దగాపడ్డ అన్నదాత


జిల్లాలో రుణమాఫీ మాయ

8,70,321 మందికి గాను 3,57,457 మందికే వర్తింపు

రెండో విడతలో 50,913 మందికే


 

చిత్తూరు: రుణమాఫీ పేరుతో సొంత జిల్లాలోని రైతులను సీఎం చంద్రబాబునాయుడు వంచించారు. 90 శాతం మందికి మాఫీ వర్తింపచేశామని గొప్పలు చెబుతున్న సీఎం 40 శాతం మంది రైతులకు కూడా వర్తింపచేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత డిసెంబర్ 31నాటికి జిల్లాలో 8,70,321 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రూ.11,180.25కోట్ల వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం కేవలం 3,57,457 మంది మాత్రమే రుణమాఫీకి అర్హులని తేల్చింది. మొదటి విడతలో 3,06,544 మంది, రెండో విడతలో 50,913 మంది అర్హులంటూ జాబితాను విడుదల చేసింది. రెండో విడతలో 1,42,229 మందికి రుణమాఫీ ఉంటుందని ప్రభుత్వం తొలుత ప్రకటించినా కేవలం 50,913 మందికి మాత్రమే వర్తింపచేసింది.



జిల్లాలో 11,180.25 కోట్ల రుణా లు తీసుకోగా ప్రభుత్వం కేవలం 1,383.73 కోట్లు మాత్రమే మాఫీ చేస్తున్నట్లు లెక్కలు తేల్చింది. ఇందులో ఇప్పటివరకు కేవలం 456.44 కోట్లు మాత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన మొత్తం ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదు. రుణాలు పొందిన వారిలో 40 శాతం మందికి కూడా రుణమాఫీ వర్తించలేదు. తొలుత ఒక్కొక్క కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఆ తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ రైతన్నలను చావుదెబ్బకొట్టారు. తొలుత 5.63 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆధార్ కార్డులు, రేషన్‌కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లు, భూమి రికార్డులను అనుసంధానం చేసి ఆ మేరకు రైతులందరూ మాఫీకి అర్హులుగా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. చివరకు కేవలం 3,57,457 మందికి మాత్రమే రుణమాఫీ వర్తింపజేసింది. ఇదిలావుండగా రుణమాఫీలో నెలకొన్న జాప్యం కారణంగా జిల్లా రైతులపై రూ.9.39 కోట్ల మేర అపరాధ వడ్డీభారం పడినట్లు బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి.



బంగారు నగల వేలం



జిల్లాలో 4,53,162 మంది రైతులు బంగారు ఆభరణాలను వివిధ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. రుణాలను మాఫీ చేసి బంగారం తిరిగి ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కారు. తర్వాత రూ.50 వేల లోపు బంగారు రుణం మాఫీ చేస్తానని చెప్పినా అది కూడా అమలుకు నోచుకోలేదు.  ఇప్పటికే పలు బ్యాంకులు రైతులకు నోటీసులిచ్చాయి. గడువులోపు రుణాలు చెల్లించకపోతే బంగారు వేలం వేస్తామని పత్రికా పక్రటనలు కూడా ఇచ్చాయి. కరువు పుణ్యమా అని అన్నదాతలు రుణాలు చెల్లించి బంగారం విడిపించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ తీరుపై వారు మండిపడుతున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top