నిష్కర్ష కవి.. అభ్యుదయవాది

నిష్కర్ష కవి.. అభ్యుదయవాది


పిఠాపురం రూరల్/పిఠాపురం టౌన్:మూర్తిభవించిన సాహిత్యం, నిత్య ఉత్సాహి, సాహిత్య కృషీవలుడు, తెలుగు భాషకు నిరంతరం సేవ చేస్తున్న నిత్యయవ్వనుడు డాక్టర్ ఆవంత్స సోమసుందర్ అని పలువురు ప్రముఖ కవులు కొనియాడారు. మంగళవారం పిఠాపురంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలోని చెలికాని భావనరావు సభాసదన్‌లో జరిగిన డాక్టర్ ఆవంత్స సోమసుందర్ 91వ జన్మదిన వేడుకలను సోమసుందర్ లిటరరీ ట్రస్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను సత్కరించడమే కాకుండా ట్రస్టు ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాలను అందజేశారు.

 

 కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రఖ్యాత కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి సోమసుందర్‌ను నిష్కర్ష కవిగా అభివర్ణించారు. నిర్భయత్వం, ధీరత్వం మూర్తీభవించిన విమర్శకుడు నిర్మోహమాటానికి అభ్యుదయ సాహిత్యానికి ఆయన నిదర్శనంగా నిలుస్తారన్నారు. ఆయన కంఠస్వరం ఆత్మీయుల్ని శాసిస్తునే ఉంటుందన్నారు. నేటి రాజకీయ నాయకుల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారని కవులను సాహితీ వేత్తలను గౌరవించడం లేదన్నారు. ప్రతీ రాజకీయవేత్త నాగరికత, చరిత్ర తెలుసుకోవాలన్నారు. అభ్యదయ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పి.చిరంజీవిని కుమారి మాట్లాడుతూ సాహిత్యరంగాన్ని పురస్కారాల ద్వారా కవులను, రచయితలను ప్రోత్సహిస్తున్న ఏకైక వ్యక్తి సోమసుందర్ అన్నారు. నేటికీ సోమసుందర్ నవయువకుడేనన్నారు. సోమసుందర్ జీవితాన్ని డాక్యుమెంటేషన్ చేయడాన్ని తన సంసిద్ధతవ్యక్తం చేశారు. ఈ సభకు ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ కె.వెంకట్రావు అధ్యక్షత వహించారు.

 

 ఆవిష్కరణలు

 డాక్టర్ సోమసుందర్ రచించిన మూడు గ్రంథాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. యుగపురుషుడు-ఆయన శిష్యుడు అనే గ్రంథాన్ని అన్నవరం సత్యదేవా ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకురాలు ద్వివేది కృష్ణగాయత్రి ఆవిష్కరించారు. రవీంద్రలోచనం గ్రంథాన్ని పీఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్(కాకినాడ) డాక్టర్ ఎంవీ భరతలక్ష్మి ఆవిష్కరించారు. కాలానికి కవిత్వం కాపలాదీపం అనే గ్రంథాన్ని కాకినాడ పీఆర్ కళాశాల అధ్యాపకురాలు వక్కలంక శారదఆవిష్కరించారు. వీటి గురించి సమీక్షించారు. సుప్రసిద్ధ చిత్రకారులు మోహన్ (హైదరాబాద్), ఆంధ్రాయూనివర్సిటీ డిపార్ట్‌మెంటు ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ శిష్టా శ్రీనివాసులను సత్కరించారు.

 

 పురస్కారాల ప్రదానోత్సవం

 ట్రస్టు ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.సీతారామస్వామి అధ్యక్షతన సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం సాయంత్రం జరిగింది. ముఖ్యఅతిథులుగా విశ్రాంత ఆచార్యులు చందు సుబ్బారావు(వైజాగ్), పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ ప్రొఫెసర్, ప్రఖ్యాత కవి డాక్టర్ శిఖామణి (హైదరాబాద్)లు హాజరై మాట్లాడారు. డాక్టర్ ఆవంత్స సోమసుందర్ సాహిత్య పురస్కారాన్ని టెన్ టీవీ ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ బీఆర్‌వీ ప్రసాదమూర్తికి, రాంషా స్మారక విమర్శక పురస్కారాన్ని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్(కొత్తపేట) డాక్టర్ రెంటా వెంకటేశ్వరరావుకు, రాజహంసా కృష్ణశాస్త్రి కవితా పురస్కారాన్ని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(బొమ్మూరు) ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్‌కు, గురజాడ కథా ప్రభాస పురస్కారాలను ఆల్ ఇండియా రేడియో విశ్రాంత న్యూస్‌రీడర్ శ్రీపతి, ప్రముఖ కవి వివినమూర్తి(శ్రీకాకుళం)లకు అందజేశారు. కార్యక్రమంలో ఆవంత్స శశికాంత్ శాతకర్ణి, విజయశేషేంద్ర శాతకర్ణి, మేకా మన్మధరావు, కొత్తెం సుబ్బారావు, డాక్టర్ డీవీఆర్ పూస, కొంపెల్ల కామేశ్వరరావు, కె.గౌరీనాయుడు, ఎన్.సూర్యనారాయణ, పలువురు అభ్యుదయ కవులు పాల్గొన్నారు. డాక్టర్ అనురాధ, జి.వి.కృష్ణదేవరాయులు గీతలాపనలు చేశారు.  కార్యక్రమంలో సోమసుందర్ జీవితం- సాహిత్యంపై ప్రదర్శించిన టి.వి.ఫిలిమ్‌ను వీక్షకులు తిలకించారు.

 

 పట్టుదలతో సాగితే విజయ తథ్యం : ఆవంత్స

 ‘‘పట్టుదల, కవిత్వం నన్ను ఇంకా జీవించేటట్టు చేస్తుంది. పట్టుదలతో ముందుకు సాగితే అన్ని విషయాల్లో విజయం తప్పదు’’ అని డాక్టర్ సోమసుందర్ వెల్లడించారు. పలువురు ప్రముఖులు ప్రసంగాలపై ఆయన ప్రతిస్పందించారు. ఆయన జీవితంలో ఎదురైన సంఘటనలు, పలువురితో తనకున్న అనుబంధాలను ఆయన గుర్తుచేసుకున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top