...నిజ్జంగా... పొలమే పిలుస్తోంది

...నిజ్జంగా... పొలమే పిలుస్తోంది - Sakshi


ఒంగోలు టూటౌన్: పొలం పిలుస్తోంది కార్యక్రమం జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అని చెప్పుకుంటున్న ఈ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన కరువైంది.  స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఊసే లేదు. వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల అధికారులు,  క్షేత్రస్థాయి సిబ్బంది అరకొరగా పాల్గొంటూ కార్యక్రమంఅయిపోయిందనిపిస్తున్నారు. దీంతో వ్యవసాయంలో నూతన సాంకేతిక సలహాలు, సూచనలు, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి, ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ వంటివి అన్నదాత దరి చేరడంలేదు.

 

లక్ష్యం ఇదీ...

వ్యవసాయంలో నూతన సాంకేతిక సలహాలు, రైతుల సంక్షేమ పథకాలు, ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడి, ఆధునిక పద్ధతుల వంటి వాటిపై రైతులను చైతన్యం చేసేందుకు 2014 ఆగస్టు నెలలో ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 56 మండలాల్లో రోజుకి రెండేసి గ్రామాల చొప్పున 112 గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని  నిర్వహించాలని తలపెట్టారు. వారంలో మంగళ, బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  మూడు నెలలకి కార్యచరణ రూపొందించారు.  

 

సమావేశాల తీరిదీ...

గత ఏడాది ఆగస్టు 12న చీమకుర్తి మండలం బండ్లముడి గ్రామంలో మంత్రి సిద్ధా రాఘవరావు ఈ కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతిధుల భాగస్వామ్యంతోపాటు వ్యవసాయానుబంధ శాఖల అధికారులు అందరూ విధిగాపాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. మండల స్థాయి అధికారులు ఒకరిద్దరు మినహా మిగతా శాఖల అధికారులు అంతగా పాల్గొనడం లేదు. రైతులు నలుగురు లేక ఐదుగురికి మించి హాజరు కాని పరిస్థితి ఉంది.

 

సాగు నడత ఇలా...

సేద్యం ముందుకు సాగని పరిస్థితి జిల్లాలో ఏర్పడింది. ఖరీఫ్‌లో 2,44,064 హెక్టార్లకుగాను లక్షా హెక్టార్లు కూడా సాగు కాలేదు.  వర్షాలు కురుస్తాయన్న ఆశతో ముందస్తుగా సాగు చేసిన పంటలకు చుక్కెదురయింది. గత ఏడాది నవంబర్ నెల చివరిలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం ప్రారంభించారు. రబీలో కూడా ఆశించిన స్థాయిలో పంటలు సాగు కాలేదు. 3 లక్షల హెక్టార్లకుగాను సగానికి సగం సాగు పడిపోయింది.



ఖరీఫ్ పంటల నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందంటే జిల్లాలో దుర్భిక్ష తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఈ సమయంలో ‘పొలం బడి, పొలం పిలుస్తోంది’ పేర్లతో వ్యవసాయ అధికారులు చేపడుతున్న అరకొర కార్యక్రమాలకు కూడా రైతులనుంచి స్పందన కొరవడింది.  రైతులు లేకుండానే ప్రదర్శన క్షేత్రాలు నిర్వహిస్తున్నట్టు రికార్డుల్లో రాసుకుంటున్నారు తప్ప ఆచరణలో ఏమీ జరగడం లేదు.కొత్తపట్నం మండలంలో గత మంగళవారం మండల వ్యవసాయాధికారి అధ్యక్షతన  నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో కేవలం నలుగురు రైతులు మాత్రమే పాల్గొనడం  ఇందుకు తాజా ఉదాహరణ.

 

రుణమాఫీ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాలకు అధికారులు అక్కడక్కడా వెళ్తున్నా రైతుల నుంచి రుణమాఫీ ఏమైందంటూ ఎదురు ప్రశ్నలు వేస్తుండడంతో సమావేశం రసాభాసగా మారుతోంది. ఏదోఒక సాకు చెప్పి అక్కడనుంచి తప్పించుకు రావడం నిర్వాహకుల వంతవుతోంది. దీంతో గ్రామాల్లోకి వెళ్లాలంటే వ్యవసాయాధికారులకు ముచ్చెమటలు ఎక్కుతున్నాయి. వ్యవసాయశాఖతోపాటు దాని అనుబంధ శాఖలు  ప్రచురించిన కరపత్రాలూ ప్రయోజనం ఇవ్వడం లేదు. ప్రజాధనం దుర్వినియోగమవుతుందే తప్ప అన్నదాతకు అదనంగా ఒనగూరిందేమీ లేదని పలువురు రైతులు పెదవి విరుస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top