డీఎస్సీ గందరగోళం


విశాఖ రూరల్: ప్రభుత్వ తీరు డీఎస్సీ అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోంది. ఉపాధ్యాయ నియామకాలకు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ జిల్లాల వారీగా పోస్టులను మాత్రం వెల్లడించలేదు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. జిల్లాలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తారా? లేక పోస్టులను తగ్గిస్తారా? అన్న అనుమానాలు సర్వత్రా నెలకొంటున్నాయి. డీఎస్సీ పరీక్షకు షెడ్యూల్ విడుదలైందన్న ఆనందం మాటెలా ఉన్నా.. పోస్టుల విషయాన్ని తెల్చకపోవడంతో నోటిఫికేషన్‌పై సర్వత్రా అపోహలు ముసురుకుంటున్నాయి.



గతంలో ఉపాధ్యాయ దినోత్సవం రోజున డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని స్వయంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించినప్పటికీ మాట తప్పారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామంటూ నోటిఫికేషన్‌ను వాయిదా వేసుకుంటూ వచ్చారు. భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ రేషనలైజేషన్ చర్యలతో అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. జిల్లాలో సుమారు 750 పోస్టులకు రేషనలైజేషన్ కారణంగా గండి పడింది. ఆ ప్రక్రియ మాత్రం జరగలేదు. ఫలితంగా పోస్టుల్లో కోత పడి కేవలం 1187 పోస్టులను మాత్రమే డీఎస్సీకి జిల్లా విద్యా శాఖ నోటిఫై చేసింది. ఇందులో ఏజెన్సీలోనే ఎక్కువ పోస్టులున్నాయి. మరోవైపు అన్ని కేటగిరీల్లో కలిపి సుమారు 220 పోస్టులు బ్యాక్‌లాగ్‌కు చెందినవే ఉండడం గమనార్హం.



మూడు సబ్జెకులే అధికం: జిల్లా విద్యా శాఖ సెప్టెంబర్‌లో నోటిఫై చేసిన పోస్టుల ప్రకారం డీఎస్సీలో జిల్లాలో గణితం(106), సోషల్(131), హిందీ భాషా పండితులు(57) కేటగిరీపైనే అర్హులైన అభ్యర్థులకు కాస్త ఎక్కువ ఆశలున్నాయి. బయాలజీ(29), స్కూల్ అసిస్టెంట్ తెలుగు(28), పీఈటీ(28) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మైదాన ప్రాంతంలో స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం, తెలుగు భాషా పండిత పోస్టులు ఒక్కటి కూడా లేదు. ఆయా కేటగిరీకి చెందిన అభ్యర్థులు స్థానికేతరులుగా పక్క జిల్లాల్ని ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఎస్జీటీ ఆశావహులకు మాత్రం ఈ డీఎస్సీ కాస్త ఆశాజనకంగానే ఉంది.



మైదాన ప్రాంతంలో కంటే ఏజెన్సీలోనే ఎస్జీటీ పోస్టులు అధికంగా ఉన్నాయి. ఇందులో సుమారు 150 వరకు బ్యాక్‌లాగ్ అని సమాచారం. మైదానంలో అన్ని కేటగిరీల్లో కలిపి మరో 70 పోస్టుల వరకు బ్యాక్‌లాగ్‌లో ఉన్నాయి. జిల్లా విద్యా శాఖ నోటిఫై చేసిన ఈ పోస్టుల్లో ప్రభుత్వం ఎన్ని మంజూరు చేస్తుందన్న విషయంపై డీఎస్సీ అభ్యర్థులో ఆందోళన నెలకొంది. ఈ రెండు రోజుల్లో పూర్తి స్థాయి నోటి ఫికేషన్ రాని పక్షంలో డిసెంబర్ 2వ తేదీ తరువాత పోస్టుల వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. అప్పటి వరకు డీ ఎస్సీ అభ్యర్థులకు టెన్షన్ తప్పేట్టు లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top