ఫోన్ చేస్తే చాలు


 జంగారెడ్డిగూడెం : మధ్యాహ్నం 3.45 గంటలైంది. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తరగతులు ముగిసి విద్యార్థులు బయటకొచ్చే సమయమది. అక్కడేమైనా ర్యాంగింగ్ జరుగుతోందా.. విద్యార్థినులు ఆకతాయిల బెడదను ఎదుర్కొంటున్నారా.. అనే విషయాలను తెలుసుకునేందుకు డీఎస్పీ జె.వెంకటరావు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా విద్యార్థులు, విద్యార్థినులు, అధ్యాపకులతో మాట్లాడారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. డీఎస్పీ వెంకటరావు వీఐపీ రిపోర్టింగ్ ఇలా సాగింది.

 

 డీఎస్పీ : ఏమ్మా.. ఏం చదువుకుంటున్నారు.

 సీహెచ్ ఉష, విద్యార్థిని : డీసీఈ ఫైనలియర్ చదువుతున్నా సార్.

 డీఎస్పీ : మీది ఏ ఊరు.

 ఎం.సుధావలి : మేమంతా విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం సార్.

 డీఎస్పీ : మరి ఎక్కడ ఉంటున్నారమ్మా.

 ఎం.కల్యాణ్‌దుర్గ : హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాం.

 డీఎస్పీ : మీకేమైనా ఇబ్బందులున్నాయా.

 విద్యార్థినులు : లేవు సార్. అంతా బాగానే ఉంది.

 డీఎస్పీ : మీ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతోందా.

 ఎ.అనూష : లేదు సార్.

 డీఎస్పీ : ర్యాగింగ్ నివారణ కమిటీలు ఉన్నాయా

 టి.స్నేహ : ఉన్నాయండి. ఆ కమిటీ పెద్దలు సమస్యలు లేకుండా చూస్తున్నారు.

 డీఎస్పీ : మీరు కాలేజీకి వచ్చేప్పుడు.. హాస్టల్ వెళ్లేప్పుడు ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారా.

 సీహెచ్.ఉమ : లేదు సార్.

 డీఎస్పీ : మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా 100కు లేదా నా నంబర్ 94407 96626కు ఫోన్ చేసి చెప్పండి. పోలీసులు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారు.

 పి.రాజేశ్వరి : థాంక్యూ సార్. మాకు ఎలాంటి సమస్య వచ్చినా మీ దృష్టికి తీసుకువస్తాం.  

 డీఎస్పీ : మీ హాస్టల్‌లో సమస్యలున్నాయా. అక్కడకు వచ్చి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారా.

 పి.రాజేశ్వరి : లేవండి. అక్కడ సంరక్షకులు సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 డీఎస్పీ : మాస్టారూ.. మీ ఈ కాలేజీలో ఏ బాధ్యతలు చూస్తున్నారు.

 ఎన్‌జేకే నరేంద్రకుమార్ : నేను ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నాను.

 డీఎస్పీ : కళాశాల లోపల, బయట ఆకతాయిల బెడద ఉంటున్నట్టు మీ దృష్టికి వచ్చిందా.

 ప్రిన్సిపాల్ : లేదండి. తరగతులు ప్రారంభమయ్యే సందర్భంలోనే విద్యార్థులకు ఈవ్‌టీజింగ్ వల్ల కలిగే అనర్థాలను, మంచి స్నేహితులుగా ఉంటే కలిగే లాభాలను వివరిస్తున్నాం. ఈ విషయాలను తరచూ గుర్తు చేస్తుంటాం. యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉంచుతున్నాం. ఇప్పటివరకు మా కాలేజీలో ఎటువంటి ఇబ్బంది రాలేదు.

 డీఎస్పీ : విద్యార్థినుల విషయంలో మీరు తీసుకుంటున్న చర్యలేమిటి.

 ఎం.ఉషారాణి, రసాయన శాస్త్ర అధ్యాపకులు: మా కాలేజీ విద్యార్థినులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అప్పుడప్పుడూ పోలీ సు శాఖ అధికారులు కూడా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది.

 నిర్భయంగా ఫిర్యాదు చేయండి

 

 కళాశాలలకు వచ్చి చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులకు చక్కని వాతావరణం అవసరం. ముఖ్యంగా చాలామంది ర్యాగింగ్ భూతానికి భయపడుతుంటారు. ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరం. అవసరమైతే కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది. భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. ఈ విషయాలను తెలుసుకుని విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలి. చదువుపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత చదువుల వైపు సాగాలి. కళాశాలకు వచ్చే సమయంలో బయట వ్యక్తుల నుంచి ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఎవరూ భయపడొద్దు. నిర్భయంగా విద్యార్థులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేయాలి. బాధితులకు అన్నివిధాలుగా సహకారం అందిస్తాం. ప్రతి ఒక్క విద్యార్థి చట్టంపై అవగాహన పెంచుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

 - జె.వెంకటరావు, డీఎస్పీ, జంగారెడ్డిగూడెం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top