మొక్క లేని వనాలు!


జిల్లాలో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన నగరవనం, వనమహోత్సవ కార్యక్రమాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుండిపోయాయి. ఏడాదికి 50 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రాన్ని ఉద్యానవనంలా మారుస్తామన్న సీఎం మాటలు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వం నిధులివ్వకపోవడంతోనే నగరవనం, వనమహోత్సవ కార్యక్రమాలు ముందుకు సాగలేదని అధికారులు తేల్చి చెబుతున్నారు.     

 

చిత్తూరు : చిత్తూరు  ఎర్రచందనం ఫారెస్ట్‌తో పాటు  తిరుపతి అటవీ పరిధిలో నగరవనం కార్యక్రమం ద్వారా 300 ఎకరాల చొప్పున విస్తీర్ణంలో పెద్ద ఎత్తున మొక్క లు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు మొత్తం రూ: 4 కోట్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొక్కల పెంపకంతో పాటు  పార్కులు సైతం అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. జూలై 17న  జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తోపాటు జిల్లా కలెక్టర్, అటవీ అధికారులు చిత్తూరులో శిలాఫలకాన్ని సైతం ఆవిష్కరించారు. మొక్కలు నాటేందుకు  అటవీ ప్రాంతంలో  పెద్ద ఎత్తున  భూమిని చదును చేశారు. కానీ 50 మొక్కలు మాత్రమే నాటి చేతులు దులిపేసున్నారు. అంతటితో నగరవనం ఆగిపోయిం ది. 300 ఎకరాల్లో వేలాది మొక్కలు పెంచాలన్న లక్ష్యం అటకెక్కింది. ప్రభుత్వం  రూ.4 కోట్లు నిధులు విడుదల చేయకపోవడంవల్లే నగరవనం కార్యక్రమం ఆగిందని, నిధులొస్తే మొదలుపెడతామని సంబంధిత అటవీశాఖాధికారి చెబుతున్నారు.



 ముందుకు సాగని వనమహోత్సవం

 మరో వైపు  ప్రభుత్వం గత నెలలో ఆర్భాటంగా ప్రారంభించిన వనమహోత్సవ కార్యక్రమం సైతం  ముందుకు సాగడంలేదు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు,వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలతో పాటు గ్రామగ్రామాన ఈ సీజన్‌లో 3 లక్షలకు పైగా మొక్కలు నాటాలన్నది  లక్ష్యం. అయితే ఇప్పటివరకూ 27 వేల మొక్కలు మాత్రమే నాటినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి మాత్రం ఏడాదికి 50 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రాన్ని ఉద్యానవనంలా మారుస్తామని పదేపదే చెబుతున్నారు. విద్యార్థులు మొదలుకుని ప్రతి ఒక్కరితో మొక్కలు నాటించడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను సైతం వారికే అప్పజెప్పనున్నట్లు కూడా ప్రకటించారు. ప్రభుత్వం నిధులివ్వలేదనే విమర్శలు వస్తుండగా, మరోవైపు  జిల్లాలో వర్షాలు సక్రమంగా కురవకపోవడంవల్లే ఈ సీజన్‌లో 3 లక్షల మొక్కలు నాటలేకపోయామని, 27 వేల మొక్కలు మాత్రమే నాటగలిగామని  అటవీ అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల పరిధిలో 5 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు. ప్రజలు ముందుకు వస్తే మొక్కలు సరఫరా చేస్తామని వారు పేర్కొంటున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో మొక్కలు తరలించే కార్యక్రమంపై స్పష్టత కొరవడింది. మొక్కల రవాణా ఖర్చులు ఎవరు భరించాలనే ప్రశ్న ఎదురవుతోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top