పండుటాకులను ఏడిపింఛన్


అనంతపురం టవర్ క్లాక్ : జిల్లాలో తపాలా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఫించన్ల పంపిణీ అస్థవ్యస్తంగా మారింది. అధికారుల మధ్య నమన్వయ లోపం కారణంగా ఫించన్ల పంపిణీ ముందుకు సాగలేదు. బయోమెట్రిక్ మిషన్లు మొరాయిస్తుండడంతో తపాలా సిబ్బంది తలపట్టుకుంటున్నారు. సాంకేతిక లోపాల గురించి ఏపి ఆన్‌లైన్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో వేలి ముద్రల సమస్య పీడిస్తోంది. జిల్లాలో సాంకేతిక సమస్యలు పరిష్కరించడానికి రూ.9 లక్షలు అవసరమవుతుందని ఏపి ఆన్‌లైన్ అధికారులు నివేదించినట్లు సమాచారం. దీంతో పంపిణీ వ్యవహారం రోజుల తరబడి సాగుతోంది. ఫలితంగా వృద్ధులు, వికలాంగులు పింఛన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

 

  రోజూ పోస్టు మాస్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

 జిల్లాలో మండల, మున్సిపాలిటీల్లోని 834 బ్రాంచ్ పోస్టు మాస్టర్ల ఆధ్వర్యంలో 3,66,421 మందికి రూ.76 కోట్ల ఫించన్ పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటికి 1,76,311 మందికి  రూ.36,36,98,000 పంపిణీ చేశారు. 16421 మంది లబ్ధిదారులకు ఖాతాలు ప్రారంభించలేదు. 6 వేల మందికి ఏపి ఆన్‌లైన్ వారు పాస్ పుస్తకాలు అందించలేదు. ఏపి ఆన్‌లైన్ వారు తపాలా శాఖ అధికారులకు ఆన్‌లైన్‌లో పాసు పుస్తకాల ప్రింట్‌ను పంపిస్తే.. వారు ప్రింట్ తీసి పింఛన్‌దారులకు అందజేయాల్సి ఉంది. జిల్లా వాప్తంగా 1057 బయోమెట్రిక్ మిషన్లు అవసరముండగా 31 మిషన్లు సరఫరా కాలేదు. జిల్లాలో 26 మేజర్ పంచాయతీల్లో మిషన్ల కొరత ఉండడంతో లబ్ధిదారులకు పింఛన్ అందలేదు. ఉదాహరణకు ఉరవకొండ మేజర్ పంచాయితీలో 2,684 మందికి పింఛన్ పంపిణీ చేయాల్సి ఉండగా ఒకే బయోమెట్రిక్ మిషన్‌ను ఇచ్చారు. ఇలాంటి కారణాల వల్ల మున్సిపాలిటీ కేంద్రాల్లో కూడా రోజుకు 3-4 వందలకు మించి పింఛన్లు పంపిణీ చేయడం లేదు. వాస్తవానికి 700 వందల మందికి ఒక బయోమెట్రిక్ మిషన్ చొప్పున కేటారుుంచాల్సి ఉండగా.. అదీ జరగలేదు.

 

 అంతా గందరగోళం

 గుత్తి, కళ్యాణదుర్గం, కొత్తచెరువు, రాయదుర్గం, గుమ్మగట్ట మండలాల్లో పంపిణీ గందరగోళంగా మారింది. పలు ప్రాంతాల్లో సోమవారం లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో పోస్టు మాస్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వచ్చారుు. మిషన్లు పని చేయలేదన్న కారణం చూపుతూ పింఛన్లు పంపిణీ చేయకుండా రోజుల తరబడి తిప్పుకుంటున్నారని వృద్ధులు వాపోతున్నారు. ఏడు మున్సిపాలిటీల్లో ఈ నెల 13 నుంచి  ఫించన్ల పంపిణీ ప్రారంభమైనా ఇంకా పూర్తి కాలేదు.

 

 దీంతో ఏ రోజు డబ్బు చేతికందుతుందో తెలియక వృద్ధులు, వికలాంగులు పలు ఇక్కట్లు పడుతున్నారు. లబ్ధిదారుడికి ఫించన్ అందించేందుకు అతని వేలిముద్ర  సేకరించడంతో పాటు ఆధార్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉండటంతో తపాలా ఉద్యోగులకు ఎక్కువ సమయం పడుతోంది. దీంతో రోజుకు 70 మందికి కూడా ఫించన్ అందడం లేదు. మిషన్ల వినియోగంపై తపాలా ఉద్యోగులకు ఒక్క రోజు శిక్షణ ఇచ్చినా సరైన అవగాహన కలుగని ఫలితంగా పంపిణీ రసాభాసగా మారింది. సమస్యలపై ఏపీ ఆన్‌లైన్ కోఆర్డినేటర్లకు పోస్టు మాస్టర్లు ఫిర్యాదు చేసినా వారు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

 

 అందని ఎన్‌రోల్‌మెంట్ కిట్లు

 వృద్ధాప్యం కారణంగా రక్త ప్రసరణ సక్రమంగా జరగకపోవడంతో వృద్ధుల వేలి ముద్రలు బయోమెట్రిక్ మిషన్లలో నమోదు కావడం లేదు. దీంతో 72 వేల మందికి ఫించన్ అందలేదని అధికారిక సమాచారం. వేలి ముద్రల సమస్యకు చెక్ పెట్టాలంటే ఏపీ ఆన్‌లైన్ వారు ఎన్‌రోల్‌మెంట్ కిట్లు అంద జేసి వీఆర్‌ఓ, పోస్టుమాస్టర్ల వేలిముద్రలను నమోదు చేసి అక్కడికక్కడే వృద్ధులకు నగదు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టవచ్చు. అయితే ఏపీ ఆన్ లైన్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా తమపై నిందలు వేస్తున్నారని తపాలా ఉద్యోగులు వాపోతున్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి ఏపీ ఆన్‌లైన్ కోఆర్డినేటర్లను మండలానికి ఒకరిని నియమించినా వారు అందుబాటులో ఉండడంలేదనే ఆరోపణలు ఉన్నారుు.  చాలా ప్రాంతాల్లో మిషన్లు మొరాయించడం, సర్వర్ డౌన్ అవుతుండడంతో చక్కదిద్దడానికి సాధ్యపడడం లేదని ఏపీ ఆన్‌లైన్ సిబ్బంది చెప్పుకొస్తున్నారు.

 

 పింఛను రాలేదనే మనస్తాపంతో వృద్ధురాలి మృతి

 రాయదుర్గం టౌన్ : మూడు నెలలుగా పింఛన్ ఆగిపోవడంతో బెంగ పెట్టుకుని రాయదుర్గం పట్టణంలోని 2వ వార్డుకు చెందిన శాకే గంగమ్మ (92) గురువారం మృతి చెందింది. లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్నప్పటికీ వేలి ముద్రలు సరిపోలేదన్న కారణంతో ఈమెకు పింఛన్‌ను నిలిపేశారు. ఈమెకు ఎవరూ దిక్కు లేకపోవడంతో మనమరాలు లక్ష్మీ ఇంట్లో ఉండేది. పింఛన్ పంపిణీ చేస్తున్నారని తెలిసి బుధవారం ఈమె మనమరాలి సహాయంతో వెళ్లి మూడు గంటలు వేచి చూసింది. తీరా ఈమె వంతు వచ్చే సరికి బయోమెట్రిక్ పరికరంలో వేలి ముద్రలు సరిపోలేదని తపాలా శాఖ అధికారులు పింఛన్ ఇవ్వలేదు. అప్పటి నుంచి తీవ్రంగా మదన పడుతూ గురువారం మృతి చెందింది.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top