బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వాల కుట్ర


  • మావోయిస్టులను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలి

  • గాలికొండ దళం నేతల పిలుపు

  • ఏవోబీలో ముగిసిన ఖైదీ హక్కుల వారోత్సవాలు

  • పాడేరు: విశాఖ ఏజెన్సీలోని ఖనిజ సంపదను లూటీ చేసేందుకు ప్రధానమత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ప్రయత్నిస్తున్నారని, వాటిని అడ్డుకునేందుకు గిరిజనులంతా సమాయత్తం కావాలని మావోయిస్టు పార్టీ గాలికొండ దళం నేతలు పిలుపునిచ్చారు. మావోయిస్టు నేత జర్సింగి మహంతి వర్థంతిని పురస్కరించుకొని ఏటా మాదిరి ఈనెల 11 నుంచి 19 వరకు మావోయిస్టు ఖైదీహక్కుల వారోత్సవాలను ఈ ఏడాదీ విశాఖ ఏజెన్సీ, ఏవోబీ ప్రాంతాల్లోనూ ఘనంగా నిర్వహించారు.



    దీనికి సంబంధించిన వివరాలు, ఫొటోలను పాడేరులోని పలు పత్రికా కార్యాలయాలకు దళసభ్యులు పంపారు. గాలికొండ దళం ఆధ్వర్యంలో జరిగిన వారోత్సవాలకు మారుమూల ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దళ సభ్యులు మాట్లాడుతూ గిరిజన హక్కు లు, చట్టాలను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు.



    కాంగ్రెస్, టీడీపీల వైఖరి ఒకటేనని, ఈ రెండు ప్రభుత్వాలదీ దోపి డీ విధానమేనని పేర్కొన్నారు. ఏజెన్సీలోని బాక్సైట్ ఖనిజ సంపదను దోచుకునేందుకే ఆపరేషన్ గ్రీన్ హంట్, ఔట్ పోస్టుల పేరిట పోలీసు నిర్బంధం పెరి గిందన్నారు. ఏపీఎఫ్‌డీసీ ఆధీనంలోని కాఫీ తోటలను గిరిజనులకే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాఫీ తోట ల్లో పనులన్నీ గిరిజనులు చేస్తుంటే లాభాలు మాత్రం ఏపీఎఫ్‌డీసీ పొందుతోందని ఆరోపించారు.



    ప్రజల హక్కుల కోసం ఉద్యమాలు చేసి అరెస్టయిన మావోయిస్టులు, సానుభూతిపరులంతా జైళ్లలో దుర్భరజీవనం సాగిస్తున్నారని వాపోయారు. వీరందర్ని రాజకీయ ఖైదీలుగా ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. మావోయిస్టు ఖైదీలు అనారోగ్యానికి గురైతే ఉన్నత వైద్యం, పూర్తిస్థాయిలో ఆహారం అందించకుండా ప్రభుత్వాలు హింసిస్తున్నాయని ఆరోపించారు. అక్రమ అరెస్ట్‌లు, బూటకపు ఎన్‌కౌంటర్లకు పోలీసులు పాల్పడితే తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top