరూ  పులకించిపోయారు.

 

‘ఐలాపురం’ను పక్కన పెట్టిన పోలీసు అధికారులు

 

అమ్మవారిని తొలి దర్శనం చేసుకోవడానికి వచ్చిన ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్యను పోలీసు అధికారులు పక్కన పెట్టారు. పైన రాజగోపురం నుంచి తాను ఎమ్మెల్సీ అని పదేపదే చెబితేనే పోలీసు అధికారులకు లోపలికి అనుమతించారు. లోపలికి వెళ్లిన తరువాత కూడా తొలి దర్శనం ఐపీఎస్, ఐఏఎస్‌లకేనంటూ ఐలాపురం వెంకయ్య కుటుంబాన్ని కొద్ది సేపు పక్కన ఉంచారు. కలెక్టర్, ఇతర ఐపీఎస్ అధికారులు దర్శనం చేసుకుని వచ్చిన తరువాత ఐలాపురం వెంకయ్యను, ఆయన కుటుంబ సభ్యులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

 

అడుగడుగునా పోలీసుల అత్యుత్సాహం



బుధవారం ఉదయం దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ పోలీసులు అడ్డుకోవడంతో పలువురు ఖంగుతిన్నారు. దర్శనం ప్రారంభమయ్యే ముందు స్థానిక సీఐ గీతారామకృష్ణ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను తప్ప ఎవరినీ లోపలకు అనుమతించవద్దని అక్కడ విధులు నిర్వహిస్తున్న మరో సీఐ పైడపునాయుడుకు సూచించారు. దీంతో ఆలయానికి వచ్చిన చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ భ్రమరాంబను, ఐలాపురం వెంకయ్యను పైడపునాయుడు అడ్డుకున్నారు.   



సిబ్బంది గట్టిగా చెప్పడంతో భ్రమరాంబను దర్శనానికి అనుమతించారు. వారితో పాటుగా ఆలయంలోపల విధులకు హాజరవ్వాల్సిన సిబ్బందిని, అర్చకులను సైతం సీఐ అడ్డుకోవడంతో వారంతా గొడవకు దిగడంతో లోపలికి పంపించారు. కేవలం పోలీసు అధికారులను, వారి కుటుంబ సభ్యులను మాత్రమే పంపటానికి  విధులు కేటాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శించారు. స్థానిక సీఐ, ఆలయ పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్న సీఐలకు అవగాహన లేకపోవడం, ఇష్టవచ్చినట్లుగా తాళాలు వేయడంతో భక్తులు, అధికారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top