అపరిచితులా..డోంట్‌లైక్

అపరిచితులా..డోంట్‌లైక్ - Sakshi


చేతిలో సెల్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ సోషల్ నె ట్ వర్కుతో అనుబంధం తప్పనిసరి. సామాజిక మాధ్యమం ద్వారా రోజు ఏదో ఒకటి పోస్టు చేయడం, మిత్రుల పోస్ట్‌లకు కామెంట్లు రాయడం, లైక్, షేర్ చేయడం దినచర్యలో భాగమైంది. దీనివల్ల మనుషుల మధ్య దూరం చెరిగిపోయింది. అదేక్రమంలో అపరిచితులను లైక్ చేస్తే కొన్ని అనర్థాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందుకే అపరిచితులకు డోన్ట్‌లైక్ అని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

 

 శ్రీకాకుళం రూరల్ :  నేటి యువతరానికి ఫేస్‌బుక్ చూడకుండా నిద్ర కూడా పట్టడం లేదు. కాస్త సమయం దొరికితే చాలు ఫేస్‌బుక్‌లో మునిగి తేలుతున్నారు. ఇది కొంత ఇబ్బందికరంగా కూడా మారుతోందని మానసిక వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. యువత మధ్య ఫేస్‌బుక్ ప్రేమలు పెరగడం, కొన్ని సందర్భాల్లో అవి వికటించి ప్రాణాలు కోల్పోవలసి రావడం గమనార్హం.

 

 ఎన్నో ప్రయోజనాలు..

 ఫేస్‌బుక్ వలన ప్రయోజనాలు ఉన్నాయి. బతుకు తెరువుకు ప్రపంచంలో తలో దిక్కు వెళ్లిన స్నేహితులను ఫేస్‌బుక్ కలుపుతుంది. బాల్య స్నేహితులు ఎవరి పని వారు చేసుకుంటూ వాటి స్మృతులను తలచుకుంటున్నారు. గుడ్‌మార్నింగ్ అంటూ పలకరించే పోస్టులు.. మంచిగా బతకటానికి కావల్సిన సందేశాలు.. మహనీయుల సూక్తులు అంతా మంచి జరగాలని కోరుకునే స్నేహితులు. అలా అదో పెద్ద ప్రపంచం. గత ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలు దేశ ప్రదాని అభ్యర్థుల వరకు ఫేస్‌బుక్‌లో తమ ప్రచారాన్ని కొనసాగించారు. మార్కెట్‌లో వచ్చే వివిధ బ్రాండ్ల అమ్మకాలకు సైతం నేడు ఫేస్‌బుక్ వేదికగా మారింది. దీని ప్రాముఖ్యత గుర్తించే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఫేస్‌బుక్ ద్వారా సందేశాలను చేరవేస్తూన్నాయి. నగరంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, కళాశాలలు, వివిధ రంగాల వారికీ ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రత్యేక హోదా కోసం ఫేస్‌బుక్ ద్వారా సలహాలు, సూచలను ఇవ్వాలని, పరోక్షంగా నైనా సరే సోషల్ మీడియా ద్వారా ఉద్యమించాలని కోరుతూ చాలామంది నాయకులు, యువత, మేధావులు అందరికీ మేసేజ్‌లు అందుతున్నాయి.

 

 నాణేనికి మరోవైపు

 ప్రత్యేక హోదా.. సమైక్యాంధ్ర ఉద్యమం, సార్వత్రిక ఎన్నికలు సమయంలో ఫేస్‌బుక్‌లో చెలరేగిన వివాదాలు అంతా ఇంతా కాదు. ప్రాంతాల వారీగా మారి ఫేస్‌బుక్‌లో తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు పరిచయాలు అవుతుంటాయి. యువతులు పేరుతో కొందరు ఫేస్‌బుక్ అకౌంట్లు తెరచి మోసం చేసిన ఘటనలు పలు చోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భాల్లో యువతులు కొందు తమ పరువ పోతుందని తేలుకుట్టిన దొంగల్లా పోలీసుల దృష్టికి తేవటం లేదు. ఫేస్‌బుక్‌లో పెట్టిన కామెంట్లును నమ్మి మోసపోయిన వారు కూడా ఉన్నారు. అపరిచితులతో స్నేహం చేసే ముందు జాగ్రత్తగా వ్యవహారించాలని పోలీసులు సూచిస్తున్నారు.

 

 జాగ్రత్తలు పాటించాలి..

  అపరిచిత వ్యక్తుల స్నేహ అభ్యర్థనలకు స్పందించకుండా ఉండడం ముఖ్యం. యువతుల పేరుతో చేసే చాటింగ్‌కు దూరంగా ఉండాలి.

  సాధ్యమైనంత వరకూ ఫోన్ నెంబర్‌ను ఇతరులకు ఇవ్వకపోవడం మంచిది. యువత వినియోగిస్తున్న సోషల్‌నెట్‌వర్కుపై తల్లిదండ్రులు ఓ కన్నెసి ఉంచాలి.  ఫేస్‌బుక్‌లో జరిగే చర్చల్లో నచ్చని అభిప్రాయాన్ని ఎవరైనా వ్యక్తం చేసినా సున్నితంగా వ్యవహరించడం మంచిది.

   వ్యవహారం శ్రుతి మించినట్లయితే ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తొలగించడం మంచిది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top