బిందు సేద్యమే దిక్కు

బిందు సేద్యమే దిక్కు - Sakshi


సాక్షి, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి డ్రిప్ (బిందు), స్ప్రింక్లర్ (తుంపర) ఇరిగేషన్ తిరుగులేని మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. వర్షపు నీటి సంరక్షణ, నీటి సమర్థ వినియోగం, ఆరుతడి పంటలను ప్రోత్సహించడం.. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలన్నారు.  గతంలో ‘నీరు-మీరు’ కార్యక్రమం చేపట్టామని, ఇప్పుడు ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని కరువులేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

 

 సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. సాగునీటి రంగంపై శ్వేతపత్రాన్ని, ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. గత పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతలు, సరైన ప్రణాళిక అంటూ లేకుండా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిందని విమర్శించారు. పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను చేపట్టం వల్ల అన్నీ అసంపూర్ణంగా మిగిలిపోయాయని చెప్పారు. ప్రాజెక్టుల కంటే ముందే కాలువలు తవ్వారని, అనుమతులు పూర్తిగా రాకుండానే ప్రాజెక్టుల ను మొదలుపెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా విడిచిపెట్టిన ప్రాజెక్టుల్లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం మినహా మిగతా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. 17,500 కోట్లు అవసరమని అంచనా వేశామని చెప్పారు. తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులకు తాము తొలి ప్రాధాన్యత ఇస్తామని, ఇలా ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించుకొని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వివరించారు.

 

 చట్ట ప్రకారమే స్థానికతను నిర్ణరుుంచాలి

 

 స్థానికతను చట్ట ప్రకారమే నిర్ణయించాలని, తమ ఇష్టప్రకారం నిర్ధారిస్తామంటే కుదరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 5 సంవత్సరాలు అమెరికాలో నివాసం ఉంటే గ్రీన్‌కార్డు ఇవ్వాలనే చట్టం అక్కడ ఉందని, ఎక్కడైనా చట్టం అమలు కావాల్సిందేనని చెప్పారు. తెలంగాణలో కూడా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆరు సూత్రాల పథకం ప్రకారం.. ‘ఏడేళ్ల నిబంధన’ ఉందంటూ, కమలనాథన్ కమిటీ కూడా ఇదే విషయాన్ని మార్గదర్శకాల్లో పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 1956కు పూర్వం భద్రాచలం, నల్లగొండ జిల్లాలోని కొన్ని మండలాలు ఆంధ్రాలోనే ఉండేవని గుర్తు చేశారు. రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నామని, రీ షెడ్యూల్ కోసం ఆర్బీఐ అడిగిన అదనపు సమాచారం ఇస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

 మారిన బ్యాక్‌గ్రౌండ్

 సీఎం చంద్రబాబు విలేకరుల సమావేశాలు నిర్వహించే ఆయన నివాసంలోని హాలులో ఈసారి అధికారిక చిహ్నాలు దర్శనమిచ్చాయి. గతంలో ఎప్పుడు మాట్లాడినా.. బ్యాక్‌గ్రౌండ్‌గా టీడీపీ ఎన్నికల గుర్తు సైకిల్, పార్టీ చిహ్నమైన గుడిసె, నాగలి, చక్రంలతో కూడిన ఫ్లెక్సీ ఉండేది. సోమవారం వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రను ఏర్పాటు చేశారు. ఎప్పుడూ కూర్చొని మాట్లాడే చంద్రబాబు ఈసారి బహిరంగసభలో మాదిరిగా నిలబడి మాట్లాడారు.




 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top