‘ఒట్టి’చాకిరే..!


విద్యాశాఖ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న డీఎస్సీ అభ్యర్థులు

విద్యావాలంటీర్లుగా నియమించే యోచనపై అభ్యంతరం

అప్రెంటిస్ వ్యవస్థను తిరిగితెచ్చే యత్నాలపై తీవ్ర నిరసన

సోషల్ మీడియా ద్వారా   మంత్రి గంటాకు వినతుల వెల్లువ

ఈ నెల 29న విజయవాడ,   తిరుపతి, విశాఖపట్నంలలో    ఏకకాలంలో సమావేశాలు


 

వినుకొండ టౌన్:  జిల్లాలో సుమారు 30 వేల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి, ఆరునెలలుగా తుది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. 2014 నవంబర్ 19న డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా.. 2015 మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత డీఎస్సీ కీలో నెలకొన్న తప్పిదాలపై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో తుది ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతోంది. కోర్టుకేసులు తుది దశకు చేరుకున్నాయని, తుది తీర్పు ఎప్పడైనా రావచ్చని అభ్యర్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ మెరిట్ అభ్యర్థులను తుది నియామకాలు ఇచ్చేంత వరకు విద్యావాలంటీర్లుగా నియమించాలనేది ప్రభుత్వం ఆలోచన. ఈనెల 21న హైదరాబాద్‌లో జరిగిన విద్యాశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ఆలోచన చేసినట్టు తెలియడంతో డీఎస్సీ అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో విద్యాశాఖలో అప్రెంటీస్ విధానం ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయులుగా నియామకం పొందిన వారు రూ.1200, రూ.1500ల నెలవారీ వేతనంతో రెండేళ్ల పాటు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. అప్రెంటీస్ పూర్తయిన వారినే రెగ్యులర్ ప్రాతిపదికన ఉపాధ్యాయులుగా నియమించేవారు. ఎన్నో పోరాటాలు చేసిన ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ఈ అప్రెంటీస్ విధానాన్ని 2008 డీఎస్సీ నుంచి రద్దు చేయించారు. అప్పటి నుంచి పూర్తి ప్రారంభ వేతనంతో ఉపాధ్యాయ నియామకాలు జరుగుతున్నాయి. తిరిగి ఇప్పుడు డీఎస్సీ మెరిట్ అభ్యర్థులతో విద్యావాలంటీర్లుగా రూ.5వేలు.రూ.7వేల గౌరవ వేతనంతో నియమించాలని విద్యాశాఖ ఆలోచన చేస్తుండటంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. విద్యావాలంటీర్లుగా నియమించడం అంటే అప్రెంటీస్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడమేనని ఆరోపిస్తున్నారు.



సోషల్ మీడియా ద్వారా నిరసన...

విద్యాశాఖ ఆలోచనను నిరసిస్తూ డీఎస్సీ అభ్యర్థులు ఫేస్‌బుక్, వాట్స్‌యాప్‌ల ద్వారా మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు తమ నిరసన తెలుపుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే డీఎస్సీ నియామకాలు ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు కేసులు తుది దశకు వచ్చిన నేపథ్యంలో మళ్లీ విద్యావాలంటీర్ల నియామకం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల నుంచి డీఎస్సీ అభ్యర్థులు ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా మంత్రి గంటాకు తమ నిరసన తెలుపుతున్నారు. గతించిపోయిన అప్రెంటీస్ విధానాన్ని విద్యావాలంటీర్ల రూపంలో మళ్లీ తీసుకు రావద్దని వేడుకుంటున్నారు

 

29న డీఎస్సీ సాధన సమితి సమావేశం..

డీఎస్సీ నియామకాలు త్వరగా చేపట్టాలని, మెరిట్ అభ్యర్థులతో విద్యావాలంటీర్ల నియామక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డీఎస్సీ అభ్యర్థులు ఈ నెల 29న విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో ఏకకాలంలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. లేకుంటే ఆందోళన చేపడతామంటున్నారు.

 

 

 అప్రెంటిస్ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టడమే..


 గతంలో చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో అప్రెంటీస్ వ్యవస్థ ఉంది. ఐదు వేల రూపాయల నెల జీతంతో విద్యా వాటంటీ ర్లుగా డీఎస్సీ మెరిట్ అభ్యర్థును నియమించటం అంటే అప్రెంటీస్ విధానం తిరిగి తీసుకురావడం లాంటిదే. ప్రభుత్వం తన నిర్ణయాన్ని విరమించుకుని డీఎస్సీ నియామకాలు చేపట్టాలి.

 - జి.వి.ప్రవీణ్‌కుమార్, ఎస్‌జీటీ అభ్యర్థి



ఇప్పటికే ఎంతో నష్టం...

 విద్యావాలంటీర్లుగా నియమించాలన్నా మెరిట్ జాబితా ఇవ్వాలి. అదే మెరిట్ జాబితా ఇచ్చి నేరుగా నియామకాలు చేపట్ట వచ్చుకదా. ఇప్పటికే తీవ్ర ఆలస్యం జరిగి నష్టపోతున్నాం. ప్రభుత్వం నిరుద్యోగుల గోడు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలి.

 - జి.రామ్‌సింగ్, ఎస్‌జీటీ అభ్యర్థి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top