అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి

అందరి సహకారంతో  జిల్లా అభివృద్ధి - Sakshi


పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు

నెల్లూరు నెక్ట్స్ మేధోమథన సదస్సుకు నెల్లూరుకు  చెందిన 300మంది ప్రముఖులతోపాటు మంత్రులు హాజరు

స్వదేశీ దర్శన్ కింద జిల్లాకు రూ.100 కోట్లు మంజూరు చేయిస్తా


 

నెల్లూరు(బారకాసు) : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు అందరి సహకారం అవసరమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. స్వర్ణభారత్‌ట్రస్ట్ ఆధ్వర్యంలో  శనివారం స్థానిక కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్‌లో ‘నెల్లూరు నెక్ట్స్’ మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. నెల్లూరు జిల్లా అంటేనే దేశ వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.



ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో నెల్లూరు రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. దుగ్గరాజపట్నం పోర్టుకూడా త్వరలో ఏర్పాటు కానుందని ఇందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నిల్ కూడా వచ్చిందన్నారు. నెల్లూరు నగరంలో నెలకొన్న ప్రధాన సమస్యలైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు రూ.వెయ్యికోట్లు హడ్కో నిధులు మంజూరయ్యాయన్నారు. నెల్లూరు చెరువును సుందరీకరణ చేసి ఆప్రాంతంలో ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు చెప్పారు.



తూపిలిపాళెంలో సముద్ర అధ్యయన కేంద్ర ఏర్పాటుకు సీఎం చేతుల మీదుగా శనివారం శంఖుస్థాపన చేశామన్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ సహాయక మంత్రి డాక్టర్ మహేష్ శర్మ మాట్లాడుతూ దేశాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య సారధ్యంలో ముందుకు వెళ్తున్నామన్నారు. సహజ పర్యాటక కేంద్రాలకు భారతదేశం నెలవుగా ఉందన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యాటకేంద్రాలను తీర్చిదిద్దేందుకు ‘స్వదేశీ దర్శన్’ కింద కేంద్రం నుంచి రూ.100కోట్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.



కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందచేస్తానన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం ఉంటే సరిపోదని చిన్న చిన్న ఆలోచనలు కూడా ముఖ్యమన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే మాట్లాడుతూ జిల్లాకు చెందిన ప్రముఖులు ఎందరో ఉన్నారని వారంతా జిల్లా అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు అందజేస్తే నెల్లూరు నెక్ట్స్ కాకుండా ది నెల్లూరు బెస్ట్‌గా నెంబర్‌వన్‌గా ఉంటుందని ఆకాంక్షించారు.



ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటిస్తే జిల్లా అభివృద్ది చెందేందుకు ఎంతో సమయం పట్టదన్నారు. కలెక్టర్ జానకి మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన అన్ని విషయాలను గణాంకాలతో వివరించారు. కార్పొరేషన్ ఇన్‌చార్జి కమిషనర్ జేసీ ఇంతియాజ్ కార్పొరేషన్ పరిధిలోని పలువిషయాలను వివరించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధిచేసే విషయంలో సహకారం అందిస్తామన్నారు.



ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి రాజ్యసభ నుంచి ఏడాదికి రూ.2 కోట్లు ఆర్థిక సహాయం అందచేస్తామన్నారు.  ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్,మంత్రులు కామినేని శ్రీనివాస్, బొజ్జలగోపాలకృష్ణారెడ్డి,  దీపావెంకట్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి,  మేయర్ అబ్దుల్‌అజీజ్, డిప్యూటీమేయర్ ద్వారకానాథ్, సెల్‌కాన్ ఎండీ గురుస్వామి నాయుడు  పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top