ఉత్సాహం ఉరకలు

ఉత్సాహం ఉరకలు - Sakshi


శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం వెల్లివిరిసింది. పార్టీ క్యాడర్ చెక్కుచెదరలేదని, పైగా మరింత బలపడిందని గురువారం జరిగిన ఆ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం రుజువు చేసింది. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు, త్రిసభ్య కమిటీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి. విజయసాయిరెడ్డి, సాగి దుర్గాప్రసాదరాజుల ఆధ్వరం్యలో స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగినసమావేశానికి భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఐదు గంటలపాటు సదీర్ఘంగా జరిగిన సమావేశం జరిగినప్పటికీ క్యాడర్ అంతా చివరి వరకు కూర్చొని నేతల  ప్రసంగాలు వినడం విశేషం.



తొలుత పార్టీ నేతలు అంబేద్కర్, వైఎస్ విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ విధి విధానాలను మరోమారు చర్చించారు. 2015 ఎన్నికల లక్ష్యానికి ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడుగడుగునా ఎండగట్టాలని, రైతుల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఫించన్ల పంపిణీ సహా వివిధ ప్రజా సంక్షేమ పథకాల్లో చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు నిరసనగా వచ్చేనెల 5వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద భారీ ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడంతోపాటు, మహాధర్నా పోస్టర్ విడుదల చేశారు.



భవిష్యత్తులో పార్టీని  నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దేలా అడుగులు వేసేందుకు కార్యకర్తలు సంసిద్ధం కావాలని అగ్రనేతలు సూచించడం అన్ని వర్గాల్లోనూ ఉత్తేజం నింపింది. అనుబంధ సంఘాలే పార్టీకి పునాదలంటూ అన్ని సంఘాల్లోనూ చురుకైన కార్యకర్తలుండి పార్టీని ముందుకు నడిపించాలని కోరారు. ఇదే పంథా ఇకముందూ కొనసాగాలని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు ఓపెన్ డయాస్ అవసరమని నేతలు వ్యాఖ్యానించడం జిల్లా శ్రేణుల్ని ఉత్తేజపర్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాణాత్మకంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే వచ్చే ఎన్నికల్లో భారీ గెలుపు ఖాయమని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూడడం గ్యారెంటీ అని, ప్రజలకు మేలు చేకూర్చేలా, వైఎస్ తనయుడిగా, దమ్మున్న నేతగా జగన్‌కే అన్నీ అనుకూలంగా ఉన్నాయని పెద్దలు చెప్పడం దిగువ శ్రేణి నాయకులు, కార్యకర్తలను  ఉత్తేజపరిచింది.



సినీనటి, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సెల్వమణిని చూసేందుకు విద్యార్థులు, నగరవాసులు ఎగబడ్డారు. ఆమె మాట కోసం కార్యకర్తలు, మహిళలు ఎదురుచూశారు. అభివృద్ది అంటే ఏమిటో వైఎస్ చూపించారని జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి అనేసరికి జనం కరతాళధ్వనులు చేశారు. రాష్ట్రంలో దుష్టపాలన కొనసాగుతోందని ఎమ్మెల్యేలు కళావతి, జోగులు, కలమట విమర్శించారు. మైనార్టీలకు అన్యాయం జరుగుతోందని మేరుగ నాగార్జున పరోక్షంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి విసిరిన చలోక్తులు ఆకట్టుకున్నాయి. మాజీ మంత్రి ధర్మాన చంద్రబాబును తరిమికొట్టే సమయం ఆసన్నమైందని ఉత్తేజభరితంగా ప్రసంగించారు.

 

బాబు మేకవన్నె పులి అని గౌతంరెడ్డి, ఇచ్చిన హామీల్ని బాబు నిలబెట్టుకోవాలని, రుణమాఫీకి సంబంధించి రూ.28వేల కోట్లు వడ్డీయే ఉందని, సాధికారత సంస్థ పేరిట కేవలం రూ.5వేల కోట్లే బాబు ప్రకటించడం ఘోరమని పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తలకే లబ్ధి చేకూర్చేలా అర్థరాత్రి వేళ చంద్రబాబు ప్రభుత్వం 135, 101జీవోలను విడుదల చేసిందని, ప్రజా ప్రతినిధులను కాదని, అర్హులు కాానీవారిని, రౌడీషీటర్లను కమిటీ సభ్యులుగా ప్రకటించి గ్రామాల్లో టీడీపీ ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని, దీనిపై న్యాయపర  చర్యలకు వెళ్తామని, కోర్టులో విజయం సాధిస్తామని ఆయన అన్నారు. కార్యకర్తలు కూడా కొంతమంది తమ తమ గ్రామాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఘోరాలు చోటుచేసుకున్నాయని, పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలతో పలువురిని ఎక్కడెక్కడికో బదిలీ చేసేశారంటూ మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

 

పట్టణంలో పలు సమస్యలుంటే ఇక్కడి మంత్రి పట్టించుకోవడం లేదని, 17యేళ్ల టీడీపీ పాలనలో జిల్లాకు ఒరిగిందేమైనా ఉందంటూ ధర్మాన మాట్లాడడం అంతా దుష్టపాలనను గుర్తు చేసుకున్నారు. సోంపేటలో తలపెట్టిన ధర్మల్ విద్యుత్ సంస్థ అనుమతుల్ని రద్దు చేస్తామని చంద్రబాబు మహానాడులో కూడా తీర్మానించారని, తీరా ఇప్పుడు అదే ప్రాంతం బారువలో ‘క్రిటికల్’ పేరిట మరో సంస్థ నెలకొల్పనున్నట్టు, ఇందుకు జపాన్‌తో ఒప్పందం కుదర్చుకున్నట్టు వస్తున్న వార్తలపై పార్టీ తరఫున ఆందోళన నిర్వహిస్తామని పార్టీ నాయకులు సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఇటీవల కూడా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు అనుమతుల్ని రద్దుచేస్తామని చెప్పిన మాట గుర్తులేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఒకలా, గద్దెనెక్కాక మరోలా వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లిందని, ఆయనో మేకవన్నె పులి అని, ఈ విషయం తెలియక ప్రజలు అమాయకంగా ఆయన్ను గెలిపించారని దీనిని ఎండగట్టేందుకు ముందుకు రావాలని పార్టీ కార్యకర్తల్ని నేతలు పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top