తప్పతాగి రాంగ్‌ రూట్‌లో..


గుంటూరు : ఏలూరు మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ కుమారుడు తప్పతాగి బైక్‌పై హల్‌చల్‌ చేశాడు. రాంగ్‌రూట్‌లో వెళ్తూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మేయర్‌ కుమారుడికి స్వల్పగాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించినట్టు సమాచారం.



బాధితునికి వైద్య ఖర్చులు మొత్తం భరిస్తామని.. కేసు వద్దని చెప్పిన మేయర్‌ తరఫు వ్యక్తులు ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో ఆ  ప్రైవేటు ఆసుపత్రి వైద్యం నిలిపివేయడంతో బాధితుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. వివరాలు ఇవి.. ఏలూరు మేయరు కుమారుడు ఎస్‌కే సుభానిబాషా (మంజునాథ్‌) తాడేపల్లిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల తర్వాత  మద్యం తాగిన మైకంలో బైక్‌పై రాంగ్‌ రూట్‌లో వెళ్లి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో  తాడేపల్లి అంజిరెడ్డి కాలనీకి చెందిన వేమూరి కిషోర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సుభానిబాషా బైక్‌పై అతనితోపాటు మరో యువకుడు కులదీప్‌ ఉన్నారు. వీరికి కూడా గాయాలు అయ్యాయని సమాచారం. కిషోర్‌కు తీవ్ర గాయాలై రక్తస్రావం అధికం కావడంతో వైద్యం నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సదరు మేయర్‌ పీఏ రాత్రికి రాత్రి తాడేపల్లి చేరుకున్నారు. ఎంత ఖర్చు అయినా తామే పెట్టుకుంటామంటూ కిషోర్‌ బంధువులతో నమ్మబలికాడు. 

 

కిషోర్‌ వైద్యం చేయిస్తానన్నారని అతని కుటుంబు సభ్యులు రాజీకి మొగ్గు చూపారు. దీంతో పోలీసులు కూడా దీనిపై చూసీచూడనట్టు వ్యవహరించారు. ఇదే అదనుగా ప్రమాదానికి కారణమైన సుభానిబాషాను అక్కడ నుండి తీసుకెళ్లిపోయారు. సదరు మేయర్‌ పీఏ కార్పొరేట్‌ ఆసుపత్రిలో కిషోర్‌ వైద్యానికిగాను డబ్బు చెల్లించకపోవడంతో అతడికి వైద్యం నిలిపివేశారు. బాధితుడి బంధువులు అతడికి ఫోన్‌ చేసినా పట్టించుకోవడం లేదు. చావుబతుకుల మధ్య ఉన్న కిషోర్‌ను కార్పొరేట్‌ ఆస్పత్రి నుంచి తీసుకెళ్లి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి ఆందోళనకగా ఉందని తెలిపారు. రాత్రి తప్ప తాగి ఉన్నారు కాబట్టి మేయర్‌ కుమారుడు, అతని స్నేహితుడిపై పెద్ద కేసు అవుతుందని, వారి జీవితం నాశనం అవుతుందని మాయమాటలు చెప్పి తమను మోసం చేశారని, బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితేకాని డొక్కాడని తమకు లక్షలు పెట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు మేయర్‌  తన పార్టీ నాయకుల సహకారంతో వ్యవహారాన్ని సెటిల్‌ చేయించేందుకు యత్నాలు ముమ్మరం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top