జిల్లాలో డ్రగ్స్ మాఫియా!

జిల్లాలో డ్రగ్స్ మాఫియా! - Sakshi

  • ఇంటర్‌పోల్ హెచ్చరికలను పట్టించుకోని పోలీసులు

  • యథేచ్ఛగా డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తోన్న స్మగ్లర్లు

  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్ దందాతో రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిన ఇద్దరు స్మగ్లర్లు డ్రగ్స్ వ్యాపారంపై కన్నేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ స్మగ్లర్.. వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటికి చెందిన మరొక స్మగ్లర్ మయన్మార్, హాంకాంగ్, మలేషియా, థాయ్‌లాండ్ నుంచి భారీ ఎత్తున హెరాయిన్, కొకైన్, బ్రౌన్‌షుగర్ దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాలో పశ్చిమ మండలాలతో పాటు వైఎస్‌ఆర్ జిల్లాలో నిరుపేదలు బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు విజిటింగ్ వీసాలపై వలస వెళ్తున్నారు.



    మదనపల్లె, రాయచోటి ప్రాంతాల్లోని నర్సులు ఆఫ్రికా ఖండంలోని దేశాలకు వివిధ సంస్థల ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విజిటింగ్ వీసాలపై వెళ్తున్నారు. డ్రగ్స్ స్మగ్లర్ల కళ్లు వీరిపై పడ్డాయి. తమ బంధువులు ఆ దేశాల్లో ఉన్నారని.. తాము ఇచ్చే బ్యాగేజీని వారికి అప్పగిస్తే రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకూ ముట్టచెబుతామంటూ విజిటింగ్ వీసాలపై వెళ్లే వారిని లొంగదీసుకుంటున్నారు. డ్రగ్స్‌తో నింపిన బ్యాగేజీని వారి ద్వారా విదేశాల్లోని తమ ప్రతినిధులకు అప్పగిస్తూ.. మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తున్నారు.

     

    మదనపల్లెకు చెందిన ఛాయాదేవి అనే నర్సు నైజీరియా వెళ్తోండటాన్ని పసిగట్టిన రాయచోటికి చెందిన బడా ఎర్రచందనం స్మగ్లర్.. అక్కడ ఉన్న తమ బంధువులకు ఇవ్వాలని ఓ బ్యాగేజి అందించారు. ఆ బ్యాగేజీలో బీ-కాంప్లెక్స్ క్యాప్సుల్స్‌లో ఆరు కిలోల హెరాయిన్ నింపారు. నైజీరియా విమానాశ్రయంలో సెప్టెంబర్ 25, 2013న కస్టమ్స్ అధికారులకు ఛాయాదేవి పట్టుబడింది. ఆమె నుంచి ఆరు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న తర్వాత నైజీరియా పోలీసులు.. ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంటర్‌పోల్ అధికారులు మన జిల్లా పోలీసులను అప్పట్లో హెచ్చరించారు. కానీ.. ఇంటర్‌పోల్ హెచ్చరికలను జిల్లా పోలీసు అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. ఇది స్మగ్లర్లకు కలిసొచ్చింది. యథేచ్ఛగా డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.



    మార్చి 8న అనంతపురంలోనూ.. మార్చి 15న కడపలోనూ డ్రగ్స్ విక్రయిస్తోన్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని మీనంబాకం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున కువైట్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఆనంద్‌ను ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగేజీలో పది గోధుమ పిండి పొట్లాల మధ్యలో ఉన్న రెండు హెరాయిన్ ప్యాకెట్లు బయటపడటం గమనార్హం. ఆనంద్‌కు కేవీపల్లె మండలం చెరువుముందర కమ్మపల్లెకు చెందిన వెంకటేశ్వరరావు హెరాయిన్ అందించినట్లు ఎన్సీబీ విచారణలో వెల్లడైంది.

     

    ఆ ఇద్దరూ ‘దేశం’ నేతలు



    వెంకటేశ్వరరావు ఆచూకి కోసం ఎన్సీబీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. నైజీరియాలో పట్టుబడిన ఛాయాదేవి, ఇటీవలి కేసులో వెంకటేశ్వరరావు టీడీపీ నేతలు కావడం గమనార్హం. ఎన్సీబీ అధికారుల బృందం డ్రగ్స్ ముఠా కోసం జిల్లాలో తీవ్రంగా గాలిస్తున్నా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం నోరుమెదపకపోవడం కొసమెరుపు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top