జిల్లా వాటాకు కర్ణాటక గండి!


సాక్షి ప్రతినిధి, కర్నూలు/ఆలూరు రూరల్/ హాలహర్వి: జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజల ప్రధాన సాగు, తాగునీటి వనరు అయిన తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు కర్ణాటకలోని మోకా సమీపంలో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పడిన చిన్న గండి అనుమానాలకు తావిస్తోంది. ఈ గండి ద్వారా సుమారు 600 క్యూసెక్కుల నీరు వృథాగా పోయింది. నీటి ఉధృతిని తట్టుకోలేక సహజంగా ఈ గండి పడిందా.. లేదా కర్ణాటక రైతులే గండి కొట్టారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఎల్లెల్సీ నీటి కోసం కర్ణాటక, కర్నూలు జిల్లా రైతుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి.

 

 తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలవుతున్న ఆంధ్ర వాటా నీటిపై కన్నేసిన కర్ణాటక రైతులు ఏటా జల చౌర్యానికి పాల్పడుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వల్ల కాలువ కింద కర్ణాటక పరిధిలో నాన్ ఆయకట్టు ప్రతి యేటా పెరుగుతోంది. ఎల్లెల్సీ పొడవు 324 కి.మీ. 0 నుంచి 130 కి.మీ వరకు కర్ణాటక రాష్ట్రంలోనూ, 131 నుంచి 324 కి.మీ. వరకు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనూ ఉంది. కర్ణాటక పరిధిలో  కాలువకు ఎప్పుడు, ఎక్కడా గండ్లు పడవు. పూర్తిగా ఆంధ్ర పరిధిలో ఉన్న కాలువకు కూడా గండ్లు పడిన దాఖలాలు లేవు. కేవలం కర్ణాటక రైతుల భూములు ఉన్న మోకా వద్ద మాత్రమే ప్రతి ఏటా గండ్లు పడుతున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

 

 నాన్ ఆయకట్టు కోసమే గండ్లు

 కర్ణాటక పరిధిలో సుమారు 60 వేల ఎకరాలు నాన్ ఆయకట్టు సాగవుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే ప్రతి యేటా జలచౌర్యానికి పాల్పడుతున్నట్లు సమాచారం. గత వారం తుంగభద్ర డ్యామ్ నుంచి 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీరు సోమవారం ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన మోకా వద్దకు చేరాయి. ఈ నీటికి గండి కొట్టేందుకు కర్ణాటక రైతులు ముందే ఏర్పాట్లు చేసుకుని ఉన్నట్లు తెలుస్తోంది. నాన్ ఆయకట్టులో వరి నారుమళ్లు ఉన్నాయి. వరి నాట్ల సమయం కావటంతో నీరు అవసరం. అందుకే కర్ణాటక రైతులు ముందుచూపుతో కాలువకు అక్కడక్కడా రంధ్రాలు చేసినట్లు సమాచారం. ఈ చిన్న రంధ్రాలే గండ్లుగా మారుతున్నాయి.  ఇలాగే కొనసాగితే కర్నూలు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కర్నూలులో బుధవారం జరుగుబోయే  నీటిపారుదల సలహా మండలి భేటీలోనైనా పాలకులు, అధికారులు స్పందించి గట్టి నిర్ణయం తీసుకుంటారా? లేదా? అని జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు.

 

 గండిపై గండి..

 గతేడాది అక్టోబర్ 24న దిగువ కాలువ మైలురాయి 119/6-120 మధ్యలో కుడివైపు కాలువ లైనింగ్ దెబ్బతిని పెద్దఎత్తున గండి పడింది. ఆ గండి ద్వారా అప్పట్లో ఒక టీఎంసీ నీరు బయటకు వృథాగా పోయింది.

 

  ప్రస్తుతం పడిన గండి కూడా గతంలో పడిన గండికి కొంత దూరంలోనే ఉంది. కర్ణాటక ఆయకట్టు, నాన్ ఆయకట్టు రైతులు కాలువకు ఇరువైపులా పైపులను వేసి అక్రమ జలచౌర్యానికి పాల్పడుతున్నారు. ఆ సమయంలో కాలువ పైభాగంలో కొంతమేర తవ్వి కట్ట కింది భాగంలో ఉన్న చోట పైపులను వదిలేస్తున్నారు. అలా చేయడం వల్ల కట్ట పైభాగం, కింది భాగంలో పైపుల లీకేజి వల్ల కాలువ దెబ్బతింటుందంటూ జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు అక్రమ జలచౌర్యాన్ని అరికట్టడం, కాలువ భద్రతను కాపాడడం లేదంటూ వాపోతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top