పుచ్చిన పప్పులు.. కుళ్లిన ఉల్లి

పుచ్చిన పప్పులు..  కుళ్లిన ఉల్లి


తినలేకపోతున్న విద్యార్థులు

ఆశ్రమాలకు నాసిరకం సరకులు

సరఫరాదారులతో అధికారుల కుమ్మక్కు


 

చింతపల్లి: గిరిజన సంక్షేమ ఆశ్రమ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందని ద్రాక్ష అవుతోంది. వసతి గృహాల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. పౌష్టికాహారం మాట దేముడెరుగు పాడైపోయి విషపూరితమైన ఆహారాన్ని విద్యార్థులు ఆరగించాల్సి వస్తోంది. ఏజెన్సీలో మొత్తం 118 గిరిజన సంక్షేమశాఖ వసతిగృహాలు ఉన్నాయి. దాదాపు 30 వేల మంది విద్యార్థులు వీటిల్లో చదువుతున్నారు. హాస్టళ్లకు పప్పులు, నూనె, నూక తదితర సరుకులు సరఫరాకు ఏటా జూన్‌లో టెండర్లు నిర్వహిస్తుంటారు. తక్కువ ధరలకు కోడ్ చేసిన కాంట్రాక్టర్లకు సరఫరా బాధ్యత అప్పగిస్తుంటారు. టెండర్లప్పుడు అన్ని రకాల పప్పులు, నూక నంబర్ వన్ క్వాలిటీవి తీసుకొచ్చి ప్రదర్శిస్తారు. ఉదాహరణకు బహిరంగ మా ర్కెట్‌లో కిలో కంది పప్పు రూ.120లు ఉంటే టెండర్‌లో తక్కువ ధరకు సరఫరా చేస్తామని కాంట్రాక్టర్లు కోడ్ చేస్తారు. ఈ ఏడాది పప్పుల  సరఫరాను రాజమండ్రికి చెందిన సాయి గణేష్ ట్రేడర్సు దక్కించుకుంది. కిలో కందిపప్పును రూ.98.80, పెసరపప్పు రూ.94, శనగపప్పు రూ.63, ఇతర దినుసులు అమలాపురానికి చెందిన కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. గోధుమ నూక రూ.24లు, కరాచీ నూక రూ.23.15లు సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవానికి బయట మార్కెట్లలో నంబర్ వన్ పప్పుల ధరలు వీరు కోడ్ చేసిన ధరకంటే ఎక్కువగా ఉంటున్నాయి.



దీంతో కాంట్రాక్టర్లు ఆయా ప్రాంతాల్లోని మిల్లుల్లోని నాసిరకం పప్పులు, పుచ్చిపోయిన వాటిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ద్వారా ఆశ్రమాలకు తరలిస్తున్నారు. ఇటీవల ఐటీడీఏ పీవో హాస్టళ్లను తనిఖీ చేసినప్పుడు సమస్యను ఆయన దృష్టికి తీసుకు రాగా ఈ విషయం తన వద్దకు వచ్చిందన్నారు.  ఈ వ్యవస్థను ప్రక్షాళనం చేయాల్సిన ఉందని పీవో సాక్షికి వివరించారు.

 సరఫరా దినుసుల్లో కల్తీ: గోధుమ నూకలో బియ్యం మిల్లు ఆడగా వచ్చే ఊరచిట్టును సగానికి పైగా కల్తీ చేసి పంపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కందిపప్పుకు బదులుగా చైనా ఉసిరిపప్పును కూడా కొన్నిసార్లు సరఫరా చేస్తున్నారన్న వాదన ఉంది. ఇవి రోజంతా పొయ్యిపై పెట్టినా ఉడకడం లేదని వసతిగృహాల వార్డెన్లు వాపోతున్నారు. ఏ పప్పు చూసినా పుచ్చిపోయే ఉంటోంది. దానిని విద్యార్థులు అయిష్టంగానే తింటున్నారు. అల్పాహారంగా పెట్టే గోధుమ, తెల్లనూకలో పురుగులు ఉంటున్నాయి. వీటిపై వార్డెన్లు అభ్యం తరం పెడుతున్నా.. జీసీసీ సిబ్బంది బలవంతంగా అంటగడుతున్నారు. జీసీసీ సరఫరా చేసే ఉల్లిపాయలైతే కంట తడి పెట్టిస్తున్నాయి. 50 కిలోల్లో 30 కిలోల వరకు కుళ్లిపోయి ఉంటున్నాయని వార్డెన్లు వాపోతున్నారు.

 

 నాణ్యత ఉండేలా చర్యలు

 ఆశ్రమాలకు సరఫరా చేసే నిత్యావసర సరుకుల్లో నాణ్యత ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. పప్పులు, అల్పాహార తయారీకి ఉపయోగించే నూక, ఉల్లిపాయలు వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఆయా మండలాల ఏటీడబ్ల్యూవోలు సరుకులపై పర్యవేక్షణ జరుపుతున్నారు. సరుకుల్లో నాణ్యత లేకపోతే సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం.

 -ఎం.కమల, డీడీ, గిరిజన సంక్షేమశాఖ, పాడేరు.

 

 బాగోలేకుంటే వెనక్కి ఇచ్చేయాలి...


 గిరిజన సంక్షేమ ఆశ్రమాలకు పంపిణీ చేసే నిత్యావసర సరుకుల్లో నాణ్యతగా లేకపోతే వసతిగృహాల వార్డెన్లు సరుకులు తీసుకోకుండా వెనక్కు పంపేయాలి. సరుకులు నాణ్యతగా ఉంటేనే వార్డెన్లు తీసుకోవాలి. నాసిరకం సరుకులు సరఫరా చేస్తే మా దృష్టికి తీసుకురావాలి.      - కైలాసగిరి, జీసీసీ డీఎం, పాడేరు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top