ఈ నెలాఖరుకు తాగునీటి సమస్య పరిష్కారం

ఈ నెలాఖరుకు తాగునీటి సమస్య  పరిష్కారం - Sakshi


వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ప్రతి ఎకరాకు సాగునీరు

లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామస్తులకు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హామీ

ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని మండిపాటు




లింగాల : ఈ నెలాఖరుకంతా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం లింగాల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తాతిరెడ్డిపల్లె గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వెంటనే లింగాల ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని గ్రామస్తులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడపగడపకు వైఎస్‌ఆర్‌ కార్యక్రమంలో ప్రజలు తాగునీరు అందించాలని కోరారని గుర్తు చేశారు. అప్పటినుంచి ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1500  అడుగుల లోతు వరకు మూడు బోరుబావులను తవ్వించానని చెప్పారు. అలాగే పార్నపల్లె ఆఫ్‌ ల్యాండ్‌ స్కీం నుంచి ప్రత్యేక సంప్‌ ఏర్పాటు చేసి గ్రామ ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేశామన్నారు.



 అయినా ఆ గ్రామస్తుల దాహార్తి తీర్చలేక పోయామన్న బాధ తనలో మిగిలి పోయిందన్నారు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం కోసం తన సొంత నిధులతో పార్నపల్లె భారీ తాగునీటి పథకం ప్రధాన పైపులైన్‌ ద్వారా నేర్జాంపల్లె గ్రామ సమీపం నుంచి సుమారు 5కిలో మీటర్ల మేర పైపులైన్‌ ఏర్పాటుచేసి ఈ నెలాఖరు నాటికి గ్రామానికి తాగనీరు అందిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అంతవరకు ట్రాక్టర్‌ ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయిస్తామన్నారు. నేర్జాంపల్లె నుంచి పైపులైన్‌ ఎలా వేయాలనే అంశంపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు  వెంటనే సర్వే నిర్వహించాలని ఏఈ శివారెడ్డికి ఆయన ఆదేశాలు జారీ చేశారు.



ప్రజా సమస్యలను గాలికొదిలేశారు.

ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుతం సీబీఆర్‌లో నీరు అడుగంటిపోయిందని, దీంతో కడప, అనంతపురం జిల్లాలకు తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉందన్నారు. గ్రామాలలో కనీసం ప్రజలకు తాగునీటిని అందించే స్థితిలో కూడా ప్రభుత్వం లేదన్నారు. జలయజ్ఞం ద్వారా 90 శాతం పనులు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేపడితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 10 శాతం పనులను కూడా చేపట్టలేదన్నారు. ఈ కారణంగా గ్రామాలలో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తాయన్నారు. వైఎస్‌ఆర్‌ హయాంలో చేపట్టిన  గండికోట, పైడిపాలెం, చిత్రావతి ఎత్తిపోతల పథకాలకు ట్రయల్‌ రన్‌ నిర్వహించి బిల్లులు చేసుకున్నారని ధ్వజమెత్తారు.



వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు సాగునీరు  

2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రతి ఎకరాకు సాగునీరు అందించే పనులను పూర్తిచేసి ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తామన్నారు.



అధికారులపై మండిపడ్డ ఎంపీ

తాగునీరు అందించాలని లింగాల ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న తాతిరెడ్డిపల్లె గ్రామ ప్రజల పట్ల ఎంపీడీఓ దురుసుగా వ్యవహరించడంపై ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్దారు. సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వస్తే వారి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు వారిపై తిరగబడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలా ప్రవర్తిస్తే తానే ధర్నా నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పీవీ సుబ్బారెడ్డి, ఎంపీడీఓ ఆదినారాయణ, తహసీల్దార్‌ ఎస్‌ఎం ఖాసీం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శివారెడ్డి, ఏవో నాగభూషణరెడ్డి, మండల యూత్‌ కన్వీనర్‌ మనోహర రెడ్డి, లింగాల సింగిల్‌ విండో అధ్యక్షుడు మల్లికేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, తాతిరెడ్డి పల్లె గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top