మూగ వేదన..!


సాక్షి, కడప: జిల్లాలో ఆవులు 1.38 లక్షలు, బర్రెలు 4.57 లక్షలు, గొర్రెలు 13.99 లక్షలు, మేకలు 4.53 లక్షల వరకు ఉన్నాయి. వ్యవసాయంలో లాభాల కంటే నష్టాలే ఎక్కువ వస్తున్నాయని భావిస్తున్న అన్నదాత పాడిపరిశ్రమ, గొర్రెల పెంపకంపై కూడా దృష్టి మరల్చాడు. ఆశాజనకంగాబ్రతుకుతున్న వారిపై కరువు పెద్ద దెబ్బ కొట్టింది.


ఎలాగోలా రెండు నెలలు గడిచిపోతే చాలు అనుకుంటున్న వారికి ప్రస్తుతం ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఎందుకంటే వేసవి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎండుగడ్డి కూడా దొరికే పరిస్థితి లేక పోవడంతో పశువులను, గొర్రెలను రక్షించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం గతంలో నిర్మించిన తొట్లు కూడా చాలా వరకు నిరుపయోగంగా మారటంతో అడవిలో జంతువులకు నీరు కరువవుతోంది.

 

వలసే శరణ్యం అంటున్న కాపరులు

ప్రధానంగా పులివెందుల, రాయచోటి, జమ్మలమడుగు, బద్వేలు తదితర ప్రాంతాల్లోని గొర్రెల కాపరులు వలస పోతున్నారు. వందల సంఖ్యలో వారికున్న గొర్రెలు, పొట్టేలు, మేకలను తోలుకొని వెళుతున్నారు. స్థానికంగా వనరులు లేక పోవడంతో కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, కర్ణాటకలోని పలు ప్రాంతాలతో పాటు మైదుకూరు, రాజుపాలెం మండలాల్లోని ప్రాంతాలకు వలస వెళుతున్నారు. అక్కడ పచ్చిక ఉన్న పొలాలను లక్షలు వ్యయం వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండు, మూడు నెలలు కాలం గ డిస్తే చాలని, ఈ లోపు ఎన్ని అవాంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.



ఇప్పటికే మండల కేంద్రమైన తొండూరులో ఐదారు కుటుంబాలకు చెందిన కాపరులు గొర్రెలను తీసుకుని వలస పోగా,  అదే మండలంలోని కోరవానిపల్లెలో కూడా సుమారు 10 మందికి పైగా కాపరులు తమకున్న పొట్టేళ్లను తోలుకుని వలస వె ళ్లిపోయారు. ఈ రెండు గ్రామాల్లోనే కాదు...ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు మూడు నెలలు పొట్టేళ్లను, మేకలను అక్కడే ఉంచి చూసుకోవాల్సి వస్తోందని.... కరువుతో కుటుంబ సభ్యులను వదలిపెట్టి అక్కడికి వెళ్లడం బాధకు గురి చేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

కబేళాలకు తరలుతున్న పశువులు

వర్షాభావంతో కరువుతో కొంతమంది, మేత లేక మరికొంత మంది అన్నదాతలు తమ బతుకుకు ఆధారం చూపిన పశువులనే అమ్ముకోవాల్సి వస్తోంది. పశువులకు, ఎద్దులకు మేత లేకపోవడంతలో మైదుకూరు, పులివెందుల, రామాపురం లాంటి సంతలకు వందల సంఖ్యలో తోలుకునిపోయి విక్రయిస్తున్నారు. విక్రయించడానికి ఇష్టం లేక పోయినా తప్పని పరిస్థితుల్లో వాటిని అమ్మేస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన వారిలో ఎక్కువగా కబేళాలకు తరలిస్తున్నారు.

 

నా పేరు ఆర్.వెంకట రమణ. నాకు 300 గొర్రెలు ఉన్నాయి. ఇప్పటికే రెండు, మూడు నెలలుగా అష్టకష్టాలు పడి మేపు లేకపోయినా దూర ప్రాంతాలకు వెళ్లి మేపుకుంటూ వస్తున్నా. ఇప్పుడు ఎక్కడ చూసినా రబీలో పంటలు కూడా వర్షాలు లేక ఎండిపోయాయి. పచ్చిక లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో వలస పోవాల్సి వచ్చింది. కర్నూలుజిల్లా ఆళ్లగడ్డ, రాజుపాలెం మండలంలోని టంగుటూరు ప్రాంతంలో సుమారు రూ. 10 లక్షలు పెట్టి పొలాల్లోని గడ్డి కొనుక్కున్నా.  వర్షాలు పడకపోవడంతోనే ఇలా సొంత ఊరు విడిచి వలస రావాల్సి వచ్చింది.  

 

నా పేరు బి.గంగాధర్. మాది తొండూరు మండలం కొరవానిపల్లె గ్రామం. మాకు 200 గొర్రెలు, పొట్టేళ్లు ఉన్నాయి. వాటికి ఆహారం, నీరు కొరతగా ఉంది. ఎవరినైనా నీరు అడిగితే మాకే చాల్లేదు...మీకు యాడిస్తాం అంటున్నారు. దీంతో మేపు కోసం ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చి పొలం కొనుక్కొని అక్కడున్న గడ్డితో కాలం వెళ్లదీస్తున్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top