దుర్గగుడి యాప్ విడుదల


విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నిర్వహించే దసరా ఉత్సవాల సందర్భంలో  భక్తులకు అత్యుత్తమ సేవలందించేందుకు టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం యాప్‌ను అధికారికంగా ఆయన విడుదల చేశారు. యాప్ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడంతో పాటు, నిరంతరం పనిచేసేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఒకే దఫా వేలాదిమంది యాప్‌ను చూసే సమయంలో హ్యాంగ్ (అంతరాయం) కాకుండా ప్రత్యేక సర్వర్‌తో వేగవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ యాప్ ద్వారా వివిధ సేవల వివరాలతో పాటు ఏయే ప్రాంతాల్లో ఆయా సేవలు అందుబాటులో ఉన్నాయో తెలియజేయనున్నట్లు చెప్పారు. అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, కేశ ఖండన, తాగునీటి వసతి, వసతి గృహాలు, సామగ్రి భద్రపరుచుకునే గదులు, చెప్పుల స్టాండ్, దుస్తులు మార్చుకునే గదులు, స్నాన ఘట్టాలు, క్యూలైన్లలోకి ప్రవేశం, నిష్ర్కమణ వంటి సేవల వివరాలు అందరికీ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, అక్కడి నుంచి ఆలయానికి, ఘాట్‌లకు రవాణా సౌకర్యాల వివరాలను కూడా అందిస్తున్నట్లు చెప్పారు.



 ప్రసాదాల కౌంటర్లు 20కి పెంపు...

 ప్రసాదాలు ఇచ్చే కౌంటర్లను గతంలో 14 ఏర్పాటు చేయగా ప్రస్తుతం వాటిని 20కి పెంచినట్లు తెలిపారు. దేవాలయంలో నిర్వహించే సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది వివరాలు, దర్శన ప్రదేశం, విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ప్రదేశం, శాఖలకు చెందిన రంగుల చిహ్న వివరాలు అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్ నుంచి జౌౌజ్ఛ/ఝఛిటఠీటఞ ని డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఈ-సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నాలుగు లైన్లలో 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ 1800-121-7749 సేవలను ప్రజలకు, భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించుకునే వేళలు ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు, సాయంత్రం మూడు నుంచి నాలుగు గంటల వరకు నిర్దేశించినట్లు చెప్పారు. వారు ముందుగానే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి నమోదు చేయించుకోవాలన్నారు. ఇందుకుగాను ప్రత్యేక దర్శన టికెట్ రూ.300 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి కార్యనిర్వహణాధికారి సిహెచ్.నరసింగరావు, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, ఎలైట్ ఎంటర్‌ప్రైజస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ డెరైక్టర్ పి.రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top