అధికార పార్టీలో ఆధిపత్య పోరు..

అధికార పార్టీలో ఆధిపత్య పోరు.. - Sakshi


 ►  ఎడతెగని వర్గపోరు

  ► ఆత్మకూరులో కన్నబాబు వర్సెస్‌ ఆనం

  ► గూడూరులో సునిల్‌ వర్సెస్‌ జ్యోత్స్నలత

  ► నెల్లూరులోనూ ఎవరికి వారే




సాక్షి, నెల్లూరు : అధికార తెలుగుదేశం పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆధిపత్య పోరు తాజా పరిణామాలతో భగ్గుమంటోంది. ఆత్మకూరులో జన్మభూమి కమిటీల మార్పుతో మొదలైన చిచ్చు జిల్లా అంతటా రాజుకుంటోంది. నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు నేతలు హడావుడి చేస్తుండటం.. ఎవరికి వారే తమకు అనుకూలంగా పావులు కదుపుతుండటంతో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఓ వైపు జన్మభూమి కమిటీల వివాదం, మరోవైపు పార్టీలో ద్వితీయ శ్రేణి నేతల పనులు చేయించలేకపోవడం, ప్రతిచోటా బహునాయకత్వం ఉండటం వంటి పరిస్థితులు ఆ పార్టీని ఇరుకున పెడుతున్నాయి.



సమస్యల ‘ఆన'ం

తాజాగా ఆత్మకూరు నియోజకవర్గంలో జన్మభూమి కమిటీల మార్పు చిచ్చు రేపింది. గూటూరు కన్నబాబు ఆత్మకూరులో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఏడాది క్రితం కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఇరువురు మధ్య వివాదాలకు తెరలేచింది. తాజాగా నియోజకవర్గంలో కన్నబాబు వర్గానికి చెందిన 72 మంది జన్మభూమి కమిటీ సభ్యులను తొలగించిన రామనారాయణరెడ్డి వారి స్థానంలో తన అనుచర గణాన్ని నియమించుకున్నారు.



ఆత్మకూరు వ్యవహారంపై నెలన్నరగా పార్టీలో రగడ కొనసాగుతూనే ఉంది. రెండు వారాల క్రితం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో తన సంగతి తేల్చాల్సిందిగా కన్నబాబు జిల్లా ఇన్చార్జి మంత్రి అమరనాథ్‌రెడ్డిని గట్టిగా నిలదీశారు. నియోజకవర్గంలో ఆనంతో ఇబ్బందిగా ఉందని, తనకు ఏ విషయం స్పష్టంగా తెలపాలని కోరారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పిన మంత్రి విషయాన్ని దాటవేశారు.



అంతకు ముందు జిల్లాకు చెందిన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పి.నారాయణ సైతం ఇదేవిధంగా వ్యవహరించారు. ఈ క్రమంలో జన్మభూమి కమిటీ సభ్యుల తొలగింపుతో కన్నబాబు స్థాయి పార్టీలో తేలిపోయినట్టయ్యింది. ఇదే పరిస్థితి గూడూరు, నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లోనూ నెలకొంది. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో గత ఎన్నికలలో పోటీ చేసిన జ్యోత్స్నలతకు వైఎస్సార్‌ సీపీ నుంచి అధికార పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యే పాశం సునిల్‌కుమార్‌కు మధ్య తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి.



సునిల్‌కుమార్‌ చేరికను జ్యోత్స్నతోపాటు మాజీమంత్రి బల్లి దుర్గాప్రసాద్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. సునిల్‌కుమార్‌ చేరికతో పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గిపోయిందనే ఆవేదన వారిద్దరిలోనూ ఉంది. అధికారిక కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు జ్యోత్స్నలతను, దుర్గాప్రసాద్‌ను ఎమ్మెల్యే ఆహ్వానించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారిద్దరూ ఈ విషయాన్ని పార్టీ ముఖ్యుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. పనులు, పర్సంటేజీలు మొదలుకొని అన్ని విషయాల్లోనూ వీరిమధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్గపోరు తారస్థాయికి చేరిన తరుణంలోనూ జిల్లాకు చెందిన మంత్రులు చూసీచూడనట్టు వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతన్నారు.



నెల్లూరులోనూ ఎవరికి వారే

నెల్లూరు నగరం, రూరల్‌ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. నగర పార్టీ ఇన్చార్జిగా ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నెల్లూరు రూరల్‌ ఇన్చార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. నగరంలో పట్టుకోసం, తమ వారి ప్రాధాన్యత కోసం నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నిరంతరం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారే వ్యక్తిగతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మాజీమంత్రి తాళ్లపాక రమేష్‌ దంపతులు పార్టీ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి పార్టీకి తలనొప్పిగా మారింది.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top