చక్కెర లేదు.. పామాయిల్ రాదు

చక్కెర లేదు.. పామాయిల్ రాదు


సాక్షి, ఏలూరు : ఆర్థిక శాఖ అనుమతి రాకపోవడంతో రేషన్ కార్డులపై ఈ నెల కూడా పామాయిల్ ఇవ్వడం లేదు. రంజాన్ పండగకు చక్కెర అదనపు కోటాను నిలిపివేశారు. దీంతో సబ్సిడీ ధరకు లభించే పామాయిల్ లీటర్ ప్యాకెట్‌ను రూ.25 అదనంగా చెల్లించి బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల జిల్లాలోని 11.22 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులు ప్రతి నెలా రూ.2.80 కోట్ల మేర ఆర్థికంగా నష్టపోతున్నారు. సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేసే విషయమై ఆర్థిక శాఖ నుంచి ఇప్పటివరకూ అనుమతి రాకపోవడంతో అదనపు కోటా ఇవ్వలేకపోతున్నామని పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి డి.శివశంకరరెడ్డి అంటున్నారు.



 ఏప్రిల్ నుంచి ఇంతే

 జిల్లాకు 11.38 లక్షల లీటర్ల పామాయిల్ అవసరం కాగా,  డీలర్లు ప్రతినెలా డీడీలు తీసేవారు. గత డిసెంబర్‌లో డీడీలు తీసినాప్రభుత్వం పామాయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన సబ్సిడీ ఇవ్వకపోవడంతో వారు సరఫరా నిలిపివేశారు. సరుకు రాకపోవడంతో డీలర్లు వడ్డీ నష్టపోయారు. దీంతో డీడీలు తీసే విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనూ విడుదల కాని పామాయిల్ తర్వాత రెండు నెలలు వచ్చింది. ఏప్రిల్ నుంచి నిలిచిపోరుుంది. సబ్సిడీపై రూ.40కి లభించే పామాయిల్ లీటరు ప్యాకెట్‌ను  రూ.65కు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు కోట్లాది రూపాయాలు ఖర్చు చేయాల్సి వస్తోంది.

 

అదనపు కోటా అత్యాశేనా

 రెండేళ్ల క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండగకు రేషన్ కోటాలో కొన్ని సరుకులు అధికంగా ఇచ్చేది. నెలకు 560 టన్నుల పంచదారనే కేటారుుంచడం ద్వారా ఒక్కో కార్డుపై అరకేజీ చొప్పున ఇస్తున్నారు. అయితే పండగకు మరో అరకేజీ కలిపి కేజీ ఇచ్చేవారు. అదే విధంగా పామాయిల్ లీటర్ ప్యాకెట్ ఇవ్వాల్సి ఉండగా, మరో ప్యాకెట్ అదనంగా ఇచ్చేవారు. గతేడాది ఈ ఆనవాయితీని తప్పించారు. పండగ వేళల్లో నిత్యావసర సరుకుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. పేద ప్రజలు ఆ ఖర్చును భరించలేరు.



కొన్నేళ్లుగా వరుస విపత్తులతో రైతులు నష్టాల పాలవుతున్నారు. సామాన్యులు అధిక ధరలతో కుదేలయ్యారు. పనులు లేక కూలీల చేతుల్లోనూ సొమ్ములు లేవు. దీంతో ఉన్న కొద్దిపాటి డబ్బును ఆచితూచి ఖర్చుచేసుకోవాలి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి రాయితీ ధరలకు నిత్యావసర సరుకులు అందితే ప్రజలు సంతోషంగా పండగ జరుపుకుంటారు. కానీ  ఈసారి కూడా అదనపు కోటా ఇవ్వడం లేదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలోనూ అదనపు కోటా ఊసెత్తలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top