డ్రైవర్ల మధ్య వివాదం.. ప్రయాణికుడికి శాపం

డ్రైవర్ల మధ్య వివాదం.. ప్రయాణికుడికి శాపం - Sakshi

  • ఆర్టీసీ డ్రైవర్‌పైకి రాయి విసరబోయి ప్రయాణికుడి పైకి

  • తీవ్ర గాయాలైన కారుడ్రైవర్‌

  • కన్నీరుమున్నీరవుతున్న భార్యాపిల్లలు



  • గోపాలపట్నం (విశాఖ పశ్చిమ) : బస్‌ డ్రైవర్‌కు ఓ ఆటో డ్రైవర్‌కు వివాదం తలెత్తింది. ఇలా వాగ్వాదం ముదిరాక కొద్ది దూరం వెళ్లి ఆటో డ్రైవరు కాపు కాసి మరీ బస్‌ డ్రైవర్‌పై రాయి విసిరేశాడు. ఆ రాయి బస్‌లో ఉన్న ఓ ప్రయాణికుడికి తగిలి ఏకంగా కన్నే పోయింది. దీంతో ఆ కుటుంబం దుఃఖంతో కుమిలిపోతోంది. పేదరికంతో నలిగిపోతున్న ఆ వ్యక్తికి ఇపుడు భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. న్యాయం చేయాలంటూ భార్యాపిల్లలూ పోలీసులను వేడుకుంటున్నారు.



    వివరాలిలా ఉన్నాయి. నాయుడుతోట దుర్గానగర్‌కు చెందిన షేక్‌ సురాజుద్దీన్‌ (36) కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 25 సాయంత్రం నగరంలోని పోస్టాఫీస్‌ నుంచి కొత్తవలస Ððవెళ్తున్న ఆర్టీసీ బస్‌ (6కె)లో ఆయన ప్రయాణిస్తున్నాడు. పెందుర్తి జంక్షన్‌ వద్ద ఓ ఆటో డ్రైవర్‌కు బస్‌డ్రైవర్‌కు మధ్య ట్రాఫిక్‌ విషయమై వివాదం చోటు చేసుకుంది. ఆటోడ్రైవరు రెచ్చిపోయి ఆటోతో సరిపల్లి వైపు దూసుకెళ్లాడు. ఓ చోట ఆగి బస్‌డ్రైవర్‌పైకి పెద్ద రాయి రువ్వాడు. అది దూసుకొచ్చి బస్‌లో ఉన్న షేక్‌సురాజుద్దీన్‌ తలకి, కంటిభాగానికీ తగిలింది. తీవ్ర రక్తస్రావంతో కొట్టిమిట్టాడిన అతడ్ని డ్రైవర్, కండక్టరు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ప్రాణాపాయం లేదని చిన్నకేసుగా పోలీసులు భావించినా, తర్వాత దారుణం జరిగిందని తేలింది. ఏకంగా కన్నే పోయిందని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో సురాజుద్దీన్‌ భార్య, పిల్లలూ కన్నీరుమున్నీరయ్యారు.



    అగమ్యగోచరం ఆ కుటుంబం

    సిరాజుద్దీన్‌ది దీనావస్ధలో ఉన్న కుటుంబం. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు. ప్రైవేట్‌ కారు డ్రైవరుగా వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని లాక్కెళ్తున్నాడు. ఇంతలో ఇలా ఊహించని ప్రమాద రూపంలో కన్ను పోవడంతో ఇపుడు ఒక కన్నే మిగిలింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నాడు. ప్రయాణికుల భద్రత నేపథ్యంలో బస్‌ యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రాథేయపడుతున్నాడు.



    ఎవరా ఆటోడ్రైవర్‌?

    బస్‌డ్రైవర్‌ని లక్ష్యంగా చేసుకుని రాయి రువ్వి పరారైన ఆటో డ్రైవర్‌ ఎవరో పోలీసులకు తెలియలేదు. ఆటో డ్రైవరు ఎక్కడి స్టాండ్‌ వాడు..ఏ గ్రామానికి చెందిన వాడో తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. ఆటోడ్రైవర్‌ని బస్‌ డ్రైవరు గుర్తించే పరిస్థితి ఉన్న తరుణంలో ఆటో డ్రైవర్ల వివరాలు సేకరిస్తున్నారు. బస్‌డ్రైవర్, ఆటోడ్రైవర్‌ మధ్య చోటుచేసుకున్న వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top