జిల్లా అభివృద్ధికి ఐక్య ఉద్యమం


అనంతపురం సెంట్రల్ : జిల్లా అభివృద్ధికి అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రజాప్రతినిధులు కలసికట్టుగా ఉద్యమించాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ చమన్ ఆధ్వర్యంలో ఈ వారంలో ప్రజాప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలవాలని నిర్ణయించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశహాలులో ఛైర్మన్ చమన్ అధ్యక్షత సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ... జిల్లాలో కరువును ఎదుర్కొవడానికి ముఖ్యమంత్రిని కలుద్దామని గత సమావేశంలో మంత్రులు హామీ ఇచ్చారన్నారు.

 

  సమావేశాల్లో మాత్రమే కరువు గురించి చర్చించడం, తీర్మానాలు చేస్తే ఫలితం ఉండదన్నారు. ప్రభత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. రూ. 10 వేల కోట్లతో రూపొందించిన స్పెషల్ ప్యాకేజీని తీసుకురావాలని కోరారు. ఇందుకోసం తక్షణమే సీఎంను కలిసే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన జెడ్పీ ఛైర్మన్ చమన్ మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే సీఎంను కలిసేందుకు చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్ తీసుకోవాలని ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరిని కోరారు.

 

  పర్యటన ఖరారు అయిన తర్వాత అధికార, ప్రతిపక్ష సభ్యులందరం కలిసి ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా సమస్యలను తీసుకుపోయి నిధుల విడుదలకు పట్టుబడుదామని హామీ ఇచ్చారు. దీనిపై ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి మాట్లాడుతూ... శనివారం సాయంత్రంలోగా ముఖ్యమంత్రిని ఎప్పుడు కలుద్దామనే విషయాన్ని తెలియజేస్తానని సభ్యులకు హామీ ఇచ్చారు. జిల్లాలో తాగునీటికి తీవ్ర సమస్య ఉందని, దీనికి శాశ్వత పరిష్కారంగా రూ. 2200 కోట్లతో రూపొందించిన వాటర్‌గ్రిడ్  ద్వారా సాధ్యమవుతుందని వివరించారు. ప్రస్తుత బడ్జెట్‌లోనే ఈ నిధులు మంజూరు చేసే విధంగా సీఎంకు విజ్ఞప్తి చేద్దామన్నారు. అలాగే హంద్రీనీవాకు ఈ ఏడాది 16.5 టీఎంసీలు నీరు వచ్చిందని, భవిష్యత్‌లో దీనిని 60 టీఎంసీలకు పెంచుకోవాలన్నారు.  ఇందుకోసం కర్నూలు జిల్లా మల్యాల నుంచి జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్ వరకూ లైనింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు.

 

  హెచ్చెల్సీకి మరో 10 టీఎంసీలు అదనంగా నీరు తీసుకురావాల్సి ఉందని, ఇందుకోసం కాలువ వెడల్పు పనులు చేపట్టాల్సి ఉందన్నారు. దీనికి అవసరమైన నిధులు కూడా అడుగుదామని వివ రించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు అనంతకు నిధులు మంజూరు చే సి చెక్కును కూడా రిలీజ్ చేసిందని, అది ఎక్కడుందో తెలుసుకొని సాధించుకోవాలని సూచించారు.

 

 దీనిపై జెడ్పీ ఫ్లోర్ లీడర్, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రరారెడ్డి మాట్లాడుతూ... ప్రజల సంక్షేమం కోసం చేసే ప్రతికార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీగా సంపూర్ణ సహకారం ఇస్తామని ప్రకటించారు. జిల్లా అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ముందే ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిసే విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తాము కూడా వస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, కలెక్టర్ కోనశశిధర్, జెడ్పీ వైఎస్ చైర్మన్ సుభాషిణమ్మ, సీఈఓ రామచంద్ర, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top