టీడీపీలో ‘ఎమ్మెల్సీ' చిచ్చు


- దొరబాబు, అరుణమ్మకు మొండి చేయి

- లాబీయింగ్ చేస్తేనే పదవులంటూ మినీ మహానాడులో గల్లా అసమ్మతి గళం

- ఫలించని చిత్తూరు నేతల తంత్రం

- అనూహ్యంగా గౌనివారికి చోటు

సాక్షి ప్రతినిధి, తిరుపతి:
ఎమ్మెల్సీ పదవుల వ్యవహారం టీటీపీ నేతల్లో చిచ్చు రగిలిస్తోంది. పదవులు ఆశించి భంగ పడిన నేతలు బాబు తీరుపై భగ్గుమంటున్నారు. నిజాయితీ గలవారికి పార్టీలో స్థానం లేదని, పైరవీలు చేసేవారికే అందలం అని గల్లా వ్యాఖ్యనించడం ఇందుకు నిదర్శనం. ఈ పరిణామాలు కిందిస్థాయి కార్యకర్తల్లో చర్చకు దారి తీశాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని ఏకతాటిపై నడపటం కత్తి మీద సామేనని పరిశీలకులు భావిస్తున్నారు.



ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులో టీడీపీ నాయకులు దొరబాబు, గల్లా అరుణకుమారికి చోటు దక్కలేదు.చివరివరకు వారు ప్రయత్నాలు చేసినా అదృష్టం కలిసి రాలేదు. ముఖ్యంగా చంద్రబాబు అడుగులకు మడుగులొత్తేవారికే ఎమ్మెల్సీ పదవులు దక్కాయని పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నడిచిన వారికి సైతం బాబు మొండి చేయి చూపారని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. గతంలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి, ఒక్క ఓటుతో ఓడిపోయిన దొరబాబుకు ఈసారి అవకాశం దక్కుతుందని అందరూ ఊహించారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని గౌనివారి శ్రీనివాసులుకు కట్టబెట్టారు. దొరబాబుకు ఎమ్మెల్సీ  పదవి ఇవ్వాలని చిత్తూరు ఎంపీ శివప్రసాద్, జెడ్పీచైర్ పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ,మేయర్ అనురాధ తదితరులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. చూద్దాంలే అంటూనే సీఎం దాటవేయడంతో నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ పదవుల వ్యవహారంలో మంత్రి మాటను సైతం పరిగణనలోకి తీసుకోనట్లు సమాచారం.



రగులుతున్న అసంతృప్తి

పదవులు ఆశించి భంగపడిన గల్లా అరుణతో పాటు, మరికొందరు బాబు వ్యవహార శైలిపై లోలోన రగిలిపోతున్నారు. ఇటీవల చిత్తూరులో జరిగిన మిని మహానాడులో షో చేసి, హైదరాబాద్ స్థాయిలో లాబీయింగ్ చేస్తేనే పదవులంటూ గల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పని చేసేవారికి పదవులు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని ద్వితీయ శ్రేణి నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు తన వేగుల ద్వారా బాబు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు, గల్లా అరుణకుమారిని త్వరలో హైదరాబాద్‌కు పిలిపించి బుజ్జగించనున్నట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top