పుట్టెడు దుఃఖంలోనూ..


రామసముద్రం: తండ్రి మరణవార్త తెలిసినా దుఃఖాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్ష రాశాడు ఓ విద్యార్థి. ఈ ఘ టన రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీ బూ సానికురప్పల్లె గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బూసానికురప్పల్లె గ్రామానికి చెందిన శ్రీరాములు(40) కుమారుడు వినోద్ పదో తరగతి చదువుతున్నాడు. గురువారం రామసముద్రం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ట్రాక్టర్ పరికరాల కోసం పుంగనూరుకు వెళ్లి తిరిగి వస్తూ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని సమాచారం వచ్చింది. తోటి విద్యార్థులు, పరీక్ష కేంద్రం అధికారులు అతనికి ధైర్యం చెప్పారు. పరీక్ష వదులుకుని వెళ్లిపోతే ఒక ఏడాది వృథా అవుతుందని వారు ఇచ్చిన సలహా మేరకు దుఃఖాన్ని దిగమించుకుని పరీక్ష రాశాడు. పరీక్ష పూర్తికాగానే పరుగున వెళ్లి తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించడం పలువురిని కలచివేసింది.

 

అనుమానాస్పదస్థితిలో తండ్రి మృతి

వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రామసముద్రం మండలంలో గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుడి సోదరుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు.. బూసానికురప్పల్లె గ్రామానికి చెందిన శ్రీరాములు(40) బుధవారం రాత్రి ట్రాక్టర్ పరికరాల కోసం పుంగనూరుకు బైక్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వనగానిపల్లె సమీపంలోని కనకరత్న డాబా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డు పక్కనున్న చెట్లపొదల్లో పడి చనిపోయాడు. గురువారం ఉదయం అటుగా వెళుతున్న కూలీలు గమనించి స్థానికులకు, పోలీసులకు, మృతుని బంధువులకు సమాచారం అందించారు.



రామసముద్రం ఎస్‌ఐ గౌస్‌బాషా ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరాములు మృతదేహం చెట్లలోకి దూసుకుపోయి ఉండడం, ద్విచక్ర వాహనానికి ఎలాంటి నష్టమూ జరగకపోవడం చూసి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా మృతుడి ఎడమ కాలు విరిగిపోయి, వెన్నెముక, మెడ, తల, చేతులపై తీవ్ర గాయాలు కావడంపైనా పలు అనుమానాలు ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. దర్యాప్తులో నిజాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top